ENGLISH | TELUGU  

రివ్యూ : ఆటాడుకుందాం రా

on Aug 19, 2016

మ‌న ద‌ర్శ‌కులు కొత్త‌గా ఆలోచించ‌డం మానేసి చాలాకాలం అయ్యింది. పాత క‌థ‌ని ప‌ట్టుకొని ప్ర‌యాస ప‌డ‌డం ఆగ‌లేదు. దాంతో చూసిన సినిమానే కొత్త‌గా టికెట్ కొనుక్కొని మ‌ళ్లీ చూడాల్సిన 'దుస్థితి' దాపురించింది. ఇది వ‌ర‌కు 'మాది నిజంగా కొత్త క‌థ‌' అని చెప్పి న‌మ్మించి థియేట‌ర్ల‌కు ర‌ప్పించే వారు. కానీ ఇప్పుడు అది కూడా చెప్ప‌డం లేదు. `కొత్త క‌థ అని చెప్పంగానీ.. స‌న్నివేశాల‌న్నీ ఫ్రెష్‌గా ఉంటాయి` అని ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు ఇవ్వ‌డం మాత్రం బాగా నేర్చుకొన్నారు. 'ఆటాడుకుందాం రా' సినిమా విడుద‌ల‌కు ముందు సుశాంత్ చెప్పిన మాట కూడా ఇదే. క‌నీసం సుశాంత్ అయినా ఇచ్చిన మాట‌మీద నిల‌బ‌డ్డాడా?  లేదంటే ఇది కూడా పాత చింకాయ్ ప‌చ్చ‌డేనా..?  తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే. 

* క‌థ‌

విజ‌య్ రామ్ (ముర‌ళీ శ‌ర్మ‌), ఆనంద్ ప్ర‌సాద్ (ఆనంద్‌) ఇద్ద‌రూ ప్రాణ స్నేహితులు. వ్యాపారంలో ఒక్కో మెట్టూ ఎదిగి ఉన్న‌త స్థానానికి చేరుకొంటాడు. ఆనంద్ ప్ర‌సాద్ మాట‌లు న‌మ్మి ఓ పెద్ద కాంట్రాక్ట్ చేప‌డ‌తాడు విజ‌య్‌రామ్‌. అయితే... అందులో భారీగా న‌ష్ట‌పోతాడు. త‌న ఆస్తి మొత్తాన్ని కోల్పోతాడు. దీనంత‌టికీ కార‌ణం ఆనంద్ ప్ర‌సాద్ చేసిన మోస‌మే.. అని తెలుసుకొంటాడు. నిజానికి ఆనంద్ చాలా మంచోడు. ఈ కుట్ర‌లో ఎలాంటి భాగం లేదు. కానీ విజ‌య్‌రామ్ న‌మ్మ‌డు. దాంతో ఇద్ద‌రు స్నేహితులు దూరం అవుతారు.

పాతికేళ్ల త‌ర‌వాత విజ‌య్ రామ్ త‌న త‌మ్ముడి పెళ్లి కోసం రైస్ మిల్‌ని అమ్మాల‌నుకొంటాడు. అలా అమ్మాలంటే చెల్లాయి సంత‌కం కావాలి. తాను ఇర‌వై ఏళ్ల క్రిత‌మే ఇంటికి దూర‌మ‌య్యింది. రైస్ మిల్ అమ్మ‌డానిఇక స‌హాయం చేయ‌డానికి  త‌న కొడుకు కార్తిక్ (సుశాంత్‌)ని ఇండియా పంపిస్తుంది. కార్తిక్ అంటే విజ‌య్ రామ్ కి గిట్ట‌దు. మ‌ర‌ద‌లు శ్రుతి (సోన‌మ్‌) కూడా అస‌హ్యించుకొంటుంది. ఇలాంటి వాతావ‌ర‌ణంలో అడుగుపెట్టిన కార్తిక్ మెల్లిమెల్లిగా అంద‌రికీ ద‌గ్గ‌ర‌వుతాడు. రైస్ మిల్ అమ్మ‌కుండానే ఆ ఇంటి స‌మ‌స్య‌ల్ని తీరుస్తాడు. స‌రిగ్గా అప్పుడే కార్తిక్ విజ‌య్‌రామ్ మేన‌ల్లుడు కాద‌న్న నిజం తెలుస్తుంది. మ‌రి కార్తిక్ ఎవ‌రు?  ఆ ఇంటికి ఎందుకు వెళ్లాడు?  ఆ ఇంటి స‌మ‌స్య‌ల్ని ఎందుకు తీరుస్తున్నాడు?  అనేదే మిగిలిన క‌థ‌. 

