బాలీవుడ్ కి వెళ్ళిపోతున్న డైరెక్టర్ వంశీ పైడిపల్లి!
on Apr 24, 2024
జూనియర్ ఎన్టీఆర్(Jr NTR)తో 'బృందావనం', రామ్ చరణ్(Ram Charan)తో 'ఎవడు', మహేష్ బాబు(Mahesh Babu)తో 'మహర్షి'.. ఇలా టాలీవుడ్ టాప్ స్టార్స్ తో హిట్ సినిమాలు చేసి దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వంశీ పైడిపల్లి(Vamshi Paidipally). అయితే వేరే ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటం వల్లనో లేక ఇతర వేరే కారణాల వల్లనో కానీ, కొంతకాలంగా ఆయనకు తెలుగు స్టార్ హీరోలు అందుబాటులో లేకుండా పోయారు. 'మహర్షి' తర్వాత మహేష్ తో మరో సినిమా చేయాలని.. వెయిట్ చేసీ చేసీ.. కుదరకపోవడంతో కోలీవుడ్ స్టార్ విజయ్ తో 'వారసుడు' చేశాడు. ఆ సినిమా తర్వాత కూడా అదే పరిస్థితి. 'వారసుడు' వచ్చి ఏడాది దాటిపోయినా.. ఇంతవరకు కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించలేదు పైడిపల్లి. టాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా ఇతర ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. అందుకే ఇప్పుడు వంశీ దృష్టి బాలీవుడ్ పై పడినట్లు తెలుస్తోంది.
దర్శకుడు వంశీ పైడిపల్లి తన తదుపరి సినిమాని బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్(Shahid Kapoor) తో చేయనున్నారని సమాచారం. ఇప్పటికే వంశీ వినిపించిన కథ నచ్చి, సినిమా చేయడానికి షాహిద్ అంగీకరించాడని అంటున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందనున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నాడట. దర్శకుడిగా వంశీ పైడిపల్లి ఆరు సినిమాలు తీస్తే.. అందులో ఐదు దిల్ రాజు బ్యానర్ లో చేసినవే. ఇప్పుడు ఆయన మరోసారి దిల్ రాజుతో చేతులు కలపడం విశేషం.
మరోవైపు షాహిద్ కపూర్ కి తెలుగు దర్శకులతో పని చేయడం కొత్త కాదు. సందీప్ రెడ్డి వంగాతో 'కబీర్ సింగ్', గౌతమ్ తిన్ననూరితో 'జెర్సీ' చేశాడు. ఈ రెండు సినిమాలు తెలుగు రీమేక్ లే కావడం విశేషం. వాటిలో 'కబీర్ సింగ్' బ్లాక్ బస్టర్ గా నిలవగా.. 'జెర్సీ' మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇంకో విశేషమేంటంటే.. 'జెర్సీ' నిర్మాతలలో దిల్ రాజు కూడా ఒకరు. షాహిద్ తో రీమేక్ మూవీ 'జెర్సీ' చేసి కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయిన దిల్ రాజు.. మరి ఇప్పుడు ఈ పాన్ ఇండియా మూవీతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.
Also Read