ఎన్టీఆర్ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేశాడట!
on Nov 19, 2019
ఓ వార్త చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే... ఎన్టీఆర్ తనను ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేశాడని దర్శకుడు సురేందర్ రెడ్డి చెప్పిన వార్త! ఓ వారం రోజుల క్రితం ఒక వార్తా ఛానల్ కు సురేందర్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు. 'సైరా నరసింహారెడ్డి' విడుదలై, దాదాపుగా థియేటర్లలో నుండి వెళ్లిపోతున్న సమయంలో వచ్చిన ఇంటర్వ్యూ కావడంతో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదనుకుంట. అయితే, ఉన్నట్టుండి ఆ ఇంటర్వ్యూలో ఒక వీడియో క్లిప్ ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. దీనికి కారణం ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్.
"నేను 'అతనొక్కడే' విడుదల తర్వాత ప్రభాస్ గారితో ఒక సినిమా చేయాలి. ఒక నిర్మాతకు కమిట్మెంట్ కూడా ఇచ్చాను. దురదృష్టవశాత్తూ అప్పుడు ఏం జరిగిందంటే... ఎన్టీఆర్ మేనేజర్ సుకుమార్ అని ఉండేవాడు. తను ఒక రోజు వచ్చి నన్ను తీసుకువెళ్లాడు. రెండు రోజులు నన్ను కూర్చోబెట్టి 'మనం సినిమా ఇలా చేద్దాం, అలా చేద్దాం' అన్నారు. తారక్ నన్ను ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేశారు. మూడు రోజులు నన్ను ఫాలో అయ్యారు. తారక్ పెద్ద హీరో అని కలిశా. ఆయన నాకో కథ చెప్పించారు. నా స్టయిల్ కాదని అనిపించింది. చెప్పాను. తారక్ అడగడంతో చేశా. సినిమా చేశాక చూస్తే అందులో నేను చేసిన తప్పులు కనిపించాయి" అని సురేందర్ రెడ్డి ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.
'అశోక్' తర్వాత సురేందర్ రెడ్డి తీసిన 'అతిథి' కూడా ప్లాప్. ఆ ప్లాప్ నుండి నేర్చుకున్నాని ఆయన చెప్పారు. కానీ, ఎన్టీఆర్ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేశాడనే క్లిప్ ను మాత్రమే యాంటీ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. దీంతో పాటు "ఎన్టీఆర్ కి 'కేజీయఫ్' నచ్చడంతో ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా చేద్దామన్నారు. కథ వినాలి" అని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన క్లిప్ ను కూడా వైరల్ చేస్తున్నారు. నిజానికి, తమిళ సినిమా అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ఇటువంటి వార్స్ ఎక్కువ జరుగుతాయి. ఇప్పుడు తెలుగు సినిమా అభిమానులు కూడా మొదలు పెడుతున్నట్టు ఉన్నారు.