ENGLISH | TELUGU  

అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి మూవీ రివ్యూ

on Apr 18, 2025

 

తారాగణం: నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, సాయి మంజ్రేకర్, సోహైల్ ఖాన్, శ్రీకాంత్, పృథ్వీ రాజ్ తదితరులు
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
డీఓపీ: రామ్ ప్రసాద్
ఎడిటర్: తమ్మిరాజు
రచన, దర్శకత్వం: ప్రదీప్‌ చిలుకూరి
నిర్మాతలు: అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు
బ్యానర్స్: అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్
విడుదల తేదీ: ఏప్రిల్ 18, 2025

 

జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాలతో అలరిస్తుంటాడు నందమూరి కళ్యాణ్ రామ్. బింబిసారతో బ్లాక్ బస్టర్ అందుకున్న కళ్యాణ్ రామ్.. తన గత రెండు చిత్రాలు 'అమిగోస్', 'డెవిల్'తో సక్సెస్ చూడలేకపోయాడు. ఇప్పుడు 'అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కళ్యాణ్ రామ్ తల్లిగా విజయశాంతి నటించడం, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి ఈ చిత్రం ఎలా ఉంది? కళ్యాణ్ రామ్ కి విజయాన్ని అందించేలా ఉందా లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. (Arjun Son Of Vyjayanthi Movie Review)

 

కథ:
వైజయంతి(విజయశాంతి) సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్. ఆమెకు డ్యూటీ అన్నా, కొడుకు అర్జున్(కళ్యాణ్ రామ్) అన్నా ప్రాణం. అర్జున్ కూడా తల్లిని ప్రాణంగా ప్రేమిస్తాడు. తల్లి స్ఫూర్తితో ఐపీఎస్ ఆఫీసర్ కావాలని కలలు కంటాడు. ఆ కలని సాకారం చేసుకోవడానికి కష్టపడి చదువుతాడు. త్వరలో ఒంటిమీద యూనిఫామ్ వేసుకుంటాడు అనుకునే టైంకి అర్జున్.. ఓ క్రిమినల్ లా మారిపోతాడు. వైజాగ్ సిటీ మొత్తాన్ని తన కంట్రోల్ లో తెచ్చుకొని, సమాంతరంగా ఒక ప్రభుత్వాన్నే నడుపుతుంటాడు. ఐపీఎస్ కావాల్సిన అర్జున్, క్రిమినల్ ఎందుకయ్యాడు? ప్రాణంగా ప్రేమించిన కొడుకుని జైలుకి పంపించాలని వైజయంతి ఎందుకు అనుకుంది? వైజయంతిని చంపాలనుకున్న ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పఠాన్(సోహైల్ ఖాన్) ఎవరు? అతని నుంచి తన తల్లి వైజయంతిని కాపాడి, అర్జున్ మళ్ళీ ఆమెకు దగ్గరయ్యాడా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

 

