బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం.. సూపర్ స్టార్ తో కలిసి...
on Nov 17, 2025

సినీ రంగంలో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న అగ్ర నటులు
బాలకృష్ణ, రజినీకాంత్ లకు అరుదైన గౌరవం
సినీ రంగంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna) ప్రస్తుతం టాప్ ఫామ్ లో ఉన్నారు. సీనియర్ స్టార్స్ లో మరెవరికి సాధ్యంకాని విధంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అలాగే ఈ ఏడాది ఆయనకు పలు అరుదైన గౌరవాలు దక్కాయి. భారత ప్రభుత్వం బాలకృష్ణను పద్మభూషణ్ తో సత్కరించింది. కథానాయకుడిగా 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న నటుడిగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనూ స్థానం సంపాదించుకున్నారు. ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. అది కూడా సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth)తో కలిసి అందుకోనుండటం విశేషం.
సీనియర్ స్టార్స్ బాలకృష్ణ, రజినీకాంత్ లకు అరుదైన గౌరవం దక్కింది. నవంబర్ 20 నుండి 28 వరకు గోవా వేదికగా జరగనున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI 2025) వేడుకల్లో వారిని సన్మానించనున్నారు. సినీ రంగంలో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి ఈ గౌరవం దక్కనుంది.
ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ తాజాగా ప్రకటించారు. ఐదు దశాబ్దాలుగా తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న రజినీకాంత్, బాలకృష్ణలను ఇఫి(IFFI) వేడుకల్లో సన్మానించనున్నామని, ఇది భారతీయ సినీ రంగంలో ఒక మైలురాయి అని మురుగన్ అన్నారు.
కాగా, 1974లో విడుదలైన 'తాతమ్మ కల'తో వెండితెరకు పరిచయమైన బాలకృష్ణ.. నటుడిగా గతేడాది 50 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఇక 1975లో వచ్చిన 'అపూర్వ రాగంగళ్'తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన రజినీకాంత్.. ఈ ఏడాది 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఇంతటి ఘనత సాధించి, ఇప్పటికీ అదే ఉత్సాహంతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ఇద్దరికీ.. ఇప్పుడు ప్రతిష్టాత్మక 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా' వేడుకల్లో సన్మానం జరగనుంది.
బాలకృష్ణ, రజినీకాంత్ మధ్య మంచి అనుబంధం ఉంది. రజినీకాంత్ హీరోగా రూపొందుతోన్న 'జైలర్-2'లో బాలకృష్ణ అతిథి పాత్రలో మెరుస్తారని వార్తలొచ్చాయి. ఇద్దరికీ మాస్ లో తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. అలాంటి ఈ ఇద్దరు స్టార్స్ స్క్రీన్ షేర్ చేసుకుంటే చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



