ఇందిరమ్మ పాత్రకు విజయశాంతి ఒప్పుకుంటుందా?
on Feb 3, 2018
బాలకృష్ణ భుజానికి చిన్న శస్త్ర చికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన రెస్ట్ లో ఉన్నాడు. ఈ గాయం నయం అయిన వెంటనే... ఆయన ఎన్టీయార్ బయోపిక్ షూటింగ్ మొదలుపెడతాడు. ప్రస్తుతం ఓ వైపు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. తేజా దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నాడు. ఇదిలావుంటే... ఎన్టీయార్ బయోపిక్ కు ‘N.T.R’ అనే టైటిత్ ని బాలయ్య ఖరారు చేశారు. మహానటుని కథలో ఎన్నో నిజజీవిత పాత్రలు కీలకం కానున్నాయ్. వాటిలో ఇండిరాగాంధీ పాత్ర ఒకటి. ఆ పాత్ర కోసం స్టార్ స్టేటస్ ఉన్న స్టార్ హీరోయిన్ కోసం బాలయ్య ప్రయత్నాలు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గా లభోగట్ట.
ఈ పాత్ర కోసం విజయశాంతిని బాలయ్య సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయ్. బాలకృష్ణ, విజయశాంతి అంటే... ఆ కాంబినేషన్ పవర్ ఏంటో అందరికీ తెలిసిందే. జనంమెచ్చిన జంటగా కొన్నేళ్లు ఇండస్ట్రీని ఏలారు వీరిద్దరూ. మళ్లీ ఇన్నాళ్లకు ఇద్దరు కలిసి ఒకే సినిమాకు పనిచేయడం నిజమే అయితే... అది నిజంగా అభిమానులకు శుభవార్తే. అయితే... ప్రస్తుతం విజయశాంతి కాంగ్రెస్ లో ఉన్నారు. మరి అలాంటప్పుడు ఆ పార్టీ దివంగత మహానాయకురాలు ఇందిరమ్మ పాత్ర చేయడానికి విజయశాంతి అంగీకారం తెలుపుతుందా? అనేది ఇక్కడ ప్రశ్న.
అయితే... ఎన్టీయార్ బయోపిక్ లో కథానుగుణంగా ఇందిరమ్మ పాత్ర చాలా గొప్ప పాత్ర. ఆమె స్థాయిని తగ్గించేలా పాత్ర ఉండదని టాక్. దేశాన్ని పరిపాలించే ప్రధాని పాత్ర...పైగా ఇందిరమ్మ పాత్ర అంటే... విజయశాంతి లాంటి గొప్ప ఇమేజ్ ఉన్న వాళ్లే చేయాలనేది బాలయ్య మనోగతం. ఇదిలావుంటే... ఎన్టీయార్ బయోపిక్ అంటే...అందులో అక్కినేని పాత్ర చాలా కీలకం. ఎందుకంటే... 35 ఏళ్లు ఆయనకు సాటి అయినా.. పోటీ అయినా అక్కినేనే. తెలుగు సినిమాకు ఎన్టీయార్, ఏఎన్నార్ రెండు కళ్లుగా భాసిల్లారు. మరి అలాంటి అక్కినేని పాత్ర ఎవరు చేస్తారు?
నాదండ్ల భాస్కరరావుగా ఎవరు కనిపిస్తారు?
చంద్రబాబు పాత్ర చేసి మెప్పించే దమ్మున్న నటుడెవరు?
ఎన్టీయార్ సహధర్మచారిణి... బసవతారమ్మ పాత్ర ఏ హీరోయిన్ చేస్తుంది?
అన్నింటినీ మించి... లక్ష్మీపార్వతి పాత్ర ఎవరు పోషిస్తారు?
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాల్సిందే మన బాలయ్యే. చూద్దాం... ఎవరెవర్ని ఎంపిక చేస్తాడో!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