విశ్లేషణ:
ఈ మధ్య రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు పెద్దగా రావట్లేదు. ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాలను చూడటానికి అంతగా ఆసక్తి చూపించడంలేదు. అయితే కాసేపు సరదాగా నవ్వుకునే కామెడీ సినిమాలు చూస్తున్నారు, లేదంటే విజువల్ వండర్స్ చూడటానికి ఇష్టపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాతో కళ్యాణ్ రామ్ వస్తున్నాడని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు ఇలా యాక్షన్, ఎమోషన్స్ మేళవింపుతో వచ్చిన కమర్షియల్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేశాయి. కళ్యాణ్ రామ్ కెరీర్ లో కూడా 'అతనొక్కడే' లాంటి బ్లాక్ బస్టర్ మూవీ ఉంది. దీంతో వింటేజ్ వైబ్స్ ఉంటాయని ఎక్కడో చిన్న ఆశ. కానీ, అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. అప్పుడు 'అతనొక్కడే' సినిమా వర్కౌట్ అయిందంటే.. అందులో బలమైన కథాకథనాలు ఉన్నాయి. కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ అన్నీ చక్కగా కుదిరాయి. అందుకే ఇప్పటికీ ఆ సినిమా చూడగలం. కానీ, అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతిలో అవేవీ లేవు. కథాకథనాల్లో బలం లేదు. ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ కొడుకు క్రిమినల్ అయితే ఎలా ఉంటుంది? అనే ఐడియా పాతదే. పైగా దానిని డెవలప్ చేసినా విధానం మరింత పాతగా ఉంది. ఒక చిన్న ఐడియాని, యాక్షన్ సన్నివేశాలను నమ్ముకొని ఈ సినిమా తీసినట్టుగా ఉంది. తల్లీకొడుకుల మధ్య ఎమోషనల్ సీన్స్ ని కూడా ఎఫెక్టివ్ గా రాసుకోలేకపోయారు. విజయశాంతి ఇంట్రో ఫైట్, విలన్ ఇంట్రో ఫైట్, హీరో ఇంట్రో ఫైట్.. ఇలా వరుసగా మూడు యాక్షన్ సన్నివేశాలతో సినిమా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఒక సాంగ్. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.. సినిమా ఎంత ఓల్డ్ టెంప్లేట్ లో సాగి ఉంటుందో. తెలిసిన కథని కూడా ఆసక్తికర కథనం, ఆకట్టుకునే సన్నివేశాలతో ప్రేక్షకులను మెప్పించేలా చేయవచ్చు. కానీ, రైటింగ్ లో అలాంటి మ్యాజిక్ ఎక్కడా కనిపించలేదు. తల్లీకొడుకుల మధ్య బాండింగ్ ఎక్కువగా మాటలకే పరిమితమైంది. హత్తుకునే సన్నివేశాలు పడలేదు. విలన్ పాత్రను కూడా సరిగా రాసుకోలేదు. ఓ రేంజ్ లో ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత మాటలకే పరిమితం చేసి, క్లైమాక్స్ కి తీసుకొచ్చారు. విజయశాంతి-విలన్ మధ్య కానీ, కళ్యాణ్ రామ్-విలన్ మధ్య కానీ బలమైన సీన్స్ రాసుకోలేదు. సినిమా అంతా ప్రేక్షకుల ఊహకి తగ్గట్టుగానే సాగుతుంది. క్లైమాక్స్ విషయంలో కళ్యాణ్ రామ్ కాస్త ధైర్యం చేశాడనే చెప్పవచ్చు. కానీ, అది కూడా సినిమాని సేవ్ చేసే అవకాశం లేదు .

 

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
అర్జున్ పాత్రలో కళ్యాణ్ రామ్ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా యాక్షన్, ఎమోషనల్ సీన్స్ లో చక్కగా రాణించాడు. అయితే రౌద్ర రసం పలికిస్తూ డైలాగ్ లు చెప్పడంలో మాత్రం సహజత్వం కొరవడింది. విజయశాంతి విషయానికొస్తే, తనని లేడీ సూపర్ స్టార్ అని ఎందుకంటారో వైజయంతి పాత్రతో మరోసారి రుజువు చేశారు. తన స్క్రీన్ ప్రజెన్స్, పర్ఫామెన్స్ తో ఆ పాత్రను నిలబెట్టారు. సాయి మంజ్రేకర్ ఉన్నంతలో ఓకే అనిపించుకుంది. సోహైల్ ఖాన్, శ్రీకాంత్, పృథ్వీ రాజ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

రచయితగా, దర్శకుడిగా ప్రదీప్‌ చిలుకూరి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. సంభాషణలు కూడా నేటి తరానికి తగ్గట్టుగా లేవు. అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ జస్ట్ ఓకే. రామ్ ప్రసాద్ కెమెరా పనితనం బాగానే ఉంది. తమ్మిరాజు ఎడిటింగ్ తేలిపోయింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో కత్తెర తడబడింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

 

ఫైనల్ గా..
తల్లీకొడుకుల కథగా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో రూపొందిన ఈ మూవీ మెప్పించలేకపోయింది. నేటి తరం ప్రేక్షకుల అభిరుచికి ఎన్నో ఏళ్ళ దూరంలో ఆగిపోయిన ఈ చిత్రం.. ప్రేక్షకుల ఆదరణకు నోచుకోవడం కష్టమే. 

 

రేటింగ్: 2/5

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.