![]() |
![]() |

ఒకే బ్యానర్ లో రూపొందిన రెండు సినిమాలు ఒకేసారి విడుదలై.. భారీ కలెక్షన్లు రాబడుతూ రెండూ ఘన విజయం దిశగా దూసుకుపోవడం చాలా అరుదు. ఈ సంక్రాంతికి అలాంటి అద్భుతమే జరిగింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన 'వాల్తేరు వీరయ్య', 'వీరసింహారెడ్డి' సినిమాలు ఒక్కరోజు తేడాతో విడుదలై.. రెండూ వంద కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. వంద కోట్ల మార్క్ అందుకోవడానికి వీరయ్యకు మూడు రోజులు పడితే, వీరసింహాకు నాలుగు రోజులు పట్టింది. ఈ రెండు సినిమాల వసూళ్ళను తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
జనవరి 12న విడుదలైన 'వీరసింహారెడ్డి' ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లో రూ.104 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిందని తెలుపుతూ తాజాగా మైత్రి సంస్థ ఒక పోస్టర్ ను వదిలింది. ఇక జనవరి 13న విడుదలైన 'వాల్తేరు వీరయ్య' అయితే కేవలం మూడు రోజుల్లోనే రూ.108 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ప్రకటించింది. ఇలా ఒకే బ్యానర్ నుంచి వచ్చిన రెండు సినిమాలు ఒకేసారి విడుదలై రెండూ వంద కోట్ల క్లబ్ లో చేరడం ఆసక్తికరంగా మారింది. ముందు ముందు ఈ చిత్రాలు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి.
![]() |
![]() |