రాజమౌళి గేమ్‌ప్లాన్ మారిందా??
on Aug 18, 2015
బాహుబలి 1.. రికార్డులు కొల్లగొట్టీ కొల్లగొట్టీ అలసిపోయింది. బాహుబలి ప్రభావం కొన్ని చోట్ల ఇంకా ఉన్నా.. చాలా చోట్ల 'శ్రీమంతుడు' జోరు చూపించడంతో ఇప్పుడిప్పుడే బాహుబలి సైడ్ కావల్సివస్తోంది. రాజమౌళి అండ్ టీమ్ కూడా బాహుబలి 1 వసూళ్లేంటి? ఎక్కడ నుంచి ఎంత రాబట్టుకొంటోంది? అనే విషయాల్ని పూర్తిగా పక్కన పెట్టి బాహుబలి 2పైనే మనసు పెట్టారు.
సెప్టెంబరులో బాహుబలి 2 సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఇప్పటికే 30 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. 2016లో వేసవిలో ఈ సినిమాని విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా బడ్జెట్, మార్కెటింగ్ విషయంలో రాజమౌళి గేమ్ ప్లాన్ మారినట్టు తెలుస్తోంది. బాహుబలి 1 దాదాపుగా రూ.500 కోట్లు వసూలు చేసింది. ఆ ధీమాతో బాహుబలి 2 బడ్జెట్ పెంచడానికి రాజమౌళి రెడీ అయిపోయాడట. బాహుబలి సూపర్ డూపర్ హిట్టయినా కొంతమంది విమర్శకులు ఈ సినిమాని టార్గెట్ చేశారు. టెక్నికల్ వాల్యూస్ ని మినహాయిస్తే.. ఈ సినిమాలో ఏం లేదని తేల్చేశారు. అందుకే కథ విషయంలో రాజమౌళి ఇప్పుడు తర్జనభర్జనలు పడుతున్నాడని టాక్. ఛత్రపతి రేంజులో ఎమోషన్ సీన్స్‌ని కొత్తగా రాసుకొంటున్నాడని, ఈ సీన్స్ వల్ల బాహుబలి 2లో డెప్త్ పెరగబోతోందని తెలుస్తోంది.
బాహుబలి ఓ విజువల్ వండర్‌గా నిలిచింది. పార్ట్ 2లో అంతకు మించి అద్భుతాలు చూపించాలి. అందుకే రాజమౌళి కూడా ఈ విషయంపై దృష్టిపెట్టాడట. అవసరమైతే ఇప్పటి వరకూ షూట్ చేసిన 30 శాతంలో రీషూట్ చేయడానికైనా వెనకాడకూడదని నిర్ణయించుకొన్నట్టు తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఎంత ఖర్చు పెట్టినా ఫర్వాలేదన్న నిర్ణయానికి వచ్చాడట. ఇలా ఈ సినిమా బడ్జెట్ పెంచుకొంటూ పోతే బాహుబలి 2కి కనీసం మరో రూ.150 కోట్లు అవుతుందని నిర్మాతలు అంచనా వేసుకొన్నారు.
అయితే రాజమౌళి మాత్రం రెండొందల కోట్లయినా ఓకే అనేట్టున్నాడట. అవసరమైతే... పెట్టుబడులను ఆహ్వానిద్దాం.. బాలీవుడ్ నిర్మాణ సంస్థలతో టై అప్ పెట్టుకొందాం అంటున్నాడట. ఈ ఆలోచన కూడా సరైనదే అనిపిస్తోంది. ఎందుకంటే బాహుబలి 1 వసూళ్లు, ఈ సినిమా అందుకొన్న మైలురాళ్లు చూసి బాలీవుడ్ సైతం ఆశ్చర్యపోయింది. వాళ్లూ ఎంతైనా పెట్టుబడి పెట్టడానికి వెనుకాడరు. అందుకే.. బాహుబలి 2 బడ్జెట్ డబుల్ చేయడానికి నిర్మాతలు కూడా ఓకే అన్నారని తెలిసింది. మరి జక్కన్న ... ఈ సినిమా ఇంకే రేంజులో ఆవిష్కరిస్తాడో చూడాలి.