బుడుగు రివ్యూ
on Apr 16, 2015
పిల్లల నేపథ్యంలో మన తెలుగులో సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. పిల్లల సినిమా అని చెప్పినా.. వాళ్లతో ముదురు డైలాగులు పలికింది.. లేనిపోని పెద్దరికం ఒలకబోయిస్తారు. దాంతో పిల్లల సినిమా అనే ఫ్లేవర్ పోతుంది. పిల్లల కోసమే సినిమా తీస్తే.. పెద్దవాళ్లు చూడరేమో అన్న భయం వాళ్లని వెంటాడుతుంది. కమర్షియల్‌గా ఆ కోణంలో ఆలోచించడం కరెక్టే. అందుకే పిల్లల కథకు పెద్దలకు నచ్చే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడిస్తూ ఓ సినిమా వచ్చింది. అదే.. బుడుగు. ఆఫీసు, మీటింగులు, ప్రాజెక్టులూ అంటూ తిరుగుతూ.. పిల్లల్ని నిర్లక్ష్యం చేయకండి.. వాళ్లకూ కాస్త సమయం కేటాయించండి అనే మాట చెప్పడానికి మన్మోహన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించడం ఈ కథలో కొత్తదనం. మరింతకీ ఈ సినిమా ఎలా ఉంది? బుడుగు ఎవరికి చేరువ అవుతుంది? దీని కథేంటి? తెలుసుకొందాం.. రండి.
రాకేష్ (శ్రీధర్‌రావు ) పూజా (లక్ష్మీ ప్రసన్న)లకు ఇద్దరు పిల్లలు. బన్నీ(మాస్టర్ ప్రేమ్ బాబు) యాపిల్ (డాలీ). బన్నీ కాస్త అబ్‌నార్మల్‌గా ఉంటాడు. తోటి పిల్లలతో ఆడుకోడు.. సరిగా స్కూలుకి వెళ్లడు.. ఒంటరిగా తన ప్రపంచమేదో తనదన్నట్టు బతుకుతుంటాడు. ఇక యాపిల్‌కి మాటలు రావు. ఏం చెప్పాలన్నా సంజ్ఞలతోనే. రాకేష్, పూజా ఇద్దరూ తమ తమ ఉద్యోగాలతో బిజీ బిజీ. ఇద్దరికీ పిల్లలపై ప్రేమ ఉన్నా... టైమ్ కేటాయించలేకపోతారు. చివరికి బన్నీని బోర్డింగ్ స్కూల్‌లో జాయిన్ చేస్తారు. అక్కడ బన్నీ ప్రవర్తన అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అర్థరాత్రి బాత్‌రూమ్‌లో కూర్చుని.. మిగతాపిల్లల్ని భయపెడతాడు. తలకిందులుగా నడుస్తూ వాచ్ మెన్‌ని అల్లాడించేస్తాడు. దాంతో బోర్డింగ్ స్కూల్ నుంచి బయటకు పంపేస్తారు. ఇంట్లో కూడా బన్నీ వింత వింతగా ప్రవర్తిస్తుంటాడు. అర్థరాత్రుళ్లు అరుస్తుంటాడు. దెయ్యం దెయ్యం అంటూ కేకలు పెడుతుంటాడు. దానికి కారణం ఏమిటి? బన్నీని పట్టిపీడిస్తున్న సమస్య ఏమిటి? అందులోంచి ఎలా బయటపడ్డాడు అనేదే ఈ చిత్ర కథ.
