విలక్షణ నటనకు పెట్టింది పేరు.. లోకనాయకుడు కమల్ హాసన్. సంచలనాలకు చిరునామాగా నిలిచిన దర్శకుడు.. శంకర్. భారతీయ సంగీతాన్ని మరో స్థాయికి తీసుకెళ్ళిన స్వరకర్త.. ఎ.ఆర్. రెహమాన్. అలాంటి ముగ్గురు హేమాహేమీల అపూర్వ కలయికలో వచ్చిన సినిమా అంటే.. చరిత్రలో తప్పక స్థానం పొందేలానే ఉంటుంది కదా!. ఆ చిత్రమే.. తమిళంలో రూపొందిన 'ఇండియన్'. తెలుగులో `భారతీయుడు`, హిందీలో 'హిందుస్తానీ' పేర్లతో అనువాదమైన ఈ సెమీ పిరియడ్ డ్రామా.. అప్పట్లో దక్షిణాది పరిశ్రమలో ఓ సంచలనం.
లంచగొండితనంపై మాజీ స్వాతంత్ర్య పోరాట యోధుడైన ఓ భారతీయుడు చేసిన పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శంకర్ ఆద్యంతం ఎంత ఆసక్తికరంగా తీర్చిదిద్దారో.. తండ్రీకొడుకులుగా రెండు విభిన్న పాత్రల్లో కమల్ హాసన్ తనదైన అభినయంతో అంతకన్న మిన్నగా ఆకట్టుకున్నారు. ఇక.. ఎ.ఆర్. రెహమన్ బాణీలు, నేపథ్య సంగీతం సరేసరి.
కమల్ హాసన్ కి జంటగా సుకన్య, మనీషా కోయిరాలా, ఊర్మిళ నటించిన ఈ సినిమాలో కస్తూరి, నెడుముడి వేణు, గౌండమణి, సెంథిల్, క్రేజీ మోహన్, అజయ్ రత్నం, మనోరమ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. 'బెస్ట్ యాక్టర్' (కమల్ హాసన్), 'బెస్ట్ ఆర్ట్ డైరెక్షన్' (తోట తరణి), 'బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్' (ఎస్. టి. వెంకీ) విభాగాల్లో జాతీయ పురస్కారాలను.. 'ఉత్తమ నటుడు', 'ఉత్తమ చిత్రం' విభాగాల్లో తమిళనాడు స్టేట్ అవార్డ్స్, ఫిల్మ్ ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని శ్రీ సూర్య మూవీస్ పతాకంపై ఎ.ఎం. రత్నం నిర్మించారు. 1996 మే 9న విడుదలైన 'భారతీయుడు' నేటితో 25 వసంతాలను పూర్తిచేసుకుంది.