మెగాభిమానులకు గుడ్ న్యూస్. ఆ మాటకొస్తే... గత వారంలో చిరంజీవిని కలిసి టెన్షన్ పడుతున్న ప్రతి ఒక్కరికీ రిలీఫ్ ఇచ్చే న్యూస్ ఇది! మెగాస్టార్ చిరంజీవికి కరోనా లేదు. మీరు చదివింది నిజమే! మరి, మొన్నే కదా... తనకు కరోనా సోకిందని స్వయంగా చిరంజీవిపై ప్రకటించినది? ఇంతలో నెగెటివ్ ఎలా వచ్చింది? అంటే... పాజిటివ్ అని రిపోర్టు వచ్చిన కిట్ లో సమస్యలు ఉన్నాయి. అది సరిగా పని చేయలేదు కాబట్టి! అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే చిరంజీవి చేసిన తాజా ట్వీట్ ఒకసారి చదవాల్సిందే!
"కాలం, కారోనా... గత నాలుగు రోజులుగా నన్ను కన్‌ఫ్యూజ్ చేసి నాతో ఆడేసుకున్నాయి. ఆదివారం టెస్టులో పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన తరవాత బేసిక్ మెడికేషన్ స్టార్ట్ చేశా. రెండు రోజులైనా ఎటువంటి లక్షణాలు లేకపోయేసరికి... నాకే అనుమానం వచ్చి అపోలో ఆసుపత్రి వైద్యులను అప్రోచ్ అయ్యాను. వాళ్ళు సీటీ స్కాన్ చేసి, ఛాతిలో ఎటువంటి ట్రెసెస్ లేవు అన్న నిర్ధారణకు వచ్చారు. అపోలోలో నెగెటివ్ రిజల్ట్ వచ్చిన తరవాత మరొక్కసారి, మరో చోట నివృత్తి చేసుకుందామని నేను టెనెట్ ల్యాబ్ లో మూడు రకాల కిట్ లతో టెస్ట్ కూడా చేయించాను. అక్కడా నెగెటివ్ రిజల్ట్ వచ్చింది. ఫైనల్ గా ఆదివారం నాకు పాజిటివ్ అని రిజల్ట్ ఇచ్చిన చోటు కూడా 'RT PCR' టెస్ట్ చేయించా. అక్కడ కూడా నెగెటివ్ రిజల్ట్ వచ్చింది. ఈ మూడు రిపోర్టుల తరవాత మొదట రిపోర్ట్ 'faulty కిట్' వలన వచ్చిందని డాక్టర్లు నిర్ధారణకు వచ్చారు" అని చిరంజీవి ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
ఈ సమయంలో ప్రజలందరూ చూపించిన ప్రేమాభిమానాలకు, త్వరగా కోలుకోవాలని చేసిన పూజలకు చిరంజీవి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. చిరంజీవికి కరోనా నెగెటివ్ అని తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.