వెంకీ `చిన్నబ్బాయి`కి పాతికేళ్ళు!
on Jan 10, 2022

విక్టరీ వెంకటేశ్ కెరీర్ లో `స్వర్ణ కమలం` (1988) చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. మ్యూజికల్ హిట్ గా నిలిచిన ఈ క్లాసిక్ కి కళా తపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించగా, మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. కట్ చేస్తే.. దాదాపు తొమ్మిదేళ్ళ తరువాత `చిన్నబ్బాయి`(1997) కోసం ఈ త్రయం మరోమారు జట్టుకట్టారు. బాక్సాఫీస్ ముంగిట ఆశించిన ఫలితం అందుకోలేకపోయిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా.. మ్యూజికల్ గా మాత్రం మెప్పించింది. ఇందులోని ``జాబిమల్లి తెల్లచీర``, ``తెలుసుకో తెలుసుకో``, ``నిన్న చూసిన ఉదయం`` వంటి గీతాలు సంగీత ప్రియులను విశేషంగా అలరించాయి. అటు విశ్వనాథ్ దర్శకత్వంలోనూ, ఇటు ఇళయరాజా సంగీతదర్శకత్వంలోనూ వెంకీ నటించిన చివరి సినిమాగా `చిన్నబ్బాయి` నిలిచిపోయింది.
రమ్యకృష్ణ, రవళి నాయికలుగా నటించిన ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు, శ్రీవిద్య, సత్యనారాయణ, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, ఏవీయస్, సాక్షి రంగారావు, సుత్తి వేలు, చిట్టి బాబు, మిశ్రో, శ్రీలక్ష్మి, శివపార్వతి, మీనా కుమారి, మాస్టర్ అనిల్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. రాశీ మూవీస్ పతాకంపై ఎం. నరసింహారావు నిర్మించిన `చిన్నబ్బాయి`.. వెంకీ కెరీర్ లో తొలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన `చంటి` (1992) విడుదల తేదీ అయిన జనవరి 10నే టార్గెట్ చేసుకుని రిలీజ్ అయినప్పటికీ ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయలేకపోయింది. కాగా, నేటితో `చిన్నబ్బాయి` పాతికేళ్ళు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



