
సినిమాలంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. వీకెండ్ వచ్చిందంటే కొత్త సినిమా చూడాలని థియేటర్లకు వెళ్లేవారు కొందరైతే.. ఓటీటీలో వచ్చిన ప్రతి సినిమానూ చూసేవారు మరికొందరు. కానీ అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం సినిమాలు చూడటాన్నే తన లక్ష్యంగా మార్చుకున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడాదిలో 1,207 సినిమాలను థియేటర్లలో చూసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఆయన పేరు గ్లెన్వుడ్ హోస్కిన్ జూనియర్.
అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం యార్క్ హేవెన్‌కు చెందిన 60 ఏళ్ల గ్లెన్వుడ్ హోస్కిన్.. ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 వరకు తన స్థానిక రీగల్ సినిమా థియేటర్లో ఈ సినిమాలన్నీ చూశారు. 12 నెలల వ్యవధిలో మొత్తం 1,207 చిత్రాలను వీక్షించారు. అంటే రోజుకు సగటున 3.3 సినిమాలు చూసినట్లు లెక్క. ఈ ఘనతతో ఒక ఏడాదిలో అత్యధిక సినిమాలను థియేటర్లలో చూసిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించారు.
ఇంతకుముందు ఈ రికార్డు అమెరికాకే చెందిన జకారియా స్వోప్ పేరిట ఉండేది. ఆయన ఏడాదిలో 777 సినిమాలు చూసి రికార్డు సృష్టించారు. ఇప్పుడు గ్లెన్వుడ్ ఏకంగా 430 సినిమాలు ఎక్కువగా చూసి ఆ రికార్డును అధిగమించారు.
ఈ రికార్డు కోసం గ్లెన్వుడ్ ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకునేవారు. ప్రతిరోజూ థియేటర్ షెడ్యూల్ పరిశీలించి, ఏ సినిమాలు ఎప్పుడు ప్రదర్శిస్తున్నారో తెలుసుకునేవారు. తక్కువ నిడివి ఉన్న సినిమాలను గుర్తించి, వీలైనన్ని ఎక్కువ చిత్రాలు చూసేలా తన రోజును ప్లాన్ చేసుకునేవారు. ఉదయం మొదలుపెట్టి అర్ధరాత్రి వరకు సినిమాలు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయట.
సినిమాల మధ్య ఖాళీ సమయంలో థియేటర్ పరిసరాల్లో నడుస్తూ వ్యాయామం చేసేవారు. ఖర్చు తగ్గించుకోవడానికి ఇంటి నుంచే ఆహారం తీసుకెళ్లేవారు. నెలకు సుమారు 28 డాలర్లు చెల్లించే రీగల్ అన్లిమిటెడ్ మెంబర్షిప్ ఉండటంతో ఎక్కువ సినిమాలు చూడటం ఆర్థికంగా కూడా సాధ్యమైంది. థియేటర్ సిబ్బంది, మేనేజ్మెంట్ కూడా ఆయనకు సహకరించేవారట.

గ్లెన్వుడ్కు కార్టూన్ సినిమాలు, కామెడీ చిత్రాలంటే ప్రత్యేకమైన ఇష్టం. తక్కువ నిడివి ఉండటంతో కార్టూన్ సినిమాలను ఎక్కువగా ఆస్వాదించేవారట. ప్రేక్షకులతో కలిసి థియేటర్లో కామెడీ సినిమాలు చూస్తూ నవ్వుకోవడం తనకు ఎంతో ఆనందాన్నిస్తుందని ఆయన చెప్పారు. తాను చూసిన సినిమాల్లో ‘ది వైల్డ్ రోబోట్’, ‘డెడ్‌పూల్ అండ్ వుల్వరైన్’ చిత్రాలు ప్రత్యేకంగా నచ్చాయని వెల్లడించారు.
ఈ రికార్డు సాధించాలనే ఆలోచన తనకు ఆన్లైన్లో గిన్నిస్ రికార్డుల గురించి తెలుసుకుంటున్నప్పుడు వచ్చిందని గ్లెన్వుడ్ తెలిపారు. మొదట ఒకే సినిమాను అత్యధికసార్లు చూసే రికార్డుపై ఆసక్తి చూపినా.. ఆ రికార్డును అధిగమించడం కష్టమని భావించి, ఏడాదిలో ఎక్కువ సినిమాలు చూసే లక్ష్యాన్ని ఎంచుకున్నారు.
సినిమాలు చూడటం తనకు కేవలం వినోదం మాత్రమే కాదని, ఇంటి నుంచి బయటకు వచ్చి కొత్త అనుభవాలను పొందే అవకాశమని ఆయన చెబుతున్నారు. ఒకప్పుడు సినిమాలను సరదాగా చూసిన ఈ వ్యక్తి.. ఇప్పుడు అదే అభిరుచితో ప్రపంచ రికార్డు సృష్టించడం విశేషం. సినిమా పట్ల ఇంతటి ప్రేమ, పట్టుదల ఉంటే ఇలాంటి అరుదైన ఘనతలు కూడా సాధ్యమేనని గ్లెన్వుడ్ నిరూపించారు.
ఇది కూడా చదవండి: టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఎఫెక్ట్.. బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్ వెనుక అమితాబ్ బచ్చన్.!
[1207 Movies Guinness World Record, American movie lover Glenwood, 1207 Movies in One Year, Glenwood Hoskin Jr, 1200 Movies Guinness Record, Movie Lover, Cinema Record, Guinness Records]





