మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో `కిక్` (2009) ఒకటి. `అతనొక్కడే` (2005) తరువాత `అశోక్` (2006), `అతిథి` (2007) చిత్రాలతో ట్రాక్ తప్పిన దర్శకుడు సురేందర్ రెడ్డికి మళ్ళీ సక్సెస్ అందించిన ఈ సినిమాతోనే.. యువ సంగీత సంచలనం తమన్ స్వరకర్తగా తొలి బ్రేక్ అందుకున్నాడు. అప్పటివరకు స్లిమ్ లుక్ లోనే కనిపిస్తూ వచ్చిన అందాల తార ఇలియానా ఈ చిత్రంలో తొలిసారిగా బొద్దుగా కనిపించి కుర్రకారుకి `కిక్` ఇచ్చింది. శ్యామ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, రావు రమేశ్, జయప్రకాశ్ రెడ్డి, షాయాజీ షిండే, ప్రభ, అలీ, వేణుమాధవ్, నళిని, రఘుబాబు ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు.
`సిరివెన్నెల` సీతారామశాస్త్రి సాహిత్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ``అటు చూడొద్దన్నానా``, ``గోరే గోరే`` గీతాలు చార్ట్ బస్టర్స్ గా నిలవగా.. `బాసూ మనకి మెమరీ లాసూ``, ``ఐ డోన్ట్ వాంట్ లవ్``, ``మనసే తడిసేలా``, ``దిల్ ఖలాసే`` అంటూ సాగే పాటలు కూడా ఆకట్టుకున్నాయి. హిందీలో `కిక్` (సల్మాన్ ఖాన్, జాక్వలైన్ ఫెర్నాండేజ్), తమిళంలో `తిల్లాలంగడి` (`జయం` రవి, తమన్నా), కన్నడంలో `సూపర్ రంగ` (ఉపేంద్ర, కృతి కర్బందా) పేర్లతో `కిక్` రీమేక్ అయింది. అలాగే 2015లో `కిక్`కి సీక్వెల్ గా `కిక్ 2` తెరకెక్కింది. ఆర్. ఆర్. మూవీ మేకర్స్ పతాకంపై ఆర్. ఆర్. వెంకట్ నిర్మించిన `కిక్`.. 2009 మే 8న విడుదలై ఆయేటి సమ్మర్ సెన్సేషన్ గా నిలిచింది. నేటితో ఈ చిత్రం 12 వసంతాలను పూర్తిచేసుకుంది.