తారాగణం: అజిత్ కుమార్, త్రిష, అర్జున్ దాస్, సునీల్, జాకీ ష్రాఫ్, కార్తికేయ దేవ్, యోగిబాబు, ప్రభు, రాహుల్ దేవ్ తదితరులు
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
డీఓపీ: అభినందన్ రామానుజం
ఎడిటర్: విజయ్ వేలుకుట్టి
రచన, దర్శకత్వం: అధిక్ రవిచంద్రన్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
విడుదల తేదీ: ఏప్రిల్ 10, 2025
ఈ ఏడాది ఫిబ్రవరిలో 'విడాముయర్చి'(పట్టుదల)తో నిరాశపరిచిన కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్.. ఇప్పుడు 'గుడ్ బ్యాడ్ అగ్లీ'తో ప్రేక్షకులను పలకరించాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం. మరి ఈ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ ఎలా ఉంది? అజిత్ ఒక భారీ విజయాన్ని అందుకుంటే చూడాలని ఆశపడుతున్న అభిమానుల కోరిక ఈ చిత్రంతో నెరవేరిందా లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
ఏకే అలియాస్ రెడ్ డ్రాగన్ (అజిత్ కుమార్) ఒక గ్యాంగ్ స్టర్. భార్య రమ్య(త్రిష), కుమారుడు విహాన్(కార్తికేయ దేవ్)లతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి.. క్రిమినల్ జీవితాన్ని వదిలి పోలీసులకు లొంగిపోతాడు. జైలు జీవితాన్ని గడిపి బయటకు వచ్చిన ఏకే.. తన కుమారుడు విహాన్ పెద్ద సమస్యలో చిక్కుకున్నాడని తెలుసుకుంటాడు. కొడుకుని రక్షించుకోవడం కోసం మళ్ళీ గ్యాంగ్ స్టర్ అవతారమెత్తుతాడు. అసలు ఏకే ఎవరు? అతను తన గ్యాంగ్‌స్టర్ జీవితాన్ని ఎందుకు వదులుకున్నాడు? విహాన్ కి వచ్చిన సమస్య ఏంటి? దాని వెనుక ఎవరున్నారు? కొడుకు విహాన్ కోసం మళ్ళీ గ్యాంగ్‌స్టర్ గా మారిన ఏకే.. కొడుకుని రక్షించుకోగలిగాడా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
ఎనాలసిస్ :
కథగా చూసుకుంటే 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిన్న కథే. అయితే అజిత్ ఫ్యాన్స్ మెచ్చేలా ఈ కథను తెరమీదకు తీసుకురావడంలో దర్శకుడు అధిక్ రవిచంద్రన్ బాగానే సక్సెస్ అయ్యాడు. అధిక్ కథాకథనాల కంటే కూడా అజిత్ ని స్టైలిష్ గా చూపించడంపైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఇది ఫ్యాన్స్ కి ట్రీట్ లా అనిపించవచ్చు. అదే సమయంలో జనరల్ ఆడియన్స్ కి మాత్రం నచ్చకపోవచ్చు. కథలో కొత్త మెరుపుల్లేవు, కథనంలో ఊహించని మలుపులు లేవు. అయినప్పటికీ హీరో ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ తో బోర్ కొట్టకుండా సినిమాని బాగానే నడిపించాడు అధిక్. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ని నడిపించిన తీరు బాగుంది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే, సెకండ్ హాఫ్ మాత్రం తేలిపోయింది. స్క్రిప్ట్ లో ఎమోషనల్ డెప్త్ ఉండేలా చూసుకోవాల్సింది. తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ సీన్స్ బాగా రాసుకొని ఉండాల్సింది. యాక్షన్ తో పాటు ఎమోషన్స్ కూడా వర్కౌట్ అయితే.. కేవలం ఫ్యాన్స్ కే కాకుండా, సాధారణ ప్రేక్షకులకు కూడా సినిమా నచ్చే అవకాశముండేది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
అజిత్ కుమార్ తన స్క్రీన్ ప్రజెన్స్ తో మ్యాజిక్ చేశాడు. ఆయన స్క్రీన్ మీద కనిపించినప్పుడల్లా ఫ్యాన్స్ కి పండగే. వింటేజ్ అజిత్ కనిపించాడు. త్రిష పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఉన్నంతలో మెప్పించింది. విలన్ గా అర్జున్ దాస్ బాగానే న్యాయం చేశాడు. సునీల్, జాకీ ష్రాఫ్, కార్తికేయ దేవ్ తదితరులు వారి పాత్రల పరిధి మేర నటించారు. సిమ్రాన్ అతిథి పాత్రలో మెరిసింది.
రచయితగా అంతగా మెప్పించలేకపోయిన అధిక్.. దర్శకుడిగా మాత్రం మంచి మార్కులే కొట్టేశాడు. అజిత్ ని స్టైలిష్ గా ప్రజెంట్ చేసిన తీరు, స్టైలిష్ మేకింగ్ మెప్పించాయి. అభినందన్ రామానుజం కెమెరా పనితనం ఆకట్టుకుంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో ఆయన ప్రతిభ కనిపించింది. జి.వి. ప్రకాష్ మ్యూజిక్ పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయింది. ఫస్ట్ హాఫ్ ని పరుగులు పెట్టించిన ఎడిటర్ విజయ్, సెకండ్ హాఫ్ లో చేతులెత్తేశాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ విషయంలో కేర్ తీసుకొని ఉండాల్సింది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
స్టోరీని కాదు, హీరోయిజాన్ని నమ్ముకొని తీసిన సినిమా ఇది. అజిత్ కోసం, యాక్షన్ సీన్స్ కోసం ఈ చిత్రాన్ని ఒకసారి చూడొచ్చు. అజిత్ ఫ్యాన్స్ కి ట్రీట్ లా ఉంటుంది. జనరల్ ఆడియన్స్ కి మాత్రం నచ్చే అవకాశాలు తక్కువే.