Home

»

Latest News

మెగాస్టార్ `అన్న‌య్య‌`కి 22 ఏళ్ళు!

Jan 7, 2022 1:36PM

మెగాస్టార్ చిరంజీవికి అచ్చొచ్చిన ద‌ర్శ‌కుల్లో `సెంటిమెంట్ సినిమాల స్పెష‌లిస్ట్` ముత్యాల సుబ్బ‌య్య ఒక‌రు. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో రెండు సినిమాలు రూపొంద‌గా.. అవి రెండు కూడా విజ‌య‌ప‌థంలో ప‌య‌నించాయి. ఆ చిత్రాలే.. `హిట్ల‌ర్`(1997), `అన్న‌య్య‌`(2000). సిస్ట‌ర్ సెంటిమెంట్ ప్ర‌ధానంగా `హిట్ల‌ర్` తెర‌కెక్కితే.. బ్ర‌ద‌ర్ సెంటిమెంట్ ప్ర‌ధానంగా `అన్న‌య్య‌` త‌యార‌వ‌డం విశేషం. అంతేకాదు.. రెండు సినిమాలు కూడా మూడేళ్ళ వ్య‌వ‌ధిలో సంక్రాంతి స్పెష‌ల్ గా జ‌న‌వ‌రి మొద‌టి వారంలోనే జ‌నం ముందు నిల‌వ‌డం విశేషం.

ఇక `అన్న‌య్య‌` విష‌యానికొస్తే.. ఇందులో టైటిల్ రోల్ లో చిరంజీవి మెస్మ‌రైజ్ చేయ‌గా అత‌ని త‌మ్ముళ్ళుగా మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, వెంక‌ట్ క‌నిపించారు. చిరుకి జోడీగా సౌంద‌ర్య న‌టించిన ఈ సినిమాలో చాందిని, శిష్వా, కోట శ్రీ‌నివాస‌రావు, ఉత్తేజ్, శ‌ర‌త్ బాబు, భూపేంద‌ర్ సింగ్, ప్రియ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చారు. సిమ్ర‌న్ ఓ ప్ర‌త్యేక గీతంలో చిందులేశారు.

మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం `అన్న‌య్య‌`కి ఓ ప్ర‌ధాన బ‌లంగా నిలిచింది. ``గుస‌గుసలే``, ``ఆట కావాలా``, ``వాన వ‌ల్ల‌ప్ప‌``, ``హిమ‌సీమ‌ల్లో``, ``స‌య్యారే స‌య్య‌``, ``బావా చంద‌మామ‌లు``.. ఇలా ఇందులోని పాట‌ల‌న్నీ అప్ప‌ట్లో ఉర్రూత‌లూగించాయి. 60 కేంద్రాల్లో శ‌త‌దినోత్స‌వం జ‌రుపుకున్న `అన్న‌య్య‌`.. `ఉత్త‌మ గాయ‌కుడు` (హ‌రిహ‌ర‌న్ - హిమ‌సీమ‌ల్లో), `ఉత్త‌మ నృత్య‌ద‌ర్శ‌కుడు` (లారెన్స్ - ఆట‌కావాలా), `ఉత్త‌మ ఫైట్ మాస్ట‌ర్` (క‌ణ‌ల్ క‌న్న‌న్) విభాగాల్లో `నంది` పుర‌స్కారాల‌ను అందుకుంది. బెంగాలీలో `దేవ్ దూత్` (2005) పేరుతో ఈ సినిమా రీమేక్ అయింది. శ్రీ సాయి రామ్ ఆర్ట్స్ ప‌తాకంపై డాక్ట‌ర్ కె. వెంక‌టేశ్వ‌ర‌రావు నిర్మించిన `అన్న‌య్య‌`.. 2000 జ‌న‌వ‌రి 7న విడుద‌లై ఆ యేడాది తొలి బ్లాక్ బ‌స్ట‌ర్ గా రికార్డుల‌కెక్కింది. నేటితో ఈ ఫ్యామిలీ యాక్ష‌న్ డ్రామా 22 వ‌సంతాలు పూర్తిచేసుకుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com