ఆచారి అమెరికా యాత్ర రివ్యూ
on Apr 27, 2018
కామెడీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? చిన్న వీడియో క్లిప్ కే లక్షల లైకులు పడుతున్నాయి. ఓ మంచి జోక్ వస్తే.. దాన్ని షేర్ చేసుకుంటూ తెగ నవ్వుకుంటుంటారు. కామెడీ ఎవర్ గ్రీన్. కాకపోతే.. సినిమా మొత్తం రెండు గంటల పాటు నవ్వించడం కష్టం. అక్కడక్కడ నవ్వులు పూయిస్తూ.. బండి నడిపేస్తే మినిమం గ్యారెంటీ అందేసుకోవొచ్చు. ఆ నమ్మకంతోనే వినోదాత్మక చిత్రాలు వరుస కడుతుంటాయి. ఈ తరహా సినిమాల్ని డీల్ చేయడంలో జి.నాగేశ్వరరెడ్డి దిట్ట. విష్ణుతో నాగేశ్వరరెడ్డి జట్టు కట్టిన సినిమాలన్నీ బాగా ఆడాయి. మరోసారి వీరిద్దరూ కలసి చేసిన ప్రయత్నం 'ఆచారి అమెరికా యాత్ర'. మరి ఈసినిమా ఎలా ఉంది? ఇదివరకటిలా నవ్వించిందా, విసిగించిందా? ఈ యాత్ర విశేషాలేంటి?
* కథ
కృష్ణమాచారి (విష్ణు) అప్పలాచారి (బ్రహ్మానందం) ఇద్దరూ గురు శిష్యులు. పూజలు, పునస్కారాలు.. యజ్ఞాలు యాగాలూ చేయిస్తుంటారు. ఓసారి ఒకరి ఇంట్లో (ప్రదీప్‌రావత్) యాగం జరిపిస్తే... ప్రమాదవశాత్తూ ఆ ఇంటి పెద్ద (కోట శ్రీనివాసరావు) చనిపోతాడు. యాగం చేయడం వల్లే తన ఇంటి పెద్ద చనిపోయాడని భావించి... వాళ్లని చంపడానికి ఓ ముఠా తిరుగుతుంటుంది. `వీళ్ల నుంచి తప్పించుకోవాలంటే అమెరికా వెళ్లిపోవడమే మార్గం` అని అప్పలాచారిని ఒప్పించి.. తన గ్యాంగ్ అంతటినీ అమెరికా తీసుకెళ్లిపోతాడు కృష్ణమాచారి. కానీ కృష్ణమాచారి అమెరికా రావడానికి కారణం.. మరోటి ఉంది. రుక్మిణి (ప్రగ్యా జైస్వాల్) అనే అమ్మాయిని వెదుక్కుంటూ... కృష్ణమాచారి అమెరికా వచ్చాడు. మరి రుక్మిణి ఎవరు? ఆమె కోసం కృష్ణమాచారి ఎందుకొచ్చాడు? అనేది మిగిలిన కథ.
* విశ్లేషణ
ఈమధ్య కాలంలో ఇంత పేలవమైన లైన్‌తో సినిమా రాలేదు. కామెడీ సినిమాలకు బలమైన కథలు అవసరం లేదనుకోవడం వరకూ ఓకే. అసలు కథే అక్కర్లేదనుకుని జి. నాగేశ్వరరెడ్డి ఈ సినిమా మొదలెట్టేసి ఉండొచ్చు. ఎక్కడక్కడ సన్నివేశాల్ని పేర్చుకుంటూ వెళ్లాడు. అందులో బలం లేదు. వినోదం అస్సల్లేదు. నలుగురు కమెడియన్లను ఓ బ్యాచ్‌గా చూపిస్తే కామెడీ అదే వస్తుందనుకున్నాడో ఏమిటో? ప్రతీ సన్నివేశం అలానే తీసి పారేశాడు. ప్రధాన పాత్రలంతా బ్రాహ్మిణ యాసలో మాట్లాడడం తప్ప... వాళ్ల పంచ్‌లో కౌంటర్లు ఉండవు. నవ్వొచ్చే సందర్భాలూ ఉండవు. సినిమా మొత్తమ్మీద ఒక్కసారి కూడా హాయిగా నవ్వుకోని కామెడీ సినిమాలెందుకో..?? కామెడీ పేరుతో బ్రాహ్మణుల్ని, వాళ్ల ఆచార సంప్రదాయాల్ని మంటగలపలేదు. అంత వరకూ సంతోషించాలి. అక్కడక్కడ కొన్ని చోట్ల ఆ ప్రయత్నం చేసినా,. అవన్నీ సెన్సార్ వాళ్ల దయ వల్ల కట్టయిపోయినట్టు అనిపిస్తుంది. చారి లవ్ స్టోరీలో ఏమాత్రం డెప్తు లేదు. హీరోయిన్‌ని వెదుక్కుంటూ అమెరికా వెళ్లిపోవడం ఏమిటో? అక్కడ అరివీర భయంకరమైన విలన్‌ని బకరాని చేసి ఆడుకోవడంఏమిటో? ఒక్క సన్నివేశం కూడా లాజిక్‌కి అందదు. ఇంతా పోగేస్తే.. కథానాయిక చేసే పోరాటం, త్యాగం ఇవన్నీ తాతయ్య అస్తికల కోసం. మధ్యమధ్యలో వచ్చే పాటలు మన సహనానికి మరింత పరీక్ష పెడతాయి. సినిమా అయిపోతే బాగుండు అనుకుంటున్న సమయంలో ఎక్కడి నుంచో ఫృథ్వీ పరిగెట్టుకుని వస్తాడు. తన తాత కథ చెప్పి చెవుల్లోంచి రక్తం తెప్పిస్తాడు. ఇంత పేలవమైన కామెడీ ట్రాక్ ఎక్కడాచూసుండరు. ఇలాంటి కథలు రాసుకుంటున్నప్పుడో సన్నివేశాల్ని ఊహించుకుంటున్నప్పుడో `జనానికి నచ్చుతుందా, లేదా` అనేది పక్కన పెట్టి, కనీసం `నాకైనా నచ్చుతుందా?` అనే విషయం ఒక్కసారి దర్శకుడు, కథానాయకుడు ఆలోచించుకుంటే.. ఇలాంటి కళాఖండాలు రానే రావు.
* నటీనటులు
ఇలాంటి కథల్ని సూపర్ స్టార్లు కూడా ఏం చేయలేరు. ఇక విష్ణు ఏమాత్రం..? విష్ణుకి యాక్షన్ కథలకంటే కామెడీ కథలు బాగా సూటవుతాయి. బాగా నవ్వించగలడు కూడా. కానీ తాను కూడా ఈ సినిమాలో బొమ్మలా నిలబడిపోవాల్సివచ్చింది. బ్రహ్మానందం నవ్వించడానికి ఆపసోపాలూ పడ్డాడు. మిగిలినవాళ్ల గురించి చెప్పేదేముంది? ప్రగ్యా జైస్వాల్ బొడ్డు చూపించడంలో పోటీ పడింది. కనీసం పదిసార్లయినా ఆ భాగంపై కెమెరా ఫోకస్ వెళ్లి ఉంటుంది. అందుకు మినహాయించి ఆమె పాత్ర కూడా కథకు ఉపయోగపడలేదు. సురేఖా వాణిలతో కూడా ఎక్స్‌పోజింగ్ చేయించాడంటే. ఆమె బీచ్‌లో నడిచి వస్తున్న సన్నివేశాలపై కూడా సెన్సార్ వాళ్లు బ్లర్లు వేశారంటే.. అవి ఏ రకంగా తీసుంటారో అర్థం చేసుకోవచ్చు.
* సాంకేతిక వర్గం
టెక్నికల్ టీమ్ మొత్తం దారుణంగా విఫలమైంది. పాటలు బాగా లేవు. ఫైట్లలో జోష్ లేదు. డైలాగు ఒక్కటీ పేలలేదు. సన్నివేశాలే పేలవంగా ఉన్నాయి. దర్శకత్వ ప్రతిభ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. జి.నాగేశ్వరరెడ్డి తీసిన ఫ్లాపుల్లో ఈ సినిమా మొదటి స్థానంలో ఉండొచ్చు.
* ప్లస్‌పాయింట్స్
టైటిల్
* మైనస్ పాయింట్స్
అన్నీ
* చివరగా: ఆచారి విషాద యాత్ర
రేటింగ్: 1