మూడేళ్లుగా పొలిటికల్ పార్టీపై మల్లగుల్లాలు పడుతూ వస్తోన్న సౌతిండియా సూపర్‌స్టార్ తన ఆరోగ్య పరిస్థితి రీత్యా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఇటీవల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అధికారికంగా త్వరలోనే దీనిపై ఆయన నుంచి ప్రకటన వస్తుందని ఊహిస్తున్నారు. మరోవైపు రజనీ బయోపిక్ చేయాలని ఆయన అల్లుడు ధనుష్ ఉత్సాహపడుతున్నాడు. డైరెక్టర్ లింగుస్వామి ఈ మేరకు ధనుష్‌ను ఒప్పించాడంట.
కొంత కాలం నుంచీ ఖాళీగా ఉన్న లింగుస్వామి దృష్టి సూపర్‌స్టార్ బయోపిక్‌పై పడిందంటున్నారు. మహారాష్ట్రలో శివాజీ రావ్ గైక్వాడ్‌గా పుట్టి కర్ణాటకలో బస్ డ్రైవర్‌గా పనిచేసి, తమిళనాట సూపర్ స్టార్‌గా నీరాజనాలు అందుకొనే స్థాయికి ఎదిగిన రజనీ జీవితాన్ని మించిన డ్రామా ఏముంటుందని చెప్పి ధనుష్‌ను ఆయన క్యారెక్టర్ చేయడానికి ఓకే అనిపించాడు. రజనీకి ధనుష్ అల్లుడు కావడం వల్ల కూడా ఆ బయోపిక్‌కు క్రేజ్ వస్తుందనేది లింగుస్వామి ఆలోచన. అల్లుడు తన క్యారెక్టర్ చేస్తానంటే రజనీ కూడా కాదనడని అతననుకున్నాడు.
అయితే ఈ ఐడియాని రజనీ మొదట్లోనే తిరస్కరించాడని కోలీవుడ్‌లో చెప్పుకుంటున్నారు. తన బయోపిక్ ఆలోచన ఇప్పుడు చేయొద్దని ఆయన లింగుస్వామికి గట్టిగా చెప్పేశాడంట. దీంతో ఖంగుతిన్న ఆ డైరెక్టర్ ఆయనను కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడనీ, కానీ రజనీ కన్విన్స్ కాలేదనీ సమాచారం.