రాజా... స్వర రాజాధి రాజాధిరాజా!
on Jun 2, 2015
ఇళయరాజా పాట పాట కాదు.. ఓ పూనకం
ఇళయరాజా స్వరం స్వరం కాదు.. ఓ సాగర సంగమం
ఇళయరాజా ఓ సంగీత దర్శకుడు కాదు.. మనసుకి చికిత్స చేసే డాక్టరు!
గ్రామ్ పోన్ రికార్డులు వెళ్లిపోయాయి.
ఆ తరవాత క్యాసెట్లొచ్చాయి.
అవి మర్చిపోయి.. సీడీల్లోకి దిగిపోయాం.
వాటికీ కాలం చెల్లిపోయి పెన్ డ్రైవ్ లూ చిప్‌లూ వచ్చాయి.
కానీ వాటిలో దాచుకొనే ఇళయరాజా పాట మాత్రం మారలేదు.
సెల్‌ఫోనుల్లో పాత పాటలు దాచుకొంటే... అందులో సగానికి పైగా ఇళయరాజా స్వరాలే ఉంటాయి. అంతకంటే ఈ స్వరజ్ఞానికి మనం ఇచ్చిన స్థానం గురించి ఇంకేం చెప్పగలం??
ఇళయరాజా పాటల జాదూగాడు. ఒక్కసారి చెవులతో వింటే.. మనసుకు చేరిపోతుంది. అక్కడే నిక్షిప్తం అయిపోతుంది. కూనిరాగాలు తీసేలా చేస్తుంది. సాపాటు ఎటూ లేనప్పుడు పాటైనా పాడు బ్రదర్ అని మనల్ని గాయకులుగానూ మార్చేస్తుంది. అభినందన క్యాసెట్లను అరగదీయని ప్రేమికుడు ఉన్నాడంటే నమ్ముతారా?? శంకరాభరణం పాటల్ని నెత్తిన పెట్టుకొని ఊరేగని సంగీతాభిమాని కనిపిస్తాడా?? సీతాకోక చిలుక పాటల్ని ఒక్కసారీ మెచ్చుకొని మూర్ఖుడెవరైనా పుట్టుకొస్తాడా??
మాటే మంత్రము.. మనసే బంధమూ.. ఈ సమతే ఈ మమతే మంగళవాద్యమూ... ఓహ్.. మనకు మత్తొచ్చేస్తుంది. ఆ పాటతో చిత్తయిపోతాం..
మనసు మమత అన్నీ ఇళయరాజాకు ప్రాణప్రదంగా సమర్పించుకొంటాం. అదీ ఇళయరాజా పాటల్లోని గొప్పదనం.
మనం మెచ్చుకొనే మెలోడీలూ ఆయనివే
పూనకంతో ఊగిపోయే ఫాస్టు బీటులూ ఆయనివే
ఆలాపనలో ముంచిన శాస్ర్తీయ గీతాలూ ఆయనవివే..
అసలు మన మనసులో పాట అంటేనే ఆయనైపోయాడు గదా. ఇంతింతై ఇళయరాజాయై అన్నట్టు.. మనసు నిండా పరుచుకుపోయాడు కదా..?
సినిమా చిన్నదో పెద్దదో ఆయనకు అనవసరం.
స్టార్లున్నారా లేదా అన్నది ఇంకా అనవసరం. కథ నచ్చితే స్వరాభిషేకం చేయడమే. అలా ఎన్ని చిన్న సినిమాల్ని బ్లాక్‌బ్లస్టర్లుగా మలచలేదూ... అదే ఇళయరాజా స్పెషాలిటీ. ఒక్కోపాట ఒక్కోయుగం గుర్తుండిపోయేలా ఉంటుంది. కానీ ఆ పాటలన్నీ ఆయన నిమిషాల్లో పుట్టించినవే.
ఆరు పాటలూ అరగంటలో ఇచ్చేశారండీ.. అంటుంటారు వంశీ. వంశీ - ఇళయరాజా ఎంత గొప్ప కాంబినేషన్ అని. సితార, ఏప్రిల్ 1 విడుదల, ప్రేమించు పెళ్లాడు, చెట్టుకింద ప్లీడర్ - ఒకటా రెండూ ఎన్నిపాటలుంటే అన్నీ ఆణిముత్యాలే. మణిరత్నం - ఇళయరాజా కాంబినేషన్ అయితే...
చరిత్రలో మిగిలిపోతుంది. మణి ఆశల విత్తనానికి, రాజా తన స్వరాలతో నీళ్లు పోసి పెంచాడు. ఈ సినిమా ఫట్టేమో అనుకొన్న చాలా సందర్భాల్లో
కేవలం తన ఆర్.ఆర్‌తో ప్రాణం పోసి బతికించాడు. ఇళయరాజాని డాక్టర్ అన్నది అందుకే.
ఇళయరాజా ఇప్పుడు సినిమాలు తగ్గించుకొని రిలాక్స్ అయిపోయారు. మనం మాత్రం ఆయన అందించిన పాటలు వింటూ.. మరింత హుషారు తెచ్చేసుకొంటుంన్నాం. మరో వందేళ్లకు సరిపడినంత సంగీతాన్ని మన ముంగిట్లో పోసేశారు రాజా. ఆయనకు సలాములు చెబుతూ... ఆయన పాటకు మళ్లీ మళ్లీ గులామైపోదాం... జయహో ఇళయరాజా.
( ఈరోజు ఇళయరాజా పుట్టిన రోజు సందర్భంగా)