ఖాన్ త్రయం దూకుడు
on Apr 15, 2015
ఆ ముగ్గుర్లో ఒక్కొక్కరిది ఒక్కోస్టైల్. ఒక్కొక్కరిది ఒక్కో పంథా. ఒకరు మరొకరి పోటీ కాదు. ఎవరితో ఎవరూ సాటిరారు. ఆ ముగ్గురే ఖాన్ త్రయం. ఆమీర్, సల్మాన్, షారుక్. వీళ్లు ఇండస్ట్రీలో అడుగుపెట్టి మూడు దశాబ్దాలకు చేరవవుతున్నారు. అయినా ఇప్పటికీ ఇసుమంతైనా ఆదరణ తగ్గలేదు. ఎంట్రీ ఇచ్చినప్పుడున్న చార్మ్, స్టైల్, ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. సినిమాయే శ్వాసగా బాలీవుడ్ ను శాసిస్తూ దూసుకుపోతున్నారు.
ఇన్నేళ్ల పాటూ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడమంటే మాటలు కాదు. విజయం ఉన్నంతవరకే అంతా వెంట ఉంటారు. వరుసగా ఓ మూడు ఫ్లాపులు పడ్డాయంటే అంతే సంగతులు. కానీ దాదాపు 25ఏళ్లుగా ఇండస్ట్రీలో దూకుడు కొనసాగిస్తున్నారంటే వారు ఎంపిక చేసుకునే కథాంశాలు, వైవిధ్యాన్ని ప్రదర్శించే వారి నటనే కారణం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
వీరిలో మొదటగా చెప్పుకోవాల్సింది బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలే ఇతివృత్తాలు. కథ, కథనమే సినిమాకు ప్రాణం. స్టార్ డమ్ కి దూరంగా సినిమాలు..బాక్సాఫీసు దగ్గర కలెక్షన్ల వర్షం.. ఇదీ ఆమిర్ గురించి క్లుప్తంగా. నవ్యతకు ప్రతిరూపంగా...ఎప్పటికప్పుడు ప్రెష్ లుక్ తో ప్రేక్షకులకు కొత్తదనాన్ని రుచి చూపించడంలో ఆమిర్ తర్వాత ఎవరైనా అని స్ట్రాంగ్ గా చెప్పొచ్చు.
1984లో 'హోలీ' చిత్రంతో హీరోగా అడుగుపెట్టిన అమిర్...1988లో 'ఖయామత్ సే ఖయామత్ తక్' తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఏడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు సాధించగా... బెస్ట్ మేల్ డెబ్యూ అవార్డు సైతం అమిర్ ను వరించింది. ఆ తర్వాత వచ్చిన దిల్ మంచి కమర్షియల్ సక్సెస్ తో పాటూ...ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. 1995లో విడుదలైన రంగీలా....ప్రేక్షకులను రొమాంటిక్ ఫీల్ లో ముంచేసింది. ఆ తర్వాత వచ్చిన రాజా హిందుస్తానితో తొలి ఫిల్మ్ ఫేర్ అందుకున్నాడు. అప్పటి నుంచి అమిర్ నటించిన ప్రతిచిత్రం విమర్శకుల ప్రశంసలందుకున్నవే. అన్నిటి కన్నా ముఖ్యంగా చెప్పుకోదగిన చిత్రం 2001లో వచ్చిన 'లగాన్'. ఈ చిత్రం దేశాన్నే ఓ ఊపు ఊపింది. ఇప్పటికీ ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ చిత్రంలో అమిర్ నటనకు వందకు వందమార్కులు పడడంతో పాటూ ఆస్కార్ కు సైతం నామినేట్ అయింది. అప్పటి నుంచి విలక్షణతకు అద్దంపట్టే కథల ఎంపిక చేసుకుని ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు కొత్తగా కనిపిస్తూ వస్తున్నాడు. ఫనా, తారే జమీన్ పర్, గజినీ, ౩ ఇడియట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆమిర్ గుంచి ఎంత చెప్పినా తక్కువే.
కేవలం వెండితెరపైనే కాదు....బుల్లితెరపైనా అమిర్ మెరుపు మెరిపించాడు. 2012లో ఆయన ప్రారంభించిన సత్యమేవ జయతే... సామాజిక సమస్యలపై శరాలను ఎక్కుపెట్టింది. దీంతో ఇండియన్ టెలివిజన్ ఇండస్ట్రీలో హోస్టింగ్ కు అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా రికార్డ్ సృష్టించాడు. సమాజిక ఇతివృత్తాలను ఎంపిక చేసుకోవడమే కాదు సమాజంలో ఉండే సమస్యలపై కూడా అమిర్ అలాగే స్పందించారు. 2006లో నర్మదాబచావో ఆందోళనకు మద్దతు పలికిన అమిర్ స్వయంగా ధర్నాలో పాల్గొన్నారు. మళ్లీ 2011లో జన్ లోక్ పాల్ కోసం అన్నాహజారే చేపట్టిన దీక్షకు సైతం సంఘీభావం ప్రకటించాడు. 2007లో మేడం టుస్సాడ్ ప్రతిష్టాత్మక ప్రదర్శనలో అమీర్ మైనపు బొమ్మ సగర్వంగా కొలువుదీరింది.
