దిల్‌రాజు దగ్గర డబ్బులైపోయాయా?
on May 27, 2015
బళ్లు ఓడలుగా మారడానికి, ఓడలు మళ్లీ బళ్లయిపోవడానికి చిత్రసీమలో అట్టేకాలం పట్టదు. ఎంతోమంది హేమాహేమీలైన నిర్మాతలు.. చివరి రోజుల్లో పూట గడవక దుర్భరపరిస్థితిని ఎదుర్కొన్నారు. ఇప్పటికీ కొంతమంది నిర్మాతలు సినిమాలకు దూరంగా ఉండడమే మంచిదనే నిర్ణయంతో.. చిత్రసీమవైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లోని నిర్మాతల్లో కొందరి పరిస్థితి దుర్భరంగా ఉందని, ఏ క్షణంలో అయినా బోర్డు తిప్పేయొచ్చని.. ఫిల్మ్‌నగర్ వర్గాలు జోస్యం చెబుతున్నాయి. బెల్లంకొండ సురేష్ ఆల్రెడీ నష్టాల ఊబిలో కూరుకుపోయి ఎలా బయటకు రావాలో అర్థంకాక సతమతమవుతున్నాడు. ఇప్పుడు దిల్‌రాజు పరిస్థితీ ఇంతేనని సమాచారం. నిర్మాతగా, పంపిణీదారుడుగా తిరుగులేని స్ట్రాటజీ దిల్‌రాజుది. ఆయన సంస్థ పేరు చెప్పగానే ఎన్నో హిట్ చిత్రాలు కళ్లముందు కదలాడతాయి. హిట్ల వల్ల ఎంత సంపాదించుకొన్నాడో తెలీదుగానీ, ఫ్లాపుల వల్ల మాత్రం చాలా పోగొట్టుకొన్నాడు. ఈ మధ్య ఆయన జడ్జిమెంట్ కూడా తప్పుతోంది. రామయ్యా వస్తావయ్యా సినిమాతో సగం డబ్బులు పోయాయని పరిశ్రమ వర్గాలు చెప్పుకొంటాయి. సీతమ్మవాకిట్లో లాంటి భారీ మల్టీస్టారర్ సినిమా తీసినా ఏం మిగుల్చుకోలేకపోయాడు. కొన్ని చిన్న సినిమాల్లో పెట్టిన పెట్టుబడి గోడకు కొట్టిన సున్నమైంది. ఆ మధ్య పంపిణీదారుడిగానూ నష్టాలొచ్చాయి. అందుకే.. దిల్‌రాజు ప్రస్తుతం కామ్ అయిపోయాడన్న టాక్ వినిపిస్తోంది. కొన్ని సినిమాలకు ఆయన పేరుకే నిర్మాత. డబ్బులు బయట వ్యక్తులు పెడుతున్నారట. ఇక ముందూ.. ఈ పద్ధతినే అనుసరించాలని ఆయన భావిస్తున్నారట. బినామీగా ఉంటూ... సినిమాలు తీస్తే నిర్మాతగా కొనసాగినట్టుంటుంది, దానికి తోడు - తన నిర్మాణ చాతుర్యంతో లాభాలూ తెచ్చిపెట్టొచ్చు. అదీ దిల్‌రాజు నయా స్ట్రాటజీ.