`భీష్మ`.. యూత్ స్టార్ నితిన్ ప్రీవియస్ బ్లాక్ బస్టర్ మూవీ ఇది. `ఛలో`వంటి విజయవంతమైన చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగేసిన వెంకీ కుడుముల ఆ సినిమాని తెరకెక్కించాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుని టాక్ ఆఫ్ టాలీవుడ్ అయ్యాడు. కట్ చేస్తే.. `భీష్మ` తరువాత మాత్రం వరుసగా ఫ్లాప్ డైరెక్టర్లతోనే పనిచేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు నితిన్.
ఆ వివరాల్లోకి వెళితే.. `భీష్మ` తరువాత నితిన్ నుంచి వచ్చిన చిత్రం `చెక్`. చాలా కాలంగా హిట్ ముఖం చూడని వెర్సటైల్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి ఈ యాక్షన్ థ్రిల్లర్ ని రూపొందించాడు. చందు రీసెంట్ ట్రాక్ రికార్డుకి తగ్గట్టే.. `చెక్` కూడా నిరాశజనక ఫలితాన్నే అందుకుంది. ఇక `చెక్` విడుదలైన నెలరోజుల్లోపే వచ్చిన `రంగ్ దే` విషయానికొస్తే.. `మిస్టర్ మజ్ను` వంటి ఫెయిల్యూర్ తరువాత `తొలిప్రేమ` ఫేమ్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన సినిమా ఇది. ఫస్ట్ వీకెండ్ లో ఫర్లేదనిపించినా.. తర్వాత మాత్రం టికెట్ విండోస్ వద్ద డీలా పడిందీ రొమాంటిక్ ఎంటర్ టైనర్. అలా.. ఫ్లాపుల్లో ఉన్న దర్శకులతో నితిన్ చేసిన ఈ రెండు సినిమాలు కూడా ఫెయిల్యూర్ బాట పట్టాయి.
ఇక ప్రస్తుతం నితిన్ చేతిలో ఉన్న `మాస్ట్రో` విషయానికొస్తే.. `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్`, `ఎక్స్ ప్రెస్ రాజా`తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని ఆనక `కృష్ణార్జున యుద్ధం`తో డిజాస్టర్ చూసిన మేర్లపాక గాంధీ నుంచి వస్తున్న సినిమా ఇది. జూన్ 11న రావాల్సిన ఈ థ్రిల్లర్.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడనుంది. కాగా, ఫ్లాప్ లో ఉన్న డైరెక్టర్ తోనే చేసిన ఈ సినిమా నితిన్ కి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అన్న ఆసక్తి ట్రేడ్ వర్గాల్లో నెలకొని ఉంది.
అంతేకాదు.. `ఛల్ మోహన్ రంగ` వంటి ఫ్లాప్ తరువాత కృష్ణ చైతన్యతో `పవర్ పేట`, `నా పేరు సూర్య` వంటి ఫెయిల్యూర్ తరువాత వక్కంతం వంశీతో ఓ సినిమా చేయబోతున్నాడు నితిన్. మొత్తమ్మీద.. నితిన్ ఐదు వరుస చిత్రాలు కేరాఫ్ ఫ్లాప్ డైరెక్టర్స్ అన్నట్లుగా తెరకెక్కడం వార్తల్లో నిలుస్తోంది.