బాలీవుడ్ ను షేక్ చేస్తున్న మరో ఖాన్ కండలవీరుడు అని ముద్దుగా పిలుచుకునే సల్మాన్. అమ్మాయిల కలల రాకుమారుడు. ప్రొఫెషనలిటీ, డైలాగ్ డెలివరీ, స్టన్నింగ్ పర్సనాలిటీ.... భాయ్ స్పెషల్ .1988లో 'బీవీ ఐసే హోతే' తో అరంగేంట్రం చేసిన సల్మాన్...1989లో 'మైనే ప్యార్ కియా'తో కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. ఆ చిత్రంలో మిస్టల్ మన్మధుడిగా మారాడు. ఆ తర్వాత వచ్చిన ఒక్కో చిత్రంలో విజయాన్నందుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కిన సల్మాన్....1994లో హమ్ ఆప్ కే హై కౌన్ తో రికార్డులు బద్దలకొట్టాడు. మాధురితో సల్మాన్ రొమాన్స్ కి బీటౌన్ జనాలు ఫిదా అయిపోయారు. మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటూ....నేషనల్ అవార్డు సైతం సొంతం చేసుకుంది. ఆ తర్వాత సంవత్సరం షారూక్ తో కలిసి నటించిన కరణ్ అర్జున్.. సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అన్నా,దమ్ములుగా షారుక్, సల్మాన్ అదరగొట్టారు.
ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏళ్లు గడుస్తున్నా...ఆదరణ తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న సల్మాన్ 2009 నుంచి దూకుడు పెంచాడు. ఈ ఏడాది విడుదలైన వాంటెడ్ భాయ్ కెరీర్ లో సూపర్ సక్సెస్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన దబాంగ్ రికార్డుల మోతమోగించింది. ఆ తర్వాత విడుదలైన రెఢీ, బాడీగార్డ్, దబాంగ్ 2, ఏక్ థా టైగర్, జైహో, కిక్ ఇవన్నీ వందకోట్ల మార్కు దాటి రెండువందల కోట్ల క్లబ్ లో చేరి అదరహో అనిపించాయి. వెండితెరకే తన మెరుపులు పరిమితం చేయకుండా బుల్లితెరపైనా మంత్రం వేశాడు భాయ్. టెన్ కా దమ్ తో టీఆర్పీ రేటింగ్ మోత మోగించాడు. ఆ తర్వాత బిగ్ బాస్ 4 నుంచి బిగ్ బాస్ 8 వరకూ తనదైన శైలిలో అదరగొడుతూనే ఉన్నాడు. అయితే సల్మాన్ నో ఉన్న గొప్ప విషయం ఏంటంటే....ఎందరో కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ వచ్చాడు. కొత్త హీరోయిన్స్ ను సైతం నేనున్నా అంటూ చేయూతనిస్తుంటాడు.
ఇక బాద్షా రంగంలోకి దిగితే వార్ వన్ సైడే. అదీ కింగ్ ఖాన్ స్పెషల్. ప్యాక్ బాడీ, చార్మింగ్ ఫేస్, ట్రెండీ డైలాగ్స్, అదుర్స్ అనిపించే నటన.....ఇవన్నీ కలగలిపితే షారుక్ ఖాన్. SRK.. ఈపేరే ఓ బ్రాండ్ అంటారు వ్యాపార వర్గాలు. షారుక్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటే చాలు....ఆ ఉత్పత్తులు లబించే ఆదరణ అంతా ఇంతా కాదంటారు. 2014లో అతడి వార్షికాదాయం 400 నుంచి 600 మిలియన్ డాలర్లని, ప్రపంచంలో బిగ్గెస్ట్ మూవీ స్టార్ గా లాస్ ఏంజెల్స్ పత్రిక వెల్లడించింది. అదీ షారుక్ గొప్పతనం.
