భగవద్గీతను అవమానించిన బిత్తిరి సత్తి.. సారీ చెప్పమంటే...
on Aug 7, 2024
చేవెళ్ల రవి అలియాస్ బిత్తిరి సత్తి (Bithiri Sathi) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెర మీద తనదైన కామెడీతో ప్రేక్షకులకు చేరువై.. వెండితెరపై కూడా రాణిస్తున్నాడు. అలా నవ్వులు పంచుతూ అందరికి దగ్గరైన బిత్తిరి సత్తి తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు.
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే భగవద్గీతను అనుకరిస్తూ బిత్తిరి సత్తి ఓ కామెడీ స్కిట్ చేశాడు. భగవద్గీతను బిల్లు గీత అంటూ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రీయ వానరసేన బిత్తిరి సత్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. భగవద్గీతను అపహాస్యం చేస్తూ బిత్తిరి సత్తి సోషల్ మీడియాలో వీడియోలు చేస్తున్నారని, హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్న ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
భగవద్గీతపై వీడియో చేయడంతో.. క్షమాపణలు చెప్పాలని, హిందూ సంఘాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నప్పటికీ.. బిత్తిరి సత్తి మాత్రం సారీ చెప్పకుండా తను చేసిన పనిని సమర్ధించుకుంటున్నారు. రాష్ట్రీయ వానరసేన మెంబర్ కేశవ రెడ్డి.. సత్తికి ఫోన్ చేసి మాట్లాడగా.. "నేను కూడా హిందువునే. వేల మందికి నచ్చింది మీకు నచ్చకపోతే నేనేం చేయాలి. ఏదైనా ఉంటే కేసు పెట్టుకోండి." అంటూ బిత్తిరి సత్తి సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సత్తి ఇచ్చిన సమాధానంతో ఆయనపై మరింత ఆగ్రహం వ్యక్తమవుతోంది. బిత్తిరి సత్తి క్షమాపణలు చెప్పాలనే డిమాండ్లు ఎక్కువవుతున్నాయి.
Also Read