ఫ్లాప్ అని ముందే తెలుసు!
on Oct 26, 2017
నోటి దూల వీపుకు చేటు అన్నట్టు తయారైంది పాపం.. జయంత్ సి.పరాంజీ పరిస్థితి. తను ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్ వ్యూలో తన ఫ్లాపుల గురించి.. నిజాలు మాట్లాడాడు. నిజం మాట్లాడితే నిష్టూరాలు రావడం సహజమే కదా. ప్రస్తుతం జయంత్ అవే ఫేస్ చేస్తున్నాడు. ‘సక్సెస్ లో ఉన్నప్పుడూ లేనప్పుడూ ఒకేలా ఉంటారు. అది మీకెలా సాధ్యం?’ అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... ‘టక్కరిదొంగ’ డిజాస్టర్ అయినప్పుడు కూడా నేను కృంగిపోలేదు. వెంటనే ‘ఈశ్వర్’ షూటింగ్ కి వెళ్లిపోయాను. హిట్లు కానీ... ఫ్లాపులు కానీ.. నన్ను ప్రభావితం చేయలేవ్. అదే నా బలం’ అని చెప్పాడు జయంత్. అక్కడితో ఆగితే బావుండేది.. తన ఇంకో డిజాస్టర్ గురించి కూడా మాట్లాడాడు. అక్కడే వచ్చింది చిక్కంతా. ఆ డిజాస్టర్ ఏంటో చెప్పనేలేదు కాదు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘తీన్ మార్’. పైగా ఈ సినిమా గురించి చెబుతూ ‘అది ఫ్లాప్ అవుతుందని నాకు ముందే తెలుసు’ అని నోరు జారాడు. ఇంకేముంది రచ్చ మొదలైంది. ఈ విషయంపై జయంత్ మాటలు ఇలా సాగాయ్.
‘తీన్ మార్’ రీమేక్ సినిమా. అంతకు ముందు కూడా రెండు రీమేక్ లు చేశాను. అవే... లక్ష్మీ నరసింహా, శంకర్ దాదా ఎంబీబీఎస్. వాటిల్లో... మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశాను. అవే ఆ సినిమాలకు కలిసొచ్చాయ్. నిజానికి ‘తీన్ మార్’లో కూడా మార్పులు చేయాలి. కానీ... నాకు మార్పులు జరగాలని అనిపించినా... అక్కడ కుదర్లేదు. మాతృకను మక్కీకి మక్కీ దించాల్సి వచ్చింది. ఆ సినిమా చేస్తున్నప్పుడే ‘ఇది ఫ్లాప్’ ని ఫిక్సయ్యాను. అనుకుందే జరిగింది’ అని చెప్పాడు.
ఇంత మాట్లాడాక పవర్ స్టార్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? ‘ఫ్లాప్ అని తెలిసి తర్వాత కూడా సినిమా ఎందుకు పూర్తి చేశావ్. అంత పెద్ద హీరో అవకాశం ఇస్తే.. దాన్ని సద్వినియోగం చేసుకోకపోగా... ఇప్పుడు ఆ చేదు అనుభవాన్ని గుర్తు చేస్తావా?’ అంటూ జయంత్ పై పవన్ ఫ్యాన్స్ అంతెత్తు లేస్తున్నారు. పాపం.. ఈ విమర్శల నుంచి జయంత్ ఎప్పుడు బయటపడతాడో ఏమో!