రజనీకాంత్ 'దర్బార్'
on Apr 9, 2019
'దర్బార్'... రజనీకాంత్ కొత్త సినిమా టైటిల్ ఇదే. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీ హీరోగా లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రజినీది పోలీస్ అధికారి పాత్ర. ఆయన ఫస్ట్ లుక్ ఈ రోజు (మంగళవారం) విడుదల చేశారు. రజనీ చుట్టూ తుపాకులు.. తూటాలు.. బేడీలు.. పోలీస్ డాగ్స్... ఫస్ట్ లుక్ చూస్తుంటే చాలా హడావిడిగా ఉంది. తలైవా అభిమానులకు పిచ్చపిచ్చగా నచ్చేసింది. ముంబై నేపథ్యంలో కథ సాగుతుందని, పోలీస్ అధికారిగా రజనీ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సమాచారం.
సామాజిక సమస్యలకు వాణిజ్య హంగులు జోడించి సినిమాలు రూపొందించడం మురుగుదాస్ శైలి. చిరంజీవి నటించిన 'ఠాగూర్', 'ఖైదీ నెంబర్ 150' సినిమా కథలు ఆయనవే. తమిళంలో ఆయన తీసిన సినిమాలను తెలుగులో రీమేక్ చేశారు. ఇక తెలుగులో చిరంజీవి హీరోగా 'స్టాలిన్', మహేష్ బాబు హీరోగా 'స్పైడర్' సినిమాలకు మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు రజిని 'దర్బార్'కు కూడా సామాజిక సమస్యతో కూడిన సందేశాత్మక కథను సిద్ధం చేశారట. కమర్షియల్ హంగులతో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఇందులో రజిని సరసన నయనతార కథానాయికగా నటిస్తున్నారు. రజిని కుమార్తె పాత్రలో నివేదాథామస్ నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ స్వరకర్త.