సుస్వరాల 'పాట'శాల.. సుగంధభరిత పాకశాల - ఘంటసాల
on Dec 4, 2014

అమృతం తాగిన వాళ్లు దేవతలూ, దేవుళ్లూ...!
ఎవరు కాదన్నారు, అమృతభాండాగారం అచ్చంగా వాళ్లదే. అందులో మునకేసి, కేరితంలు కొట్టింది మాత్రం మన ఘంటసాలే.
లేదంటే ఆ మాధుర్యం ఆ గొంతుకు ఎలా వస్తుంది? ఎందుకొస్తుంది..?
ఘంటసాల పాట పాడినట్టు ఉండదు.. మన చెవుల్లో తీయ్యందనం పోస్తున్నట్టుంటుంది!
అది ఆలాపనలా ఉండదు... మన ఊపిరికే కొత్త శ్వాస నేర్పుతున్నట్టుంటుంది.
సంగీతం తెలియని రిక్షావోడు..
సిగర్ కాల్చే కోటీశ్వరుడు.. - అందరూ ఆయన గీతామృత వానలో తడిసి ముద్దయినవాళ్లే. క్లాసూ మాసూ గీతల్ని చెరిపేసిన క్లాసికల్ మాస్ సింగరాయన.
తెలుగు పాటల చరిత్రకు ఘంటసాల ఆది గురువు. ఇప్పటివాడేంటి...?? దశాబ్దాల చరిత్ర వెనకేసుకొని - వేలాది పాటల్ని మనకొదిలి ఆయన ఆయన స్వర్గంలో కచ్చేరి చేసుకొంటున్నారు.
ఈతరానికి ఘంటసాల తెలికయపోవచ్చు.. ఏ ఎఫ్ ఎమ్ రేడియోలోనో `బొమ్మను చేసి ప్రాణము పోసీ...` పాటొస్తుంటే అందులోని కమ్మదనానికి కంటతడి పొంగిపొర్లుతుంటే ఆ కన్నీటిలో ఘంటసాల ఉంటారు..
ఈ తరానికి ఘంటసాల చరిత్ర తెలియకపోవచ్చు.. కానీ ఏ టీవీలోనో `మనసు గతి ఇంతే - మనిషి బతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే..` అనే పాట ఏమరపాటుగా చూసినప్పుడు - మనసెక్కడో కలుక్కుమంటే ఆ మనసులో - ఘంటసాల చరిత్ర ఉంది.
మనసు - మనిషి - మమత .. వీటికి మనం విలువ ఇచ్చేంత వరకూ ఘంటసాల ఉంటారు.. ఉండాల్సిందే.
అద్భుతమైన ప్రేమికుడు
ఆ ప్రేమలో విఫలమైన భగ్న ప్రియుడు
రొమాంటిక్ కథానాయకుడు
బాధ్యతల బాధను మోస్తున్న మధ్య తరగతి మానవుడు
భక్తుడు - దేశభక్తుడు - దేవుడు.... ఇలా అందరి గొంతూ - ఘంటసాలదే!
చిటపట చినుకులు పడుతూ ఉంటే అంటూ రొమాంటిక్ గీతాలు పాడుతున్నప్పుడు ఆ గొంతులో చిలిపిదనం ఉంటుంది
లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అంటూ ఎలుగెత్తి చాటుతున్నప్పుడు ఆ గొంతులో చైతన్యం వినిపిస్తుంది.
గోరొంక గూటికే చేరావు చిలకా అని ఆలపిస్తున్నప్పుడు ఆ స్వరంలో భరోసా ఉంటుంది.
పాడవోయి భారతీయుడా... అని పిలుపునిచ్చినప్పుడు ఆ గానంలో ఉద్దేంగం ఉంటుంది.
ఆయన విషాద గీతాలెన్నని చెప్పేది..? దేవదాసు గ్లాసులోనే కాదు ఘంటసాల గొంతులోనూ విరహం తాండవిస్తుంటుంది.
ఎన్టీఆర్‌కీ ఆయనే, ఏఎన్నార్‌కీ ఆయనే. ఎస్వీఆర్ ఆఖరికి రాజబాబుకీ ఆ గొంతే. ఎవరికి పాడినా అచ్చమైన తేడా చూపించే గొంతు ఆయనది.
ఒకటా రెండా.. వందలు వేల పాటల్ని, మనకు అందించారాయన. జోల పాట, ప్రేమ గీతం, దేశభక్తి ప్రభోదం, భక్తి పారవశ్యం, ప్రేమరాగం అన్నీఘంటసాల పాటలే. ఆఖరికి చివరి శ్వాస విడిచాక కూడా మనతో ఉండాలని `భగవద్గీత`ను భక్తితో మనకందించారాయన.
తెలుగు పాట, తెలుగు మాట ఉన్నంత కాలం ఘంటసాల ఉంటారు! ఆయన పాటల తోటలో విహరిస్తూ, ఆయన గానమాధుర్యంలో తేలియాడుతూ, ఆ పాటల మత్తులో ఊగిపోతూ సాగిపోవడమే మన కింకర్తవ్యం. హాయిగా పాడుకొందాం - పాటల తోటలో విహరిద్దాం - ఘంటసాలను స్మరించుకొందాం!!
(ఈరోజు ఘంటసాల జయంతి సందర్భంగా)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



