కాపీల గోల ఎక్కువైంది..!
on May 13, 2015
గత కొంతకాలంగా కోలీవుడ్, టాలీవుడ్ లో కాపీల గోలలు ఎక్కువైపోతున్నాయి. పెద్ద పెద్ద దర్శకులు సైతం ఈ వివాదాలలో చిక్కుకొని పోరాటాలు చేయాల్సి వస్తోంది. మురుగదాస్ ఎంత పెద్ద డైరెక్టరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కేవలం సౌత్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా అతడికి గుర్తింపుంది. రమణ, గజిని, స్టాలిన్, కత్తి, సెవన్త్ సెన్స్.. ఇలా ఏ సినిమా చూసినా కథలు రాయడంలో మురుగదాస్ ప్రత్యేకతేంటో తెలిసిపోతుంది. అలాంటి వాడు కత్తి సినమాకు సంబంధించి ‘కాపీ కథ’ వివాదంతో ఏడాదికిపైగా పోరాటం చేశాడు. ఆ తర్వాత కె.ఎస్.రవికుమార్ లాంటి స్టార్ డైరెక్టర్‌కు కూడా ఈ గొడవ తప్పలేదు.
వీళ్లిద్దరి సినిమాలకే కాదు.. ఈ మధ్య తమిళనాట సినిమా విడుదలకు ముందు కాపీ గొడవలు కామన్ అయిపోయాయి. ఇందులో ఎవరిది ఒప్పు, ఎవరిది తప్పు అని ఎవరూ తేల్చలేకపోతున్నారు. కొందరు పబ్లిసిటీ కోసం, డబ్బు లాగడం కోసం కావాలనే ఇలా చేస్తారన్న అభిప్రాయముంది. మరోవైపు కొందరు దర్శకులు నిజంగానే ఐడియాల్ని దొంగిలిస్తారన్న మాట కూడా నిజమే.
ఐతే ఇప్పటిదాకా కోలీవుడ్‌కే పరిమితమైన ఈ గొడవ ఇప్పుడు టాలీవుడ్‌కూ అంటుకుంది. మొన్న నందిని రెడ్డి సినిమాకు సంబంధించిన కాపీ వివాదం రచ్చ రచ్చ అవుతుండగానే.. ఇప్పుడు చిరంజీవి 150వ సినిమా గురించి గొడవ మొదలైంది. నందిని సినిమాకు సంబంధించిన వివాదం మీడియాలో పెద్దగా హైలైట్ కాలేదు కానీ.. చిరు 150కు సంబంధించిన వ్యవహారం కావడంతో ఇది పెద్ద గొడవే అవుతోంది.
ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. ఇంకా షూటింగైనా మొదలు కాని సినిమా గురించి రచ్చ జరుగుతోందిక్కడ. ఇది పబ్లిసిటీ కోసం చేస్తున్న గొడవా.. లేక కాపీ అన్న ఆరోపణల్లో నిజముందా అన్నది రచయితల సంఘం వెంటనే తేల్చాలి. ఇరు వర్గాల్ని వేర్వేరుగా కలిసి వాళ్ల ఐడియాల్ని, ఆలోచనల్ని విని.. ఆ ఆరోపణల్లో నిజమెంతో నిగ్గుతేల్చాలి.