టాలీవుడ్ అగ్ర తారల్లో ఒకరైన సమంత మ్యారేజ్ తర్వాత గ్లామరస్ రోల్స్‌ను పక్కనపెట్టి పర్ఫార్మెన్స్కు స్కోప్ ఉన్న పాత్రలనే చేస్తూ వస్తోంది. పెళ్లికి ముందు ఆమె చేసిన మంచి పాత్రల్లో 'అ ఆ' సినిమాలోని అనసూయ పాత్ర ఒకటి. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఆ మూవీలో హీరో ఆనంద్ విహారిగా నితిన్ నటించాడు. 2016లో వచ్చిన ఆ సినిమా నితిన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. యు.ఎస్.లోనూ టాలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్స్ లిస్ట్‌లో చేరింది. అయితే ఆ సినిమా షూటింగ్ సందర్భంలో సమంత, నితిన్‌లను ఉద్దేశించి "మీ ఇద్దర్నీ పెట్టి తప్పు చేశానా?" అని త్రివిక్రమ్ అన్నారనే విషయం చాలా మందికి తెలీదు.
అవును. ఈ నిజాన్ని సమంత స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అదివరకు ఎన్ని పాత్రలు చేసినా ఆమె తెరపై కామెడీ చేసిన ఫస్ట్ ఫిల్మ్ 'అ ఆ'. "నాకు కమెడియన్స్ అంటే చాలా గౌరవం. కామెడీ పండించడం చాలా క్లిష్టమైన వ్యవహారం. ప్రేక్షకులకు నవ్వు రాలేదంటే అది అపహాస్యం అయినట్లే. ఆ రిస్క్‌ను నేను తీసుకున్నా. నాకు అలాంటి పాత్ర ఇచ్చినందుకు కచ్చితంగా త్రివిక్రమ్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. వృత్తిపరంగానే కాకుండా, వ్యక్తిగతంగా కూడా త్రివిక్రమ్ గారి ప్రభావం నాపై ఉంది. నాలోని అభద్రతా భావనలను ఆయనతో కలిసి పనిచేసేటప్పుడు నేను అధిగమించాను. ఆయన నాకు పాత్ర గురించి చెబుతుంటే, ఆయనను నేను ఇమిటేట్ చేశానంతే." అని చెప్పింది సమంత.
'అ ఆ' సినిమాలో అనసూయ, ఆనంద్ విహారి పాత్రలకు సమ ప్రాధాన్యం ఉంది. సినిమా మొత్తం అనసూయ దృష్టికోణం నుంచి నడుస్తుంది. "నిజ జీవితంలో నేనేమిటో అనసూయ పాత్ర కూడా అంతే. కొంచెం అల్లరిగా ఉంటూ వేగంగా నిర్ణయాలు తీసుకొనే తత్వం ఉన్న పాత్ర. ఈ సినిమా చెయ్యక ముందు నుంచీ నితిన్ నాకు మంచి ఫ్రెండ్. అందువల్ల ఈ సినిమా చేసేటప్పుడు చాలా ఒత్తిడి ఫీలయ్యాను. మొదటి రెండు రోజులూ రొమాంటిక్ సీన్లు చెయ్యడం చాలా కష్టమైపోయింది. సెట్స్‌పై మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ జీరో. దాంతో 'మీ ఇద్దరి పెట్టి నేను తప్పు చేశానా?' అని కూడా అనేశారు త్రివిక్రమ్. ఆయన అలా అన్న తర్వాతే మేం కుదురుకున్నాం." అని చెప్పుకొచ్చింది సమంత.