అఖిల్ హీరోగా మూడు సినిమాలు రిలీజయ్యాయి. ఒక్కటీ ఆశించిన రీతిలో ఆడలేదు. అతడి కెరీర్‌కు బూస్ట్‌నివ్వలేదు. నాలుగో సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' షూటింగ్ 2019 జూలైలో మొదలైతే, ఇంతదాకా విడుదలకు నోచుకోలేదు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో అల్లు అరవింద్ సమర్పణలో నిర్మాణమైన ఈ సినిమా విడుదలను కరోనా దెబ్బకొట్టింది. బాగా ప్లాన్ చేసుకున్నట్లయితే 2021 జనవరి నుంచి మార్చి మధ్యలో రిలీజయ్యేదే. ఎందుకనో ప్రొడ్యూసర్లు ఆ దిశగా ప్లాన్ చెయ్యలేదు. జూన్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు అది జరిగే అవకాశం కనిపించడం లేదు. ఎందుకనో విధి అఖిల్‌తో ఆడుకుంటోందనిపిస్తోంది.
అఖిల్ మొదటి సినిమా 'అఖిల్'. ఎందుకు తన పేరున్న క్యారెక్టర్‌తోటే తొలి సినిమా తీసి, దాన్నే టైటిల్‌గా పెట్టారో తెలీదు. అది బోల్తా కొట్టింది. ఆ సినిమాతోటే అఖిల్ మంచి పాఠం నేర్చుకున్నాడని తండ్రి నాగార్జున అన్నారు కానీ, అఖిల్ ఆచరణలో పెట్టినట్లు కనిపించలేదు. రెండో సినిమా 'హలో' యావరేజ్‌గా ఆడగా, మూడో సినిమా 'మిస్టర్ మజ్ను' బిలో యావరేజ్‌గా ఆడింది.
మళ్లీ మొదటి సినిమాకెళ్దాం. 'అఖిల్' సినిమా ఫెయిలవడంతో బాగా డిజప్పాయింట్ అయ్యామని నాగార్జునే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. "వీవీ వినాయక్‌తో చెయ్యాలని ఉంది నాన్నా అన్నాడు అఖిల్. అలాగే అన్నాను. ఆయన పెద్ద డైరెక్టర్, మంచి డైరెక్టర్. మనం అనుకున్నవన్నీ జరగవు కదా! ఆ సినిమా అఖిల్‌కు ఓ మంచి పాఠం. చిన్నవయసులోనే నేర్చుకున్నాడు. నేను చెబుతున్నది నటన విషయంలో కాదు, కథను ఎంచుకోవడంలో, తనను ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారనే విషయంలో పాఠం నేర్చుకున్నాడు. వినాయక్ చాలా మంచాయన. ఆయన వద్దకు వచ్చిన కథకు వంద శాతం న్యాయం చేశారు. నిర్మాతలు తమ వంతు ప్రయత్నం బాగా చేశారు. అది అఖిల్‌కు సూటవలేదో, లేదంటే ప్రజలకు నచ్చలేదో. దానికి వినాయక్‌ను కానీ, నిర్మాతను కానీ తప్పుపట్టడానికి లేదు." అని చెప్పుకొచ్చారు నాగ్.
ఈ సందర్భంగా నాగచైతన్య ఫస్ట్ ఫిల్మ్ 'జోష్'ను గుర్తు చేసుకున్నారాయన. "నాగచైతన్య మొదటి సినిమా 'జోష్'కూ, ఇప్పుడు 'అఖిల్'కూ అడ్డంకులొచ్చాయి. 'జోష్' రిలీజ్ టైమ్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి గారు పోవడం, ఫోకస్ అంతా దానిపై వెళ్లడం ఆ సినిమాకు ప్రతికూలమైతే, 'అఖిల్' అనుకున్న టైమ్‌లో కాకుండా రాంగ్ డేట్‌లో రిలీజవడం ప్రతికూలమైంది. అయితే వాటివల్లే ఆ సినిమాలు ఆడలేదని చెప్పను. సినిమా బాగుంటే ఆడుతుంది. కాకపోతే మరీ అంత బ్యాడ్ అయ్యేది కాదనేది నా అభిప్రాయం. సినిమాకు రిలీజ్ టైమింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్." అన్నారు నాగార్జున.