దారుణంగా కొట్టుకున్న పవన్, బన్నీ ఫ్యాన్స్.. మరీ ఇలా ఉన్నారేంట్రా..!
on Apr 7, 2025
"మేము మేము బాగానే ఉంటాం" అని హీరోలు అంటూనే ఉంటారు. ఆ మాటలు పట్టించుకోకుండా అభిమానులు గొడవలు పడుతూనే ఉంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్ పై అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులు దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది.
అల్లు అర్జున్ హీరోగా నటించిన 'ఆర్య-2' మూవీ ఈ వారం రీ-రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ప్రదర్శించబడుతున్న ఒక థియేటర్ వద్దకు పవన్ కళ్యాణ్ అభిమాని వచ్చి "బాబులకే బాబు కళ్యాణ్ బాబు" అని నినాదాలు చేశాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ అతనిపై దాడి చేసి క్షమాపణలు చెప్పించారు. అంతేకాదు, అతని చేత "జై బన్నీ" అని నినాదాలు చేయించడమే కాకుండా, డ్యాన్స్ చేయాలని ఒత్తిడి కూడా చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో మెగా, అల్లు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
చిరంజీవికి అల్లు అర్జున్ మేనల్లుడు. మెగా, అల్లు వేరువేరు కాదు.. ఒకటే అన్నట్టుగా మొన్నటివరకు అభిమానులు ఉండేవారు. కానీ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయం నుంచి వీరి మధ్య దూరం పెరిగింది. నిజానికి మెగా-అల్లు ఫ్యామిలీ మెంబర్స్ రెగ్యులర్ గా కలుస్తూనే ఉంటారు. వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటున్నారు. అభిమానులు మాత్రం అవసరంగా గొడవలకు దిగుతున్నారు.
ఒక హీరో సినిమాకి వచ్చి, ఆ హీరో అభిమానులను రెచ్చగొట్టేలా.. వేరే హీరో పేరుతో నినాదాలు చేయడం తప్పు. అలాగే ఆ నినాదాలు చేసిన వ్యక్తిని ఒంటరిని చేసి దాడి చేయడం కూడా అంతే తప్పు. అసలు అభిమానులకు ఒకరిపై ఒకరికి ద్వేషం ఎందుకు? ఒకరిపై ఒకరు దాడి చేసుకొని ఏం సాధిస్తారు?. హీరోలు ఒకరినొకరు మాటలు అనుకోవట్లేదు, ఒకరిపై ఒకరు దాడి చేసుకోవట్లేదు. మరి అభిమానులు ఎందుకు ఇలా రోడ్డెక్కుతున్నారు?.
మెగా, అల్లు కుటుంబాల మధ్య బంధుత్వం ఉంది. ఎప్పటికైనా వాళ్ళు వాళ్ళు ఒక్కటే. ఆ రెండు ఫ్యామిలీలు.. ఫంక్షన్స్, పార్టీలలో బాగానే కలుస్తుంటాయి. ఒకరి గురించి ఒకరు పాజిటివ్ గా మాట్లాడుతుంటారు. కానీ, అభిమానులకు ఏమైంది? ఎందుకు గొడవలు పడుతున్నారు?. పోనీ ఆ రెండు కుటుంబాల మధ్య ఏదో వార్ ఉందని కాసేపు అనుకుందాం. ఉంటే మాత్రం.. అభిమానులకి గానీ, వారి కుటుంబాలకు గానీ వచ్చే నష్టమేంటి?. గొడవలతో తమ జీవితాలను నాశనం చేసుకోవడం తప్ప.. అటు హీరోలకి కానీ, ఇటు అభిమానులకి కానీ ఒరిగేది ఏముంది?.
ఈ విషయంపై మెగా, అల్లు కుంటుంబ పెద్దలు దృష్టి పెట్టాల్సిన అవసరముంది. చిరంజీవి, అల్లు అరవింద్ వంటి వారు మీడియా ముందుకి వచ్చి.. అభిమానుల మధ్య గొడవలకు బ్రేక్ పడేలా చేయాలి. లేదంటే భవిష్యత్ లో ఇది మరింత ప్రమాదకరంగా మారే అవకాశముంది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
