మూవీ : ఉప్పు కప్పురంబు
నటీనటులు: కీర్తి సురేశ్, సుహాస్, బాబూ మోహన్, శత్రు, తాళ్లూరి రామేశ్వరి, శుభలేఖ సుధాకర్ తదితరులు
ఎడిటింగ్: శ్రీజిత్ సరంగ్
సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి
మ్యూజిక్: స్వీకర్ అగస్తీ
నిర్మాతలు: రాధిక లావు
దర్శకత్వం: ఐవీ శశి
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో
కథ:
1990 లో చిట్టిజయపురం అనే గ్రామంలో శుభలేఖ సుధాకర్ ఊరిపెద్దగా ఉంటాడు. అతను మరణించడంతో తన కుమార్తె అపూర్వ(కీర్తి సురేష్) కొత్త గ్రామపెద్దగా ఎన్నుకోబడుతుంది. ఆమె గ్రామపెద్దగా నియమించబడటం ఇష్టం లేని భద్రయ్య (బాబు మోహన్), మధు (శత్రు) రెండు వర్గాలుగా విడిపోయి ఆమెను ఇబ్బంది పెడుతుంటారు. అయితే అనుకోకుండా ఆ ఊరికి ఓ పెద్ద సమస్య వచ్చి పడుతుంది. నిజానికి సంప్రదాయం ప్రకారం ఆ ఊరిలో ఎవరు చనిపోయిన ఊరికి ఉత్తరాన పాతిపెట్టడం ఆనవాయితీ. అలా పాతిపెట్టే క్రమంలో స్మశానం నిండిపోవడంతో, కొత్తగా ఎవరైనా చనిపోతే ఎక్కడ పాతిపెట్టాలనే సమస్య మొదలవుతుంది. ఇంకా నలుగురికి మాత్రమే చోటు ఉండటంతో, ఆ నలుగురిని లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసే ప్రయత్నం చేయడంతో అనుకోకుండా మరో నలుగురు మృతి చెందుతారు. చివరికి ఆ నలుగురిని పాతిపెట్టాక, ఆ ఊరి స్మశాన కాపరి చిన్న (సుహాస్) ఒక మోసం చేశాడని బయటపడుతుంది. ఇంతకు చిన్న చేసిన మోసమేంటి? చిన్న కుటుంబాన్ని వెలివేసిన తర్వాత ఆ ఊరికి ఏం జరిగింది? చివరికి ఈ సమస్యను పరిష్కరించారా లేదా అనేది మిగతా కథ.
ఎనాలసిస్ :
ఒక ఊరిలో అమాయక జనాలు.. ప్రతీ దానికి ఊరిపెద్ద నిర్ణయం.. మూఢ నమ్మకాలు.. ఇలా 1990లో సర్వసాధారణంగా సాగే కథే ఇది. ఈ తరహా కథలు ఇప్పటికే చాలా వచ్చాయి. అయితే ఆ ఊరికి ఓ సమస్య వస్తుంది. అదేంటంటే శ్మశానంలో మనుషులని పూడ్చేందుకు స్థలం లేదు.. ఇది చాలా చిన్న పాయింట్ దీనిని దర్శకుడు ఎక్కువ సేపు ఎంగేజింగ్ గా చూపించాలి. మరి అలా చూపించాడా లేదా అంటే కొంతవరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఎందుకు కొంతవరకు అంటే కొన్ని సీన్లు లాజిక్ లేకుండా ఉంటాయి. ఫస్టాఫ్ అంతగా కనెక్ట్ కాదు. ఇంటర్వెల్ లో కథపై కాస్త ఇంట్రస్ట్ వస్తుంది. కానీ ద్వితీయార్థంలో ఎక్కువగా కామెడీపై ఫోకస్ చేయడం వల్ల మెయిన్ పాయింట్ కాస్త డైవర్ట్ అయినట్టుగా ఉంటుంది.
ఊరిపెద్ద మరణం తర్వాత ఆమె కూతురికి ఆ పదవిని ఇవ్వడం కన్విన్సింగ్ గా ఉండదు. హీరోయిన్ పాత్ర కన్ఫ్యూజింగ్గా కనిపించినా కొన్ని చోట్ల అందరికన్నా చాలా తెలివిగా అలోచిస్తున్నట్టుగా చూపించారు. ఇది కొంచెం కన్విన్సింగ్ అనిపించదు. సుహాస్ అతని తల్లి మధ్య వచ్చే సీక్వెన్స్ హార్ట్ టచింగ్ గా ఉంటుంది. మిగతా సీన్స్తో పోలిస్తే ఈ సీక్వెన్స్ ఇంకాసేపు ఉంటే బాగుండేది.
ఈ సినిమాను ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా చూస్తే కొంతవరకు సమయం పట్టినా తర్వాత బాగుందనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఊరికి వచ్చిన సమస్యని వాళ్ళు ఎలా పరిష్కారించుకున్నారనేది ఆసక్తికరంగా సాగుతుంది. ఊర్లో రచ్చబండ సీన్, కీర్తి సురేశ్, సుహాస్ మధ్య సీన్లు, బాబూ మోహన్ కామెడీ ఆకట్టుకుంటాయి. అడల్ట్ సీన్లు లేవు. అసభ్య పదజాలం వాడలేదు. సినిమా చివర్లో మెసెజ్ బాగుంది. ఎడిటింగ్ వర్క్ నీట్ గా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ ఒకే. నువ్విలా సాంగ్ ఒకటి బాగుంది. ఇంకా తల్లి సెంటిమెంట్ సాంగ్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
అపూర్వగా కీర్తి సురేశ్, చిన్నగా సుహాస్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. బాబు మోహన్, శత్రు హాస్యాన్ని పండించారు. ఇక మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
తెలుగుఒన్ పర్స్పెక్టివ్:
ఫ్యామిలీతో కలిసి చూసే మూవీ ఇది.