సిరిసిరిమువ్వతో విశ్వనాధ్ గారి ప్రతిభ సర్వవ్యాప్తమైంది
on Feb 19, 2019
ఈ రోజు మన తెలుగు కళాతపస్వి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత కె.విశ్వనాధ్ గారి జన్మదినోత్సవం.
ఈ సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ... కళాతపస్వి ప్రతిభావైశిష్ట్యాలను తలుచుకుందాం.
1930 ఫిబ్రవరి 19 వ తేదీన గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని పెద్దపులిపర్రు గ్రామంలో జన్మించారు. బాల్యం ప్రాధమిక విద్య పెద్దపులిపర్రులో చేశారు. విజయవాడ లో పాఠశాల విద్యచేశారు. గుంటూరు లో ఇంటర్ డిగ్రీ చేశారు. చెన్నైలో సినిమా స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్ గా సినీరంగ ప్రవేశం చేశారు.అన్నపూర్ణ పిక్చర్స్ నిర్మించిన తోడికోడళ్ళు సినిమా చేస్తున్నప్పుడు దర్శకులు ఆదుర్తిసుబ్బారావు గారి పరిచయం విశ్వనాధ్ గారిని దర్శకత్వం వైపు తీసుకొచ్చిందిట. ఆయన దగ్గర సహాయకుడిగా ఇద్దరు మిత్రులు, చదువుకున్నఅమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి సినిమాలకు సహాయదర్శకుడిగా పనిచేశారు. అప్పుడు విశ్వనాధ్ గారి పనితీరు చూసి నటుడు అక్కినేని నాగేశ్వరరావుగారు ఆనందపరవశులై తమ బ్యానర్ లో దర్శకత్వం చేయమన్నారట. దీనితో అక్కినేని నాగేశ్వరరావుగారి ఆత్మగౌరవం సినిమాతో విశ్వనాధ్ గారు దర్శకుడిగా రంగ ప్రవేశం చేశారు. ఈ సినిమాకు నంది అవార్డ్ వచ్చింది.
సిరిసిరిమువ్వ సినిమాతో విశ్వనాధ్ గారి ప్రతిభ సర్వవ్యాప్తమైంది. శంకరాభరణం తెలుగు చలన చిత్ర చరిత్రలో అద్భుతం. దానికి జాతీయ పురస్కారం లభించింది. ఇంక వరసగా సంప్రదాయం, సంగీతం, ప్రధానాంశాలుగా, సాగరసంగమం, శ్రుతిలయలు, సిరివెన్నెల స్వర్ణకమలం, స్వాతికిరణం చిత్రాలు ఘనవిజయాలు సాధించాయి. కులవ్యవస్ధ, వరకట్నం వంటి సామాజిక అంశాలను ప్రధానాంశాలుగా తీసుకొని దర్శకత్వం చేసిన సప్తపది, స్వాతిముత్యం, స్వయంక్రుషి, శుభోదయం, శుభలేఖ , ఆపద్బాంధవుడు, శుభసంకల్పం రూపొందించారు. ఇటు సంగీతానికి అటు సాహిత్యానికి నటనకి సామాజిక స్ప్రుహకి పెద్దపీటలేసే విశ్వనాధ్ గారు ఎన్నో అవార్డులు పొందారు. ఇప్పటి వరకూ ఇంచుమించు 53 సినిమాలు దర్శకత్వం వహించారు. 1979 లో స్వర్గం సినిమాతో హిందీ సినీరంగ ప్రవేశం చేశారు. 1995 లో శుభసంకల్పం సినిమాతో మంచి నటుడిగా ప్రవేశించి వజ్రం, సంతోషం, స్వరాభిషేకం, నరసింహనాయుడు, ఆడవారిమాటలకు అర్ధాలే వేరులే, ఠాగూర్, నీ స్నేహం,ద్రోహి అతడు, సీమసింహం, లక్ష్మీనరసింహ, ఆంద్రుడు, మిస్టర్ ఫర్పెక్ట్ కలిసుందాంరా, కుచ్చికుచ్చికూనమ్మ, స్టాలిన్ లాంటి సినిమాల్లో మంచి పాత్రల్లో నటించారు.
విశ్వనాధ్ గారి లో కళాత్మకతకి, చాతుర్యానికి సలామంటూ.....పద్మశ్రీ అవార్డు....నాలుగు నేషనల్ అవార్డులు నంది అవార్డులు, ఫిలింపేర్ అవార్డులు, వస్తే....2017 లో దాదాసాహెబ్ ఫాల్కే వచ్చింది. ఇలా కళారంగంలో అహర్నిశలూ పనిచేస్తూ.. అందరినీ అలరిస్తున్న విశ్వనాధ్ గారికి తెలుగువారందరి తరపున తెలుగువన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు.
.......................శుభం...................
- కుల శేఖర్