తారాగణం: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ, కార్తికేయ సామల, సునీల్, మురళీధర్ గౌడ్, సత్యం రాజేష్, రఘుబాబు, శుభలేఖ సుధాకర్ తదితరులు
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
నేపథ్య సంగీతం: తమన్
డీఓపీ: శామ్‌దత్
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
రచన, దర్శకత్వం: కళ్యాణ్ శంకర్
సమర్పణ: సూర్యదేవర నాగ వంశీ
నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్
విడుదల తేదీ: మార్చి 28, 2025
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లను హీరోలుగా, కళ్యాణ్ శంకర్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన సినిమా 'మ్యాడ్'. ఈ కామెడీ ఫిల్మ్ 2023 అక్టోబర్ లో విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ రూపొందింది. 'డీజే టిల్లు'కి సీక్వెల్ గా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన 'టిల్లు స్క్వేర్' బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మరి అదే బాటలో మ్యాడ్ సీక్వెల్ కూడా పయనిస్తుందా లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. (Mad Square Movie Review)
కథ:
పార్ట్-1 లో కాలేజ్ లో మ్యాడ్ గ్యాంగ్ అల్లరిని చూపిస్తే.. పార్ట్-2 లో కాలేజ్ తర్వాత లైఫ్ లో జరిగే అల్లరి చూపించారు. గ్యాంగ్ లో శ్రీమంతుడైన అశోక్ (నార్నే నితిన్) తన మేనత్త ఆస్తి కోసం కేసు వేయడంతో కోర్టుల చుట్టూ తిరుగుతుంటాడు. కాలేజ్ లో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా చేసిన దామోదర్ (సంగీత్ శోభన్), పాలిటిక్స్ మీద పిచ్చితో తన గ్రామ సర్పంచ్ కావాలనే ప్రయత్నాల్లో ఉంటాడు. తన గర్ల్ ఫ్రెండ్ తో బ్రేక్ అప్ అయిన మనోజ్ (రామ్ నితిన్).. ఆ బాధ నుంచి బయటపడటం కోసం పబ్ లో వర్క్ చేస్తుంటాడు. ఇక లడ్డు (విష్ణు ఓఐ) తన ఫ్రెండ్స్ కి తెలిస్తే ఎక్కడ పెళ్లి చెడగొడతారో అనే భయంతో, సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు. ఆ విషయం తెలిసి మ్యాడ్ గ్యాంగ్ మనోజ్, అశోక్, దామోదర్ లడ్డు పెళ్లికి వెళ్తారు. మ్యాడ్ గ్యాంగ్ రాకతో లడ్డు జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? లడ్డు పెళ్లి ఎందుకు ఆగిపోయింది? వీళ్ళు గోవా ఎందుకు వెళ్ళారు? అక్కడ ఎలాంటి క్రైమ్ లో ఇరుక్కున్నారు? వీళ్ళని చంపడానికి మ్యాక్స్(సునీల్) ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.
ఎనాలసిస్ :
గొప్ప కథాకథనాలు ఆశించి ఈ సినిమాకి రాకండి, సరదాగా కాసేపు నవ్వుకోవడానికి రండి అని మొదటి నుంచి మూవీ టీం చెబుతూ వచ్చింది. అవును ఇది ప్రేక్షకులను నవ్వించడమే లక్ష్యంగా తీసిన సినిమా. ఆ వినోదమే మ్యాడ్ కి విజయాన్ని అందించింది. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ కూడా ఆ వినోదాన్నే నమ్ముకుంది. మనోజ్, అశోక్, దామోదర్ ల జీవితం ప్రస్తుతం ఎలా ఉందో చూపిస్తూ సినిమా ప్రారంభమైంది. ఆ తర్వాత లడ్డు పెళ్లికి మ్యాడ్ గ్యాంగ్ వెళ్లడంతో అసలు అల్లరి మొదలైంది. పెళ్లిని ఆపేస్తామంటూ మ్యాడ్ గ్యాంగ్ చేసే అల్లరి, ఎక్కడ తన పెళ్లి ఆగిపోతుందో అనే భయంతో లడ్డు ఫ్రస్ట్రేషన్ తో పెళ్లి ఎపిసోడ్ బాగానే నవ్వులు పూయించింది. ఆ తర్వాత కథ గోవాకి షిఫ్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ సరదాసరదాగా మనకి తెలియకుండానే సాగిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం గోవాలోనే జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కామెడీ డోస్ తగ్గినట్టు అనిపించినప్పటికీ, ఓవరాల్ గా బాగానే నవ్వించింది. లడ్డు ఫాదర్ గా నటించిన మురళీధర్ గౌడ్, మ్యాక్స్ గా కనిపించిన సునీల్ మధ్య సన్నివేశాలు కొంతవరకు బాగానే వర్కౌట్ అయ్యాయి. ఈ సినిమా ప్రధానంగా లడ్డు పాత్ర, ఆ పాత్ర చుట్టు అల్లుకున్న కామెడీ సన్నివేశాలతోనే దాదాపు నడిచింది. ఆ కామెడీ చాలావరకు వర్కౌట్ అయింది. అయితే మ్యాడ్ లో మనకు పాత్రలు కొత్తగా అనిపిస్తాయి. ఆ పాత్రల అమాయకత్వం నుంచి పుట్టిన కామెడీ నేచురల్ గా, ఫ్రెష్ గా అనిపించింది. కానీ, మ్యాడ్ స్క్వేర్ లో ఆ ఇన్నోసెన్స్ నుంచి పుట్టే నేచురల్ కామెడీ కంటే కూడా, కమర్షియల్ ఎలిమెంట్స్ వైపు ఎక్కువ మొగ్గు చూపారు. పాటలు కూడా కామెడీ ఫ్లోని డిస్టర్బ్ చేశాయి. కమర్షియల్ లెక్కల జోలికి పోకుండా ఉంటే, కామెడీ ఇంకా బాగా పండేదేమో.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
ఫస్ట్ పార్ట్ లో అశోక్ గా కాస్త సీరియస్ యాంగిల్ లో కనిపించిన నార్నే నితిన్, సెకండ్ పార్ట్ లో మాత్రం కామెడీ ట్రాక్ లోకి వచ్చేస్తాడు. ఉన్నంతలో బాగానే నవ్వించే ప్రయత్నం చేశాడు. మ్యాడ్ లో సంగీత్ శోభన్ పోషించిన దామోదర్ పాత్ర హైలైట్ గా నిలిచింది. ఆ స్థాయిలో కాకపోయినా, ఈసారి కూడా సంగీత్ బాగానే నవ్వించాడు. పులిహారరాజా లాంటి మనోజ్ రోల్ లో నటించిన రామ్ నితిన్ కూడా ఈసారి కామెడీ ట్రాక్ లోకి వచ్చి బాగానే నవ్వించాడు. ఇక ఈ సినిమాకి విష్ణు ఓఐ పోషించిన లడ్డు పాత్ర హైలైట్ అని చెప్పవచ్చు. లడ్డు పాత్ర చుట్టూనే దాదాపు సినిమా అంతా తిరుగుతుంది. అంతటి కీలకమైన లడ్డు పాత్రలో విష్ణు నవ్వులు పూయించారు. మ్యాడ్ లో చిన్నపాటి సైకో లక్షణాలు ఉండే రోల్ చేసిన కార్తికేయ సామల మరోసారి తన మార్క్ చూపించాడు. తన రోల్ నుంచి దర్శకుడు ఇంకా ఎక్కువ ఫన్ జనరేట్ చేయొచ్చు అనిపించింది. కామెడీ విలన్ మ్యాక్స్ రోల్ ని సునీల్ అలవోకగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మ్యాక్స్ అసిస్టెంట్ గా శుభలేఖ సుధాకర్ కొత్తగా కనిపించారు. లడ్డు తండ్రి పాత్రలో మురళీధర్ గౌడ్ బాగానే నవ్వించారు. సత్యం రాజేష్, రఘుబాబు పాత్రల పరిధి మేరకు నటించారు.
దర్శకుడు కళ్యాణ్ శంకర్ మ్యాడ్ గ్యాంగ్ తో మరోసారి మ్యాజిక్ చేశాడు. కామెడీ పరంగా మ్యాడ్ సీక్వెల్ అనే అంచనాలను బీట్ చేయనప్పటికీ, ఒక సినిమాలా చూస్తే మాత్రం బాగానే నవ్వించాడు. అయితే మ్యాడ్ లో పాత్రల ఇన్నోసెన్స్ నుంచి నేచురల్ కామెడీ పంచిన డైరెక్టర్.. ఈసారి మాత్రం ఎక్కువగా కమర్షియల్ మీటర్ లో సీన్స్ రాసుకున్నాడు. ఓవరాల్ గా అయితే నవ్వించడంలో సక్సెస్ అయ్యి, టాలీవుడ్ కి మరో మంచి కామెడీ డైరెక్టర్ ఉన్నాడని ప్రూవ్ చేశాడు. మ్యాడ్ విజయంలో భీమ్స్ సిసిరోలియో సంగీతం కీలక పాత్ర పోషించింది. అయితే మ్యాడ్ 2 విషయంలో 'స్వాతి రెడ్డి', 'లడ్డు గాని పెళ్లి' పాటలు బాగున్నాయి కానీ, మిగతా పాటలు జస్ట్ ఒకే అనేలా ఉన్నాయి. కామెడీ జానర్ కి తగ్గట్టుగా థమన్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. శామ్‌దత్ కెమెరా పనితనం బాగుంది. ప్రతి ఫ్రేమ్ కలర్ ఫుల్ గా, రిచ్ గా ఉంది. నవీన్ నూలి ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
మ్యాడ్ స్క్వేర్ అనే టైటిల్ తగ్గట్టుగా నవ్వులు రెట్టింపు అవ్వలేదు కానీ, చూస్తున్నంతసేపు బాగానే నవ్వుకుంటాం. ఫ్రెండ్స్ తో కలిసి కాసేపు సరదాగా నవ్వుకోవడానికి హ్యాపీగా ఈ సినిమా చూసేయొచ్చు. ముఖ్యంగా యూత్ కి ఈ సినిమా నచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.