'బాహుబలి: ది ఎపిక్' కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి అయినదొక్కటి..!
on Nov 3, 2025

2015లో విడుదలైన బాహుబలి-1, 2017లో విడుదలైన బాహుబలి-2 ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఇప్పుడు ఈ రెండు భాగాలు కలిపి 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో ఒకే సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రావడమే కాదు.. రీ రిలీజ్ లోనూ బాహుబలి మంచి వసూళ్ళతో సత్తా చాటుతోంది. అయితే ఈ వసూళ్ళు అంచనాలకు తగట్టుగా ఉన్నాయా లేదా? అనే చర్చ జరుగుతోంది.
అక్టోబర్ 30 సాయంత్రం ప్రీమియర్స్ తో థియేటర్లలో 'బాహుబలి: ది ఎపిక్' సందడి మొదలైంది. వరల్డ్ వైడ్ గా ఎన్నో వండర్స్ క్రియేట్ చేసిన బాహుబలి రెండు భాగాలను ఒకే సినిమాగా తీసుకురావడంతో.. ఎపిక్ పై అందరిలో ఆసక్తి కలిగింది. అందుకు తగ్గట్టుగానే భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. త్వరలోనే రూ.50 కోట్ల క్లబ్ లో చేరేలా ఉంది.
ప్రీమియర్స్ తో కలిపి మొదటి రోజు 'బాహుబలి: ది ఎపిక్' ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.20 కోట్ల గ్రాస్ రాబట్టింది. రెండో రోజు రూ.11 కోట్లకు పైగా గ్రాస్, మూడో రోజు రూ.9 కోట్లకు పైగా గ్రాస్ తో సత్తా చాటి.. మూడు రోజుల్లోనే రూ.40 కోట్ల గ్రాస్ సాధించింది. ప్రస్తుతం ఇతర పెద్ద సినిమాల తాకిడి లేకపోడం, ప్రేక్షకులకు ఈ మూవీ చూడటానికి ఆసక్తి చూపిస్తుండటంతో.. మరికొద్ది రోజుల పాటు ఈ వసూళ్ల జోరు కొనసాగే అవకాశముంది.
Also Read: ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ గొడవ.. అసలు మేటర్ బయటకొచ్చింది!
'బాహుబలి: ది ఎపిక్' కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ.17 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిందని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. ప్రీమియర్స్ రూ.1.2 కోట్లు, మొదటి రోజు రూ.7.85 కోట్లు, రెండో రోజు రూ.4.75 కోట్లు, మూడో రోజు రూ.3.5 కోట్లతో.. ఇప్పటిదాకా తెలుగు నాట రూ.17.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఏరియాల వారీగా చూస్తే.. నైజాంలో రూ.8.9 కోట్లు, సీడెడ్ లో రూ.1.9 కోట్లు, ఆంధ్రాలో రూ.6.5 కోట్లు రాబట్టింది.
తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే వసూళ్ళు రాబడుతున్న 'బాహుబలి: ది ఎపిక్'.. రెస్టాఫ్ ఇండియా పరవాలేదు అనిపించుకుంటోంది. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కలిపి రూ.5.9 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. నార్త్ ఇండియాలో రూ.5.65 కోట్ల కొల్లగొట్టింది. ఇండియాలో ఇప్పటిదాకా రూ.29 కోట్లు గ్రాస్ సాధించిన 'బాహుబలి: ది ఎపిక్'.. ఓవర్సీస్ లో రూ.11 కోట్లతో సత్తా చాటింది. దీంతో ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా రూ.40 కోట్ల గ్రాస్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్ లో వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. రూ.50 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
రీ రిలీజ్ లో ఒక మూవీ రూ.50 కోట్లు కలెక్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అయితే అక్కడుంది 'బాహుబలి' కావడంతో ఇంకా ఎక్కువ వసూళ్ళు వస్తాయని అందరూ భావించారు. ట్రేడ్ వర్గాలు కూడా 'బాహుబలి: ది ఎపిక్' రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరడం ఖాయమని రిలీజ్ కి ముందు అంచనా వేశాయి. కానీ, ఇప్పుడు ఇతర భాషల ప్రేక్షకుల నుండి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించట్లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వంద కోట్ల అంచనా నిజమయ్యేలా కనిపించడంలేదు. చూద్దాం మరి ఫుల్ రన్ లో ఎన్ని కోట్లు కొల్లగొడుతుందో.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