మన్మోహన్‌కి ఇదే తొలిచిత్రం. ఓ డిఫరెంట్ జోనర్‌లో కథని ఎంచుకొని.. మంచి ప్రయత్నం చేశాడు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే పిల్లలు ఏమవుతారు? ఒంటిరిగా ఉండే పిల్లల మానసిక ప్రవర్తన ఎలా ఉంటుంది? వాళ్ల భయాలేంటి? వాళ్ల ఆలోచనలు ఎలా ఉంటాయి? ఏయే విషయాలు వాళ్లని ప్రభావితం చేస్తుంటాయి అనే విషయాల ఆధారంగా ఈ కథని నడిపాడు. దానికి కాస్త థ్రిల్లర్ ఎలిమెంట్స్ జోడించి, సైకాలజీని మేళవించిన తీరు ఆకట్టుకొంటుంది. సినిమా చాలా స్లోగా మొదలైనా.. బన్నీ అబ్ నార్మల్‌గా ప్రవర్తించడం మొదలెట్టిన దగ్గర నుంచీ ఆసక్తి మొదలవుతుంది. ఇంట్రవెల్‌లో దెయ్యాన్ని తీసుకొచ్చి... మరింత ఉత్కంఠత పెంచాడు. సెకండాఫ్‌లో సగ భాగం ఏదో సైకాలజీ క్లాసులకు వెళ్లినట్టు అనిపిస్తుంది. ఆ పది నిమిషాలూ బోర్ కొట్టినా... పిల్లల మానసిక ప్రవర్తనను, వాళ్లలో వచ్చే మార్పులనూ పెద్దవాళ్లు గమనించాలన్న విషయం.. ఆయా సన్నివేశాల్లో చెప్పే ప్రయత్నం చేశారు. క్లైమాక్స్‌ని ముందు నడిచే సీన్లు మళ్లీ థ్రిల్ కలిగిస్తాయి. అయితే ఈ కథని చాలా నార్మల్‌గానూ చెప్పొచ్చు. అయితే ఈ కథని థ్రిల్లర్ జోనర్‌లో నడపడం వల్ల.. ఆజోనర్ ఇష్టపడేవారికైనా ఈ సినిమా చేరుతుందని దర్శక నిర్మాతలు భావించి ఉంటారు. పిల్లల కోసం తీసిన సినిమా ఇది. అయితే థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉండడంతో వాళ్లకి ఈ సినిమా చేరువ కాకపోవచ్చు. పైగా కొన్ని క్లూలు ముందే ఇచ్చేయడం వల్ల... ప్రేక్షకులు అసలేం జరుగుతోంది? అనే విషయాల్ని ఈజీగా గెస్ చేసే అవకాశం ఉంది. స్ర్కీన్ ప్లే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే సినిమా ఇంకా గ్రిప్పింగ్‌గా ఉండేది. చూపించిన సీనే మళ్లీ మళ్లీ చూపించినట్టు ఉండడం, స్లో నేరేషన్‌తో సినిమా అక్కడక్కడ బోర్ కొడుతుంది. దాంతో పాటు ఎడిటింగ్ లోపాలూ ఉన్నాయి. జంపింగ్‌లు ఎక్కువయ్యాయి.
పూజాగా లక్ష్మీ నటన చాలా డీసెంట్‌గా ఉంది. తన నటనలో అప్పుడప్పుడూ కాస్త అతి కనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో అదీ లేదు. అమ్మగా తన బిడ్డపై ప్రేమ చూపించే సన్నివేశాల్లో, భయపడే సందర్భంలోనూ బాగా నటించింది. మరీ ముఖ్యంగా సెకండాఫ్‌లో ఓ ఎపిసోడ్ మొత్తం లక్ష్మిపైనే నడుస్తుంది. ఆ సీన్లో మంచి మార్కులు పడతాయి. శ్రీధర్‌కి.. తొలిసారి ఫుల్‌లెంగ్త్ రోల్ దక్కింది. దాన్ని సద్వినియోగం చేసుకొన్నాడు ఈ సినిమాకి బన్నీ పాత్రే కీలకం. దాన్ని ప్రేమ్ చాలా చక్కగా చేశాడు. అబ్‌నార్మల్‌గా బిహేవ్ చేసిన సీన్స్‌లో ప్రేమ్ నటన బాగుంది. ప్రేమ్ చెల్లెలి పాత్రలో కనిపించిన డాలీ చూడ్డానికి క్యూట్‌గా ఉంది. చాలాకాలం తరవాత ఇంద్రజకి ఓ పాత్ర దక్కింది. తనూ ఫ్రూవ్ చేసుకొంది
సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమాలో ఒకే ఒక్క పాట ఉంది. ఆ పాట మాత్రం బాగుంది. అందులోని సాహిత్యం.. కథకు అనువుగా ఉంది. కథలోంచి పుట్టిన పాట విని ఎంతకాలమైందో. ఆర్.ఆర్‌లోనూ సాయి తన పనితనం చూపించాడు. కెమెరాతో పాటు మిగిలిన టెక్నికల్ విభాగాలూ.. శ్రద్ధగా పనిచేశాయి. దాదాపుగా ఒకే ఇంట్లో చుట్టేసిన సినిమా ఇది. కాకపోతే క్వాలిటీ మిస్ అవ్వలేదు. ఇలాంటి సినిమాకి ఇంతకంటే ఖర్చు పెట్టడం కూడా అనవసరమే.
పిల్లలు - వారి చిత్రవిచిత్రమైన ప్రవర్తన వాటి వెనుక ఉండే మానసిక కారణాల నేపథ్యంలో సాగే సినిమా ఇది. పెద్దలకు ఓ పాఠంలా ఉపయోగపడుతుంది. మరి వాళ్లకు చేరువ అవుతుందా, లేదా అనేదే అతి పెద్ద ప్రశ్న.
రేటింగ్: 2.5/5