తారాగణం: సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాద్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, సాయి కుమార్, గోపరాజు రమణ, కంచెరపాలెం కిషోర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: అనుదీప్ దేవ్
సినిమాటోగ్రఫీ: రాజు ఎడురోలు
ప్రొడక్షన్ డిజైనర్: ప్రణయ్ నైని
ఎడిటర్: అన్వర్ అలీ
డైలాగ్స్: వెంకట సుభాష్ చీర్ల, కొండల రావు అడ్డగళ్ల
రచన, దర్శకత్వం: యదు వంశీ
సమర్పణ: నిహారిక కొణిదెల
నిర్మాతలు: పద్మజ కొణిదెల,జయలక్ష్మి అడపాక,
బ్యానర్స్: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్
విడుదల తేదీ: ఆగష్టు 9, 2024
నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా మారి పలు వెబ్ సిరీస్ లతో ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆమె బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి తొలి ఫీచర్ ఫిల్మ్ గా 'కమిటీ కుర్రోళ్ళు' వచ్చింది. ఇందులో 11 మంది యువ నటులు ముఖ్యపాత్రలు పోషించారు. యదు వంశీ దర్శకుడిగా పరిచయమయ్యారు. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
గోదావరి జిల్లాల్లోని ఒక పల్లెటూరులో పన్నెండేళ్లకు ఒకసారి జాతర జరుగుతుంది. ఈసారి జాతర సమయంలోనే పంచాయితీ ఎన్నికలు కూడా వస్తాయి. ప్రస్తుత సర్పంచ్ బుజ్జి(సాయి కుమార్)పై శివ(సందీప్ సరోజ్) అనే యువకుడు పోటీకి సిద్ధమవుతాడు. అయితే 12 ఏళ్ళ క్రితం జాతర సమయంలో.. 11 మంది ఉండే శివ గ్యాంగ్ మధ్య జరిగిన గొడవ కారణంగా ఒకరు చనిపోతారు. అందుకే ఈసారి జాతరకు ఎటువంటి గొడవలు జరగకుండా చూడాలని, జాతర పూర్తయ్యేవరకు ఎన్నికల ప్రచారాలు చేయకూడదని ఊరిపెద్దలు నిర్ణయిస్తారు. అసలు గత జాతరలో జరిగిన గొడవ ఏంటి? కులాలకు, మతాలకు అతీతంగా ఎంతో అన్యోన్యంగా ఉండే 11 మంది స్నేహితుల మధ్య గొడవ జరిగి.. ఒకరు చనిపోవడానికి, మిగతావారు విడిపోవడానికి దారితీసిన పరిస్థితులేంటి? 12 ఏళ్ళ తర్వాత వచ్చిన జాతరకు మళ్ళీ వాళ్ళు కలిసారా? జాతర ముగిసాక జరిగిన ఎన్నికల్లో బుజ్జిపై శివ విజయం సాధించాడా? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.
ఎనాలసిస్ :
కొన్ని సినిమాలు కథగా చూసుకుంటే పెద్దగా చెప్పుకోవడానికి ఏముండదు. కానీ సినిమా చూస్తున్నప్పుడు ఏదో తెలియని అనుభూతిని కలిగిస్తాయి. అలాంటి సినిమానే 'కమిటీ కుర్రోళ్ళు'. 90లలో పుట్టిన 11 మంది విలేజ్ కుర్రాళ్ళ కథ ఇది. ఇప్పటి పిల్లలకు ఆటయినా పాటయినా మొబైల్ తోనే. కానీ అప్పుడలా కాదు. ఎన్నో ఆటలు, ఎన్నెన్నో మధురానుభూతులు. కులాలకు మతాలకు అతీతంగా ఎలాంటి కల్మషంలేని స్వచ్ఛమైన స్నేహం. ఇలా అప్పటి జ్ఞాపకాలను తట్టిలేపి, మళ్ళీ ఆరోజుల్లోకి తీసుకెళ్తుంది ఈ చిత్రం.
