మైత్రి మూవీ మేకర్స్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్!
on Dec 5, 2024
కొత్త సినిమా వచ్చిందంటే.. హైదరాబాద్ లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ దగ్గర ఉండే సందడే వేరు. సాధారణ ప్రేక్షకుల నుంచి సినీ సెలబ్రిటీల వరకు ఇక్కడ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. కొన్ని భారీ చిత్రాలను ఖచ్చితంగా ప్రసాద్స్ బిగ్ స్క్రీన్ లోనే చూడాలనుకునే వారు ఎందరో ఉంటారు. సినీ ప్రియుల్లో ప్రసాద్స్ మల్టీప్లెక్స్ కి ఎంతో క్రేజ్ ఉంది. దీనిని కొందరు ఓ ఎమోషన్ లా ఫీలవుతుంటారు. అంతెందుకు పబ్లిక్ టాక్, రివ్యూలకు కూడా ప్రసాద్స్ కే ప్రధాన కేంద్రంగా ఉంటుంది. అంతటి క్రేజ్ ఉన్న ప్రసాద్స్ లో బిగ్గెస్ట్ మూవీ 'పుష్ప-2' ప్రదర్శన లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. (Pushpa 2 The Rule)
'పుష్ప-2' సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదలైంది. కానీ హైదరాబాద్ సినీ ప్రియులకు అడ్డా అయిన ప్రసాద్స్ లో మాత్రం స్క్రీనింగ్ కి నోచుకోలేదు. దానికి కారణం.. ఆ మల్టీప్లెక్స్ యాజమాన్యానికి, పుష్ప-2 నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ కి మధ్య షేర్ పర్సెంటేజ్ మేటర్ తేలకపోవడం. ప్రసాద్ లో ఏదైనా సినిమాని ప్రదర్శిస్తే వచ్చిన వసూళ్ళలో 50 నుంచి 52 శాతం షేర్ నిర్మాతలకు ఇస్తారట. ఈ ఆనవాయితీ ఎన్నో ఏళ్ళ నుంచి కొనసాగుతూ వస్తుందట. కానీ మైత్రి మేకర్స్ మాత్రం, మిగతా మల్టీప్లెక్స్ లు అంగీకరించినట్లు 55 శాతం షేర్ ఇవ్వడానికి ఒప్పుకోవాలని పట్టుబట్టారట. ఒక్క సినిమా కోసం తమ ఇన్నేళ్ల పాలసీని మార్చుకోలేమని ప్రసాద్స్ చెప్పడం, మైత్రి కూడా 52 శాతం షేర్ తీసుకోవానికి ముందుకు రాకపోవడంతో.. ఇద్దరి మధ్య ఒప్పందం కుదరక 'పుష్ప-2' అక్కడ స్క్రీనింగ్ కి నోచుకోలేదు.
నిజానికి పుష్ప-2 చిత్రాన్ని ప్రదర్శించాలన్న ఉద్దేశంతో ప్రసాద్స్ టీం అందుకు తగ్గ ఏర్పాట్లను ముందే చేసుకున్నారు. ప్రీమియర్స్ తో కలిపి మొదటిరోజు ఏకంగా 48 షోలతో రికార్డు క్రియేట్ చేయాలనుకున్నారు. పుష్పరాజ్ ఫొటోలతో ప్రత్యేకంగా పాప్ కార్న్ బౌల్స్ ని తయారు చేయించారు. అల్లు అర్జున్ ప్రత్యేక పోస్టర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇలా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కానీ, తమ పాలసీని విరుద్ధంగా మైత్రి ఎక్కువ షేర్ అడగటంతో, పుష్ప-2 ని ప్రదర్శించడానికి ముందుకు రాలేదు. ఇదే విషయంపై సోషల్ మీడియా వేదికగా ప్రసాద్స్ యాజమాన్యం స్పందించింది. కొన్ని అనివార్య కారణాల వల్ల 'పుష్ప-2'ని ప్రదర్శించలేకపోతున్నామని తెలుపుతూ మూవీ లవర్స్ కి అపాలజీ చెప్పింది. దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్.. మైత్రి నిర్మాతలపై ఫైర్ అవుతున్నారు. మీ కోసం ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళ పాలసీని ఎలా మార్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు. మూడు శాతం షేర్ కి ఆశపడి, హైదరాబాద్ కి గుండెకాయ లాంటి ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో సినిమా విడుదల కాకుండా చేశారని మండిపడుతున్నారు. దీని వల్ల ఎందరో మూవీ లవర్స్ పుష్ప-2 మిస్ అవుతారని, అలాగే హైదరాబాద్ సిటీ ఓపెనింగ్ కల్లెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా పుష్ప-2 వంటి భారీ చిత్రాన్ని ప్రసాద్స్ లో స్క్రీనింగ్ చేయకుండా.. అటు మూవీ లవర్స్ ని, ఇటు బన్నీ ఫ్యాన్స్ ని ఎంతో డిజప్పాయింట్ చేశారని చెప్పవచ్చు.
Also Read