'విక్రమ్' రేంజ్ లో నాగార్జున నెక్స్ట్ మూవీ.. డైరెక్టర్ ఎవరంటే?
on Aug 2, 2022

కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషించిన 'విక్రమ్' మూవీ తమిళ్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాకుండా తెలుగులోనూ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. యాక్షన్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. లోకేష్ సృష్టించిన ఈ సినిమాటిక్ యూనివర్స్ లో ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, సూర్య వంటి స్టార్స్ నటించడంతో ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తెలుగులో అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టి సంచలన విజయాన్ని అందుకున్న 'విక్రమ్' తరహా యాక్షన్స్ థ్రిల్లర్స్ తెరకెక్కించడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే అక్కినేని నాగార్జున 'విక్రమ్' తరహా సినిమాలో నటించే అవకాశముంది.
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కార్తికేయ-2'. ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో 'ఆలీతో సరదాగా' టీవీ షోలో నిఖిల్, చందు పాల్గొనగా.. ఆ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. అందులో తాను నాగార్జునతో 'విక్రమ్' లాంటి సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నానని చందు తెలిపాడు.
నాగార్జున తన అభిమాన నటుడని చెప్పిన చందు.. ప్రస్తుతం ఆయనతో ఓ పోలీస్ కథపై చర్చలు జరుపుతున్నానని చెప్పాడు. నాగార్జునతో 'విక్రమ్' లాంటి పవర్ ఫుల్ స్టోరీతో సినిమా చేస్తానని అన్నాడు. కాగా చందు గతంలో నాగార్జున తనయుడు నాగ చైతన్య హీరోగా 'ప్రేమమ్', 'సవ్యసాచి' సినిమాలు చేశాడు. అందులో 'ప్రేమమ్' ఆకట్టుకోగా, 'సవ్యసాచి' నిరాశపరిచింది. మరి నాగార్జునతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



