హీరోయిన్లు కాదు.. ఐటెమ్ గాళ్స్
on May 12, 2015
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఈతరం కథానాయికలపై ఘాటైన విమర్శలు చేశారు. ఇప్పుడు హీరోయిన్లు ఎవరూ లేరని, ఉన్నవాళ్లంతా ఐటెమ్ గాళ్సేనని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఓ సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు దాసరి. ఈ సందర్భంగా కథానాయికల్ని టార్గెట్ చేస్తూ.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇది వరకు సిల్క్‌స్మిత, జ్యోతిలక్ష్మి, జయమాలిని, డిస్కోశాంతి లాంటి కథానాయికలు ఉండేవాళ్లని, వాళ్లు కేవలం ఐటెమ్ గీతాలకే పరిమితమయ్యేవారని, ఇప్పుడు కథానాయికలే ఐటెమ్ గాళ్స్‌గా మారిపోయారని అన్నారు. ఇది వరకు సినిమాకి ఒకటో రెండో ప్రత్యేక గీతాలుండేవి.. ఇప్పుడు ప్రతి పాటా అలానే ఉంటుందని చురకేశారు. అందుకే కథానాయికల జీవిత కాలం ఐదారేళ్లకు మించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇది వరకు కూడా దాసరి ఇలానే హీరోయిన్లపై విరుచుకుపడ్డారు. సినిమా ఫంక్షన్లకు రారుగానీ, అవార్డుల కార్యక్రమాలకైతే ఎగేసుకొస్తారన్నారు. అసలు క్రమశిక్షణ లేని కథానాయికలకు అవార్డులివ్వొద్దన్నారు. ఇప్పుడు మరోసారి వాళ్లని టార్గెట్ చేస్తూ మాట్టాడడం పరిశ్రమలో చర్చనీయాంశమయ్యింది.