"మళ్లీ మళ్లీ ఇది రాని రోజు".. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన 'రాక్షసుడు' (1986) చిత్రంలోని బహుళ ప్రాచుర్యం పొందిన గీతమిది. చిరు కెరీర్ కి సంబంధించి అలా 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' ఏదైనా ఉందా? అంటే అది కచ్చితంగా 'మే 9' అనే చెప్పాలి. ఎందుకంటే.. ఇదే తేదీన రెండు వరుస సంవత్సరాల్లో బ్యాక్ టు బ్యాక్ 'ఇండస్ట్రీ హిట్స్' అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేశారు మెగాస్టార్.
ఆ వివరాల్లోకి వెళితే.. 31 ఏళ్ళ క్రితం అంటే 1990లో ఇదే మే 9న చిరు కథానాయకుడిగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు రూపొందించిన 'జగదేకవీరుడు - అతిలోకసుందరి' విడుదలైంది. ప్రతికూల పరిస్థితులను అధిగమించి మరీ రికార్డ్ స్థాయి వసూళ్ళతో 'ఇండస్ట్రీ హిట్'గా నిలిచిందీ సోషియో - ఫాంటసీ మూవీ. అందాల తార శ్రీదేవి అభినయం, మేస్ట్రో ఇళయరాజా బాణీలు.. ఈ సినిమా విజయంలో ముఖ్య భూమిక పోషించాయి.
కట్ చేస్తే.. ఏడాది తరువాత అంటే 1991లో ఇదే మే 9న చిరు ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ నమోదయింది. అదే.. 'గ్యాంగ్ లీడర్'. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో తన మార్క్ డాన్సులు, ఫైట్లతో బాక్సాఫీస్ ని షేక్ చేశారు చిరు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గ్లామర్, బప్పీలహరి సంగీతం, విజయబాపినీడు దర్శకత్వం.. ఈ చిత్రానికి అదనపు బలంగా నిలిచాయి.
'గ్యాంగ్ లీడర్' తరువాత కూడా చిరు ఖాతాలో ఇండస్ట్రీ హిట్స్ ఉన్నా.. ఇలా ఒకే తేదిన రెండు 'ఇండస్ట్రీ హిట్స్' అందుకున్న వైనం 'నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్' అనే చెప్పాలి. అలా.. మే 9 ఇండస్ట్రీ హిట్స్ పరంగా చిరుకి "మళ్లీ మళ్లీ ఇది రాని రోజు"గా నిలిచిపోయింది.