'రాజు' నామ సంవత్సరం
on Jul 22, 2017
ఈ తరంలో నిర్మాత కి గౌరవం తీసుకొచ్చిన వ్యక్తి నిస్సందేహంగా దిల్ రాజు యే. అయినా, రాఘవేంద్ర రావు, చిరంజీవి లాంటి మహానుభావులు కితాబు ఇచ్చిన తర్వాత మనం ఎంత చెప్పండి? మాస్, కమర్షియల్ అంటూ అర్ధం పర్ధం లేని సినిమాలు తీస్తూ పెద్ద నిర్మాతలు చేయి కాల్చుకుంటున్న వేళ, సకుటుంబ సపరివార సమేతంగా చూడగలిగే సినిమాలు తీస్తూ తన నిర్మాణ సంస్థకి గొప్ప గుర్తింపు తెచ్చుకున్న 'రాజు', వరుస విజయాలతో తెలుగు ప్రేక్షకులకి అప్పుడప్పుడు ఊరటనిస్తున్నారు. ఇక ఈ సంవత్సరానికి వస్తే, యే నిర్మాత, హీరో, దర్శకుడికి లేనన్ని హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. శతమానం భవతితో తన విజయ పరంపర మొదలెట్టిన దిల్ రాజు, తర్వాత నేను లోకల్ తో మరో హిట్ కొట్టారు. అల్లు అర్జున్ హీరో గా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన దువ్వాడ జగన్నాధం కొన్ని సెంటర్ లలో పర్వాలేదనిపించినా, మిగతా ఏరియాల్లో నిరుత్సాహపరిచింది.
డీజే తాలూకు మరకల నుండి బయటకి రావడానికి దిల్ రాజు కి పెద్ద సమయం పట్ట లేదు. నిన్న విడుదలయిన ఫిదా మంచి టాక్ తెచ్చుకొని సూపర్ హిట్ దిశగా వెళ్తోంది. సినిమా చూసిన అందరూ సాయి పల్లవి కి ఫిదా అవుతున్నారు. శేఖర్ కమ్ముల తనదయిన మార్క్ సినిమా తీసి, తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. అయినా, ఒక స్క్రిప్ట్ ని జడ్జ్ చేయాలంటే, ఈ తరం నిర్మాతల్లో దిల్ రాజు తర్వాతే ఎవరయినా. ఈ సంవత్సరం ఈ అగ్ర నిర్మాత నుండి ఇంకో రెండు సినిమాలు రానున్నాయి. ఒకటి నాని ఎంసీఏ కాగా, మరోటి రవి తేజ రాజా ది గ్రేట్. ఈ చిత్రాలు కూడా మంచి హిట్లు కావాలని ఆశిద్దాం!