మళ్లీ నాలుక్కరచుకున్న శింబు..
on Sep 13, 2016
కోలీవుడ్‌లో వివాదాలకు, ప్రేమాయాణాలకు కేరాఫ్ అడ్రస్ శింబు. మనస్సులోని మాట ఉన్నదున్నట్టు చెప్పడం శింబుకి అలవాటు..గతంలో పలువురు సెలబ్రిటీలపై బాహాటంగానే కామెంట్ చేయడంతో ఆ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఆ మధ్య మనోడు పాడిన "బీప్‌సాంగ్" దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం మహిళలు రచ్చరచ్చ చేయడంతో శింబు క్షమాపణలు చెప్పకతప్పలేదు. తాజాగా కావేరీ నదీ జలాల విషయంలో కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్న తరుణంలో మరోసారి నోరు పారేసుకున్నాడు. కర్ణాటకలో తన సినిమాలు విడుదల చేయబోనని శింబు ప్రకటించినట్టు కథనాలు వచ్చాయి. దీంతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది..శింబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు నెటిజన్లు. నోరు జారడం..నాలుక్కరచుకోవడం మనోడికి అలవాటే కదా..!, ఆగమేఘాల మీద తాను ఆ ప్రకటన చేయలేదని, అసలు కావేరి జలాల అంశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చాడు. తాను ప్రస్తుతం బ్యాంకాక్‌లో ఉన్నానని..తన తాజా చిత్రం "అచ్చం యెంబాథు మదమైయద" షూటింగ్‌లో పాల్గొన్నట్టు తెలిపాడు. మరి శింబు వివరణతో నెటిజన్లు శాంతిస్తారా..? లేదో వేచిచూడాలి.