1980లో టీవీసీరియల్స్ తో నటన ప్రారంభించిన షారుక్ ..1992లో దీవానాతో బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. లవ్ స్టోరీస్ లో విలన్ గా ప్రస్థానాన్ని ప్రారంభించిన షారుక్ అదే లవ్ స్టోరీస్ లో హీరోగా నటించి ఓ స్థాయికి ఎదిగాడు. డర్, బాజీఘర్, అంజామ్ లో విలనీ ప్రదర్శించి....1995లో 'దిల్ వాలే దుల్హానియా లేజాయెంగె'తో ప్రామినెంట్ స్టార్ గా మారాడు కింగ్ ఖాన్. ఈ సినిమా.. ఓ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఆ చిత్రం కథాంశం, పాటలు అన్నీ ఇప్పటికీ ప్రజాదరణ పొందుతున్నాయి. ఆ తర్వాత దిల్ తో పాగల్ హై, కుచ్ కుచ్ హోతా హై, కభీకుష్ కభీ గమ్ లో రొమాంటిక్ డ్రామా పండించన షారుక్ దేవదాస్ తో విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. స్వదేశ్ మూవీతో మెప్పించిన కింగ్ ఖాన్....చెక్ దే ఇండియాతో బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. మహిళల హాకీ కథాంశంతో వచ్చిన ఈ సినిమా చాలా మంది అమ్మాయిల్లో క్రీడలపట్ల సానుకూల స్పందనకు దారి తీసింది.
రేసిజానికి వ్యతిరేకంగా ప్రశ్నలు సంధించిన 'మైనేమ్ ఈజ్ ఖాన్' చిత్రానికి గానూ భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించగా... ఫ్రాన్స్ ప్రభుత్వం.. ఆ దేశపు అత్యుత్తమ హనర్ తో గౌరవించింది. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంటుకు కో ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న షారూక్.. ఐపీఎల్ లోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు. కోల్ కతా నైట్ రైడర్స్ ఓనరైన షారూక్.. తమ జట్టును ఆటతో పాటు కమర్షియల్ గానూ సక్సెస్ బాట పట్టించాడు. మరోవైపు చైల్డ్ ఎడ్యుకేషన్ విభాగంలో బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు.
బాలీవుడ్ ఇండస్ట్రీకి వీళ్లు ముగ్గురూ ఓ ఎత్తేతై.....బిగ్ బీ అమితాబ్ గురించి మాటలు చాలవు, ఏడుపదుల వయసు మీదపడుతున్నా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఐదు పదులకు చేరువవుతున్నా ఇప్పటికీ బిగ్ బీ కి ఆదరణ తగ్గలేదు సరికదా పెరుగుతోంది. చిన్నా పెద్దా అనే తేడాలేదు, కథ, కథనం ముఖ్యం. తనచుట్టూనే సినిమా మొత్తం తిరగాలేననే ఆశ లేదు. ఇలా అయితేనే నటిస్తాననే ఆంక్షల్లేవ్....ఈ లక్షణాలే బిగ్ బీ ని శిఖర స్థాయికి చేర్చాయి. ఆయన రూపం గంభీరం, మాట గంభీరం, అవార్డులు ఆయన ముందు చిన్నబోతాయి. ఎంత ఎదిగినా ఒదగాలనే తత్వం. అదీ ఆయన ప్రత్యేకత. అలాంటి గొప్ప వ్యక్తి ఖాన్ త్రయం గురించి ఏమన్నారంటే.....
సినీ ఇండస్ట్రీకి ఖాన్స్ సేవలు చిరకాలం గుర్తుండిపోతాయన్నారు. సల్మాన్ ఖాన్ స్కూల్ బాయ్ గా ఉన్నప్పటి నుంచి తెలుసన్న బిగ్ బి...ఇప్పటికీ సినిమాల్లో చొక్కా లేకుండా చూస్తున్నానంటూ జోక్ చేశారు. ఇక ఆమిర్, షారూక్ ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నాకే తెలుసన్న ఆయన...వృత్తిలో అసాధారణ నైపుణ్యాన్ని చూపిస్తారని ప్రశంసించారు. షారుక్ మాటలు చాలా ప్రతిభావంతంగా ఉంటాయని.. ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలు పెట్టుకుని.. వాటి సాధనకు కృషి చేస్తాడన్నారు. సినిమా కుటుంబం నుంచి వచ్చిన ఆమిర్ తో ఎంతసేపు గడిపినా... ఆయన ఆలోచనలు అర్థంకావన్నారు. వ్యక్తిగా సల్మాన్ ను ఎవ్వరితోనూ పోల్చలేం అన్న అమితాబ్.....కఠోర శ్రమతో ముందుకెళుతున్నాడని అభినందించాడు. ఖాయ్ త్రయం వందేళ్లపాటు ప్రజల్ని ఎంటర్ టైన్ చేయాలని దీవించారాయన. అలాగే అమితాబ్ సైతం వందేళ్లు ఆయురారోగ్యాలతో నటుడిగా సినీ ప్రియులను అలరిస్తారని...అలరించాలని కోరుకుందాం.