తారాగణం: నితిన్, లయ, సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, స్వసిక విజయన్, సౌరభ్ సచ్‌దేవ, హరితేజ, శ్రీకాంత్ అయ్యంగర్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర తదితరులు
సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్
డీఓపీ: కె.వి. గుహాన్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
దర్శకత్వం: వేణు శ్రీరామ్
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల తేదీ: జూలై 4, 2025
వరుస ప్లాప్ లని ఎదుర్కుంటున్న 'నితిన్' సంక్రాంతికి వస్తున్నాంతో భారీ హిట్ ని అందుకున్న దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో ఈ రోజు 'తమ్ముడు'గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వకీల్ సాబ్ మూవీ డైరెక్టర్ కావడం, ప్రచార చిత్రాలు బాగుండటంతో ప్రేక్షకుల్లో తమ్ముడి పై ఆసక్తి నెలకొని ఉంది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
జై (నితిన్) ఆర్చరీ క్రీడలో గోల్డ్ మెడల్ సాధించాలనే లక్ష్యంతో ఉంటాడు. పదేళ్ల వయసులో చేసిన తప్పు వల్ల తన అక్కయ్య స్నేహలత(లయ) కి దూరం అవుతాడు. ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి ఫ్రెండ్ చిత్ర(వర్ష బొల్లమ్మ) తో కలిసి తన అక్కయ్య ఉంటున్న వైజాగ్ కి వస్తాడు. గవర్నమెంట్ అధికారి ఝాన్సీ(లయ) సంతకం కోసం అజర్వాల్ (సౌరభ్ సచ్ దేవ్) అనే బిజినెస్ మాన్ ఝాన్సీ కుటుంబాన్ని చంపాలని నిర్ణయించుకుంటాడు. దీంతో అజర్వాల్ వల్ల ఝాన్సీ ఫ్యామిలీ మొత్తం దట్టమైన అటవీ ప్రాంతమైన అంబరగొడుగులో చిక్కుకోవాల్సి వస్తుంది. ఝాన్సీ ని గుర్తుపట్టిన జై వాళ్ళని కాపాడుతుంటాడు. అడవిలోనే ఉండే రత్న(సప్తమి గౌడ) కూడా జై కి సాయం చేస్తుంటుంది. ఝాన్సీ ని అజర్వాల్ ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అసలు స్నేహలత తన పేరుని ఝాన్సీగా ఎందుకు మార్చుకుంది? జై, స్నేహలత విడిపోవడానికి కారణం ఏంటి? అసలు చాలా సంవత్సరాల తర్వాత జై తన అక్కయ్య కోసం ఎందుకు వచ్చాడు? అజర్వాల్ ని ఏం చేసాడు అనేదే ఈ కథ.
ఎనాలసిస్ :
సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడో వచ్చిన ఇలాంటి కథల్ని మేకర్స్ మళ్ళీ ఎందుకు తెరకెక్కించాలని అనుకున్నారో తెలియదు. సినిమా ప్రారంభమైన ఐదు నిమిషాలకే సినిమా ఎలా ఉండబోతుందో ప్రేక్షకుడికి తెలిసిపోతుంది. పైగా ఇలాంటి కధల్ని సినిమా మొత్తం సీరియస్ గా రన్ చెయ్యాలని అనుకోవడం మొదటి మైనస్. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే నితిన్ క్యారక్టర్ ని ఓపెన్ చెయ్యడమే డల్ గా ఓపెన్ చేసారు.అలా కాకుండా ఫ్లాష్ బ్యాక్ లో లో తన అక్కయ్య ఇచ్చిన మాట కోసం ఎప్పుడు సంతోషంగా ఉంటాడని ఎస్టాబ్లిష్ చేసి, ఆ దిశగా కథనాల్ని రన్ చెయ్యాల్సింది. తన అక్కయ్య గురించి ఫ్రెండ్ కి చెప్పి అక్క కోసం వైజాగ్ రావడంతో కొంచం ఇంట్రెస్ట్ కలిగింది. కానీ వెంటనే అంబరగోడు అనే అటవీ ప్రాంతానికి రావడంతో కథనంలో వేగం తగ్గింది. క్యారక్టర్ లు ఏం చేయడానికి వీలు లేకుండా కథనం సాగింది. ఇంకా గట్టిగా చెప్పుకోవాలంటే సెకండ్ హాఫ్ కోసం ఫస్ట్ హాఫ్ ని సాగదీసినట్టుగా ఉంది. ఇక సెకండ్ హాఫ్ కూడా ఎలా ఉండబోతుందో ముందుగానే తెలిసిపోతుంది. కాబట్టి కొత్తదనాన్నీ ఏం ఉహించుకొం. యాక్షన్ సన్నివేశాలు తప్ప ఏం ఉండవు. వాటిని కూడా చాలా నాటకీయంగా తెరకెక్కించారు. చిత్ర క్యారక్టర్ చనిపోవడం కూడా అంత వర్క్ అవుట్ కాలేదు. కథనం రన్ అవ్వడానికి కూడా ఏం లేదు. క్లైమాక్స్ కూడా అందరు ఊహించిందే.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పని తీరు
నితిన్ తన క్యారక్టర్ పరిధి మేరకు ఎప్పటిలాగానే బాగానే నటించాడు. తన క్యారక్టర్ కి తగ్గట్టుగా కూడా సూటయ్యాడు. లయ, సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ కూడా బాగానే నటించారు. ఇక మిగతా వాళ్ల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకుడిగానూ, రచయితగాను మెప్పించలేకపోయాడు. దిల్ రాజు నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. ఫొటోగ్రఫీ, సంగీతం పర్లేదు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
కథ, కథనాలు, దర్శకత్వం, డైలాగ్స్ అన్ని తమ్ముడికి వ్యతిరేకంగా పని చేసాయి.