మెగాస్టార్ కి స్టార్ డమ్ కట్టబెట్టిన `ఖైదీ`కి 38 ఏళ్ళు!
on Oct 28, 2021
మెగాస్టార్ చిరంజీవి అంటేనే సంచలన విజయాలకు చిరునామా. అలాంటి చిరుకి స్టార్ డమ్ కట్టబెట్టిన చిత్రంగా `ఖైదీ`కి ప్రత్యేక స్థానముంది. కథానాయకుడిగా చిరు దశని, దిశని మేలిమలుపు తిప్పిన ఈ సినిమా.. `ఖైదీ`కి ముందు, `ఖైదీ`కి తరువాత అన్నట్లుగా మెగాస్టార్ కెరీర్ ని ప్రభావితం చేసింది. చిరు కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. ఇందులో పగ, ప్రతీకారాలతో రగిలిపోయే సూర్యం పాత్రలో జీవించేశారు చిరంజీవి. హాలీవుడ్ మూవీ `ఫస్ట్ బ్లడ్` (1982) ఆధారంగా రూపొందిన ఈ సినిమాతో దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి, రచయితలు పరుచూరి బ్రదర్స్ కూడా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోవడం విశేషం. చిరుకి జోడీగా మాధవి, సుమలత నటించిన ఈ సినిమాలో రావుగోపాల రావు, నూతన్ ప్రసాద్, రంగనాథ్, రాళ్ళపల్లి, చలపతిరావు, సంగీత, సంయుక్త, సుత్తివేలు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
చక్రవర్తి సంగీతసారథ్యంలో రూపొందిన గీతాలన్ని మాస్ ని ఉర్రూతలూగించాయి. మరీముఖ్యంగా.. ``రగులుతోంది మొగలిపొద`` చార్ట్ బస్టర్ గా నిలవగా, ``వేదం నాదం``, ``గోరింట పూసింది``, ``ఇదేమిటబ్బా`` పాటలు కూడా రంజింపజేశాయి. హిందీ, కన్నడ భాషల్లో `ఖైదీ` పేరుతోనే ఈ చిత్రం రీమేక్ కాగా.. వాటిలోనూ మాధవి నాయికగా నటించడం విశేషం. 1983 అక్టోబర్ 28న విడుదలై అఖండ విజయం సాధించిన `ఖైదీ`.. నేటితో 38 వసంతాలు పూర్తిచేసుకుంది.