* విశ్లేష‌ణ‌

తెలుగు సినిమా క‌థ‌లు రాసుకోవ‌డానికి ఎలాంటి లాజిక్కులూ అవ‌స‌రం లేద‌ని న‌మ్మి రాసుకొన్న క‌థ ఇది. క‌థానాయ‌కుడు ఏం అనుకొంటే అది.. ఎలా అనుకొంటే అలా జ‌రిగిపోతుంది. సినిమాల్లో ఇంతే.. అని సీను సీనుకూ స‌ర్దుకుపోవాలి. లాజిక్‌లు మాట్లాడం అనుకొన్న‌వాళ్లు మాత్ర‌మే ఈ సినిమా చూడాలి.  ఈ సినిమా చూస్తుంటే ట్రాకుల కోస‌మే క‌థ రాసుకొన్నారా అనే డౌటు రావ‌డం ఖాయం. ఫ‌స్టాఫ్‌లో టీవీ సీరియ‌ల్ ఎపిసోడ్, సెకండాఫ్‌లో టైమ్ మిష‌న్ ఎపిసోడ్లు ప‌క్క‌న పెడితే... ఈ సినిమాలో క‌థ కోసం న‌డిచిన స‌న్నివేశాలు చాలా త‌క్కువ‌. టైమ్ మిష‌న్ అన్న‌ది కేవ‌లం ఎపిసోడ్ మాత్ర‌మే. విల‌న్‌ని బ‌కరా చేయ‌డానికి హీరో ఆడిన నాట‌కం. ఆ నాట‌క‌మే గంట‌పాటు సాగితే ఎలా??  అంటే సినిమా చూస్తున్న‌ట్టా?  నాట‌కం చూస్తున్న‌ట్టా?  సీరియ‌ల్ ఎపిసోడ్‌తో కూడా క‌థ‌కు ఎలాంటి సంబంధం ఉండ‌దు.

త‌న మావ‌య్య‌ని మోసం చేయాల‌నుకొన్న‌వాడ్ని కొట్టాల‌నుకొంటాడు హీరో. అలాంట‌ప్పుడు నేరుగా వెళ్లి కొట్టేయొచ్చు క‌దా. అప్పుడు హీరోయిజం అయినా ఎలివేట్ అయ్యేది. ఇలా ఓ సీరియ‌ల్ రూపంలో డ్రామా ఆడి, డ‌బ్బులు త‌గ‌లేసి అప్పుడు కొట్ట‌డం ఎందుకు??   కేవలం ఫృద్వీ కోసం ఓ త‌మాషా క్యారెక్ట‌రు రాసుకోవ‌డానికీ, ఆ పేరుతో సినిమాని వీలైనంత సాగ‌దీయ‌డానికీ త‌ప్ప ఇలాంటి స‌న్నివేశాల‌తో ఉప‌యోగం లేదు.

టైమ్ మిష‌న్ కాన్సెప్టు కూడా అంతే. అదేం కొత్త‌గా లేదు. ఇలాంటి ఎపిసోడ్లు బాద్‌షాలో చూశాం. దూకుడులో విల‌న్‌ని బ‌క‌రా చేయ‌డానికి ఓ డ్రామా ఆడ‌తాడు. అది 5 నిమిషాల‌కు మించి ఉండ‌దు. కాబ‌ట్టి క‌థ‌లోంచి బ‌య‌ట‌కు వ‌చ్చామ‌న్న ఫీలింగ్ ఉండ‌దు. కానీ ఈ సినిమాలో అలా కాదు... గంట సేపు సాగింది ఆ ఎపిసోడ్‌. పైగా నాగార్జున‌, వెంక‌ట్‌, నాగేశ్వ‌ర‌రావు, అఖిల్, నాగ‌చైత‌న్య‌, నాగ‌సుశీల అంటూ ఆ కుటుంబంలో వ్య‌క్తుల పేర్లు, వాళ్లు చేసిన సినిమాల పేర్లు అన్నీ వాడేసుకొన్నారు. దాంతో కొత్త‌గా ప్ర‌జెంట్ చేసే అవ‌కాశం వ‌చ్చినా దాన్ని స‌ద్వినియోగం చేసుకోలేదు. విల‌న్ పాత్ర పూర్తిగా డ‌మ్మీ. ఇక హీరోయిజం ఎలివేట్ అయ్యేదెక్క‌డ‌?

* న‌టీన‌టుల ప్ర‌తిభ‌
సుశాంత్ లుక్ మారింది. డ్ర‌స్సులు మారాయి. కానీ న‌ట‌న మార‌లేదు. సేమ్ టూ సేమ్‌. డైలాగ్ చెప్ప‌డంలో ఇంకా మొహ‌మాట‌ప‌డుతున్నాడు. అయితే డాన్సులు బాగా చేశాడు. అమ్మాయిలా పెదాల‌కు లిప్‌స్టిక్ పూసుకోవ‌డం ఏమిటో?  క‌థానాయిక జీరో. ఆమె గురించి ఎంత త‌క్కువ‌గా మాట్లాడుకొంటే అంత మంచిది. ముర‌ళీ శ‌ర్మ ఓకే. ఫృద్వీ కాస్త న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు. బ్ర‌హ్మానందం న‌వ్వించ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. పోసాని అల‌వాటు ప్ర‌కారం అరిచాడు.

* సాంకేతికంగా..

అనూప్ పాట‌లు, నేప‌థ్య సంగీతం సోసోగానే ఉన్నాయి. నిర్మాణ విలువ‌లు బాగున్నా.. గ్రాఫిక్స్ చీప్ గా ఉన్నాయి. బ్లూమేట్‌లో తీసిన సీన్ అని ఈజీగా అర్థ‌మైపోతోంది. శ్రీ‌ధ‌ర్ సిపాన పెన్ను ఈ సినిమాలో మాత్రం ప‌నిచేయ‌లేదు. జి.నాగేశ్వ‌ర‌రెడ్డి కొత్త‌గా ఆలోచించాల్సిన అవ‌స‌రాన్ని ఈ సినిమా నొక్కి చెబుతుంది. 

* ఫైన‌ల్ పంచ్ :

అంద‌రూ క‌ల‌సి ఆడియ‌న్స్‌తో ఆటాడేసుకొన్నారు

రేటింగ్: 0/5

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.