ప్రముఖ జర్నలిస్ట్ టీఎన్ఆర్ (తుమ్మల నరసింహ రెడ్డి) కరోనాతో పోరాడుతూ సోమవారం ఉదయం కనుమూశారు! నిన్న ఉదయం నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది! రాత్రి కోమా స్థితికి వెళ్లారు! కొద్దిసేపటి క్రితమే టీఎన్ఆర్ ఇక లేరు అని వైద్యులు ప్రకటించారు. ఆయన ఆకస్మిక మృతికి పలువురు జర్నలిస్టులు, సినీ సెలబ్రిటీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంగీత దర్శకుడు రఘు కుంచె తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో "భయ్యా ... ఈ వార్త వినకూడదని నిన్నటి నుండి ప్రార్థిస్తున్నా .. అన్యాయం భయ్యా" అంటూ ఆక్రోశించారు.
రచయిత వెంకట్ సిద్దారెడ్డి తన ఫేస్‌బుక్ హ్యాండిల్ ద్వారా టీఎన్ఆర్ మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. "TNR గారు ఇక లేరు అనే విషయం నమ్మలేని నిజంలా ఉంది. ఎన్నో కష్టనష్టాలకోర్చి, తనకంటూ ఒక స్థానాన్ని కల్పించుకుని, విజయవంతంగా ముందుకు సాగిపోతున్న జీవితం హటాత్తుగా ఆగిపోవడం చాలా బాధాకరం. మంచి మిత్రుడు, ఎప్పుడూ నవ్వుతూ పలకరించే వ్యక్తి. మల్లేశం, అనగనగా ఒక నాన్న సినిమాల్లో కలిసి పనిచేశాం. త్వరలోనే కలుద్దాం అనుకున్నాం ఈ మధ్యనే! ఇంతలోనే కరోనా అతన్ని తీసుకెళ్ళిపోయింది. మిస్ యూ TNR." అంటూ రాసుకొచ్చారు.
యూట్యూబ్ జర్నలిజంలో టిఎన్ఆర్ మంచి పేరు తెచ్చుకున్నారు. పలువురు సెలబ్రిటీలతో ఆయన చేసిన ఇంటర్వ్యూలు బాగా పాపులర్ అయ్యాయి. మంచి మనసున్న జర్నలిస్టుగా పేరు తెచ్చుకున్నారు. ఆ పేరే ఆయనకు సినిమాల్లో నటుడిగానూ అవకాశాలు తీసుకొచ్చింది. కెరీర్‌లో ఎన్నో కష్టాలు, అవరోధాలను ఎదుర్కొంటూ వచ్చిన ఆయన, కరోనా మహమ్మారి ముందు తలవంచారు.