జాతర ఏర్పాట్లు, పంచాయితీ ఎన్నికల హడావుడితో మొదలుపెట్టి.. శివ మరియు అతని స్నేహితులను పరిచయం చేస్తూ ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్లాడు దర్శకుడు. తెలిసీతెలియని వయసులో వాళ్ళు చేసే అల్లరి మనల్ని నవ్విస్తుంది. చిన్నతనంలో మనం చేసిన అల్లరి, అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. ఇలా ప్రథమార్థం ఎంతో సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్ కి ముందు కథ సీరియస్ టర్న్ తీసుకుంటుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ మెప్పించింది.
ఫస్టాఫ్ లో ఎంతగానో నవ్వించిన దర్శకుడు.. సెకండాఫ్ లో ఎమోషన్స్ మీద సినిమాని నడిపించే ప్రయత్నం చేశాడు. ఎమోషన్స్ కూడా బాగా పండాయి. 12 ఏళ్ళ తర్వాత స్నేహితులు కలిసే సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. అయితే సెకండాఫ్ గడిచే కొద్దీ నెమ్మదిగా సినిమా గ్రాఫ్ పడిపోతున్నట్టు అనిపిస్తుంది. సినిమాకి ఎంతో కీలకమైన జాతర ఎపిసోడ్ ని ఎటువంటి మలుపులు లేకుండా సింపుల్ గా ముగించి, ఎన్నికల ఎపిసోడ్ స్టార్ట్ చేయడం నిరాశ కలిగిస్తుంది. ఎన్నికల ఎపిసోడ్ నిడివి తగ్గించి, జాతర ఎపిసోడ్ ని మరింత ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది. సినిమాని ముగించిన తీరు రెగ్యులర్ క్లైమాక్స్ లకి భిన్నంగా బాగుంది. నాయకుడు ఎలా ఉండాలి, ఓటర్లు ఎలా ఉండాలి అనే విషయాలను టచ్ చేస్తూ.. ఓటు విలువని తెలియజేస్తూ సినిమాని ముగించారు. అలాగే ఇందులో రిజర్వేషన్ల గురించి కూడా చర్చించారు.
నటీనటులు, సాంకేతిక నిపుణుల తీరు:
ఇందులో 11 మంది ప్రధాన పాత్ర పోషించారు. ఎవరికివారు తమదైన నటనతో మెప్పించి, వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. శివ పాత్రలో నటించిన సందీప్ సరోజ్ ఎంతో సెటిల్డ్ గా పర్ఫామ్ చేశాడు. అలాగే పెద్దోడు పాత్రలో ప్రసాద్ బెహెరా ఆకట్టుకున్నాడు. ఫస్టాఫ్ లో ఎంత నవ్వించాడో, సెకండాఫ్ లో అంత ఏడిపించాడు. సర్పంచ్ పాత్రలో సాయి కుమార్ ఎప్పటిలాగే మెప్పించారు. గోపరాజు రమణ, కంచెరపాలెం కిషోర్ తదితరులు పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
దర్శకుడు యదు వంశీ తన చిన్నతనంలో చూసిన సంఘటలనే సినిమాగా తెరకెక్కించినట్టున్నాడు. సన్నివేశాలు సహజంగా ఉన్నాయి. ఫస్టాఫ్ లో ప్రతి సీన్ మనసుని తాకుతుంది. అయితే సెకండాఫ్ విషయంలో ఇంకా కేర్ తీసుకొని ఉండాల్సింది. ఫస్టాఫ్ స్థాయిలో సెకండాఫ్ ఉండి ఉంటే సినిమా రిజల్ట్ మరోలా ఉండేది. సంభాషణలు బాగున్నాయి. అనుదీప్ దేవ్ సంగీతం కథకి తగ్గట్టుగా కూల్ గా ఉంది. రాజు ఎడురోలు సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ఆ రోజులను మన కళ్ళ ముందుకు తీసుకొచ్చాడు. జాతర ఎపిసోడ్స్ లో ఆయన పనితనం కనిపించింది. అన్వర్ అలీ ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తెలుగుఒన్ పర్స్పెక్టివ్:
ఈ కమిటీ కుర్రోళ్ళు మనల్ని చిన్నతనంలోకి తీసుకెళ్లి.. నవ్విస్తారు, ఏడిపిస్తారు, ఆలోచింపజేస్తారు. 90s కిడ్స్ కి ఈ సినిమా నచ్చే అవకాశముంది.
- గంగసాని