భలే మంచి రోజు రివ్యూ
on Dec 25, 2015
స్టార్టింగ్ ప్రాబ్లమ్ అనే మాట వింటుంటాం.
ఓ విషయాన్ని 'ఎత్తుకోవడం'లో ఇబ్బంది పడుతుంటారు కొంతమంది. మొదలెడితే మాత్రం ఆ పని చకచక ఫినిష్ చేస్తారు.
సినిమాలో మాత్రం అందుకు రివర్స్.
కథ ఎత్తుకోవడం ఆహా.. ఓహొ అద్భుతం అన్నట్టుంటుంది. కానీ దాన్ని ముగించే విషయంలో మాత్రం నానా ఇబ్బంది పడిపోతుంటారు.
కానీ.. భలే మంచి రోజు సినిమా.. ఈ రెండింటికీ అందదు. కథని బాగా ఎత్తుకొని - మధ్యలో వదిలేసి - ముగింపుకి వచ్చేసరికి ఓకే అనిపించిన సినిమా... భలే మంచి రోజు. ఇంకొంచెం డిటైల్స్‌లోకి వెళ్తే..
.jpg)
సీత(వామిక)కి పెళ్లంటే చచ్చేంత ఇష్టం. పెళ్లెప్పుడవుతుందా అని ఎదురుచూస్తుంటుంది. మరికొద్దిసేపట్లో పెళ్లనగా.. పెళ్ళికొడుకు పారిపోతాడు. పెళ్లి ఆగిపోతుంది. సరిగ్గా ఆ సమయంలోనే సీతని శక్తి(సాయికుమార్) కిడ్నాప్ చేస్తాడు. మరోవైపు రామ్(సుదీర్ బాబు) కథ. తాను ప్రేమించిన అమ్మాయికి మరొకరితో పెళ్లి నిశ్చయం అవుతుంది. ఓ చర్చిలో పెళ్లి. నన్ను ప్రేమించి ఇంత మోసం చేస్తుందా? అని రామ్ తెగ బాధపడిపోతూ ఉంటాడు. చర్చిలో పెళ్లి చేసుకొంటున్న ఆ అమ్మాయిని ఎలాగైనా చెంపదెబ్బ కొట్టాలనుకొని స్నేహితుడితో కలసి కారులో బయల్దేరతాడు. అనుకోకుండా.. శక్తి కారుని రామ్ కారు డాష్ కొడుతుంది. శక్తి కారులో ఉన్న సీత పారిపోతుంది. అందుకే సీతని నువ్వే తీసుకురావాలి, లేదంటే నీ స్నేహితుడ్ని చంపేస్తా అని బెదిరిస్తాడు. దాంతో గత్యంతరం లేక సీతని కిడ్నాప్ చేస్తాడు రామ్. అక్కడ్నుంచి కథ ఎన్ని మలుపులు తిరిగింది? సీత కథ ఏమైంది? రామ్ ఎలాంటి ఇబ్బందుల్లో పడ్డాడు అన్నదే మిగిలిన స్టోరీ.
