'నేల టికెట్' ఫ్లాప్‌పై రవితేజ స్పందన
on Jan 18, 2020
రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన 'డిస్కో రాజా' ఈ నెల 24న విడుదల కానుంది. ఆల్రెడీ విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అన్నిటి కంటే ముఖ్యంగా నిర్మాత ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా సినిమా తీశారని ట్రయిలర్స్, ప్రోమోస్ చూస్తుంటే తెలుస్తోంది. రవితేజతో 'నేల టికెట్' తీసిన రామ్ తాళ్లూరి, ఈ 'డిస్కో రాజా'ను నిర్మించారు. ఓ ప్లాప్ తర్వాత రవితేజతో భారీ బడ్జెట్ సినిమా తీశారని ఇండస్ట్రీ చెవులు కొరుక్కుంటోంది. సినిమా విడుదల దగ్గర పడడంతో రవితేజ ఇంటర్వ్యూలు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇంటర్వ్యూల్లో 'నేల టికెట్' ప్లాప్ గురించి స్పందించారు.
"రామ్ తాళ్లూరితో 'నేల టికెట్'కి బదులు నేను వేరే కథ చేయాలి. కానీ, కుదరలేదు. దురదృష్టవశాత్తూ, మేం 'నేల టికెట్' చేశాం. షూటింగ్ చేస్తున్నప్పుడు మధ్యలోనే తప్పు జరుగుతుందని ఊహించా. అదే విషయం నిర్మాతకు చెప్పాను. మూవీ వర్కవుట్ కాదని చెప్పా. అప్పటికే చాలా షూటింగ్ చేయడంతో ఏం చేయలేకపోయాం. సినిమా ఫలితం ఏంటనేది మధ్యలోనే తెలుస్తుంది" అని రవితేజ అన్నారు. ఇకపై బ్యాడ్ ఫిలిమ్స్ చేయనని, గుడ్ ఫిలిమ్స్ చేయడానికి ట్రై చేస్తున్నానని ఆయన అన్నారు.
'రాజా ది గ్రేట్' తర్వాత రవితేజ ఖాతాలో సరైన విజయం పడలేదు. 'టచ్ చేసి చూడు', 'నేల టికెట్', 'అమర్ అక్బర్ ఆంటోనీ' ప్రేక్షకుల్ని నిరాశపరిచాయి. ఈ సినిమాల ఫలితాలు 'డిస్కో రాజా'పై ప్రభావం చూపలేదు. పాటలు, ట్రయిలర్స్ సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి.