లోకనాయకుడు కమల్ హాసన్ కుమార్తె అనే ట్యాగ్ తో నాయికగా ఎంట్రీ ఇచ్చినా.. అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శ్రుతి హాసన్. 'గబ్బర్ సింగ్'తో తొలి బ్లాక్‌బస్టర్ అందుకున్న శ్రుతి.. ఆపై బలుపు, ఎవడు, రేసు గుర్రం, శ్రీమంతుడు, ప్రేమమ్ వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగువారికి మరింత చేరువయ్యారు. కాగా 'కాటమరాయుడు' తరువాత మూడేళ్లపాటు టాలీవుడ్ కి దూరమైన శ్రుతి త్వరలో 'క్రాక్'తో రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా 2021 సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. శ్రుతి హాసన్ తొలి తెలుగు చిత్రం 'అనగనగా ఓ ధీరుడు' (2011) కూడా పదేళ్ళ క్రితం సంక్రాంతి బరిలోనే సందడి చేసింది. కట్ చేస్తే.. ఇప్పుడు రీ-ఎంట్రీ మూవీ 'క్రాక్' కూడా అదే బాట పడుతుండడం విశేషం. మరి.. ఎంట్రీ మూవీతో సంక్రాంతి హిట్ కొట్టలేకపోయిన శ్రుతి.. రీ-ఎంట్రీ ఫిల్మ్ తో మంచి విజయాన్ని అందుకుంటారేమో చూడాలి.