ఈ కథని ఎత్తుకొన్న విధానం.. పాత్రల్ని పరిచయం చేసే పద్ధతి, కథలోకి ప్రేక్షకుడ్ని లాక్కెళ్లిన తీరు.. ఇవన్నీ ఆకట్టుకొంటాయి. నిజంగానే ఓ కొత్త సినిమా చూస్తున్న ఫీల్ కలుగుతుంది. ప్రతి సన్నివేశం దర్శకుడు పకడ్బందీగా రాసుకోవడంతో కథనం పరుగులు పెడుతుంది. ఒకొక్క పాత్ర ఎంట్రీ ఇవ్వడం.. కథలో ములుపులు మొదలవ్వడంతో... సినిమా అంతకంతకూ స్పీడవుతుంది. ఇంట్రవెల్ కార్డు దగ్గర ఇచ్చిన ట్విస్టు.. సూపర్. నిజంగానే ఆ ట్విస్టు ఎవ్వరూ ఊహించరు. దాంతో.. ఫస్టాఫ్ ఓ మంచి సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఆ మ్యాజిక్.. సెకండాఫ్‌లో రిపీట్ చేయలేకపోయాడు దర్శకుడు. కథనంలో వేగం ఆటోమెటిగ్గా తగ్గిపోతుంది. సన్నివేశాలన్నీ అక్కడక్కడే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. పైగా చెప్పదలచుకొన్న పాయింట్ తొలి అర్థ భాగంలోనే చెప్పేయడంతో .. సెకండాఫ్ లో రివీల్ చేయడానికి ట్విస్ట్లూ లేక, మేటర్ లేక... నీరుగారిపోయింది. పాత్రల్ని సృష్టించడంలోనూ, పరిచయడం చేయడంలోనూ చూపించిన నేర్పు వాటిని వాడుకోవడంలో చూపించలేకపోయాడు. దాంతో క్లైమాక్స్ వరకూ బండి లాగించడం తప్ప.. మరో మార్గం లేకుండా పోయింది. పైగా... హీరో మైండ్ కి ఏమాత్రం పని పెట్టలేదు. అంతా యాంత్రికంగా సీన్లు జరిగిపోతుంటాయి. పతాక సన్నివేశాల్లో ఫృద్వీని లాక్కొచ్చారు కాబట్టి సరిపోయింది. ఫృద్వీ వచ్చి ఆ పదినిమిషాలూ అల్లాడించేశాడు. దాంతో క్లైమాక్స్‌రొటీనే అయినా.. కామెడీగా వర్కవుట్ అయిపోయింది. రెండో సగంలో దర్శకడు బుర్ర పెట్టి ఆలోచించి స్ర్కిప్టు రాసుకొంటే ఇదో స్వామి రారాలాంటి సినిమాలా మిగిలిపోదును.
సుధీర్‌బాబు మరోసారి తన స్టామినా చూపించాడు. తనకు తగిన పాత్రని ఎంచుకొన్నాడు. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ బాగా మారాయి. హీరోయిన్ పాత్రని పరిచయం చేసిన వరకూ బాగా హ్యాండిల్ చేసిన దర్శకుడు.. ఆ తరవాత ఈ సినిమాలో హీరోయిన్ ఉందన్న విషయాన్ని మర్చిపోయి ఆమె నోటికి ప్లాస్టర్ వేసేశాడు. పోసానిది రొటీన్ కామెడీ. ఫృద్వీ.. సింప్లీ సూపర్బ్ అనిపించాడు. పరుచూరి గోపాలకృష్ణ ఓకే అనిపిస్తారు. ఇక మిగిలిన పాత్రలన్నీ సోసోవే. వీటన్నింటికంటే.. సాయికుమార్ విలనిజం ఆకట్టుకొంటుంది. ఇలాంటి పాత్రలకు సాయికుమార్‌ని ఎందుకు వాడుకోరు..? అనిపించేలా చేస్తుందీ శక్తి పాత్ర.
సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. పాటలొకటే ఇబ్బందిపెట్టాయి. ఆర్.ఆర్ ఈ సినిమా థీమ్ కి అనుగుణంగా సాగింది. కెమెరా, ఎడిటింగ్ అత్యున్నత ప్రతిభ కనబరిచాయి. దర్శకుడిగా శ్రీరామ్ ఆదిత్యకి ఇదే తొలి సినిమా. చిన్న చిన్న సర్దుబాట్లు ఉంటే మన్నించేయొచ్చు. మొత్తానికి ఇదో ప్రామిసింగ్ డెబ్యూ అనే చెప్పాలి. పంచ్‌లు అక్కడక్కడా పేలాయి. సెకండాఫ్ స్ర్కీన్ ప్లే కాస్త ఇబ్బంది పెట్టింది. ఓవరాల్‌గా మంచి అవుట్ పుట్ ఇచ్చాడు.
ఈమధ్య వరుస పెట్టి వస్తున్న అనేక చెత్త సినిమాల మధ్య నిజంగానే .. ఇది భలే మంచి సినిమా అనిపిస్తుంది.
రేటింగ్ : 2.75/5
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



