బుల్లితెరపై ‘చిన్నారి పెళ్లికూతురు’ (హిందీలో ‘బాలికా వధు’ సీరియల్)గా... వెండితెరపై ‘ఉయ్యాలా జంపాలా’, ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజుగారి గది 3’ చిత్రాల్లో కథానాయికగా ప్రేక్షకులను ఆకట్టుకున్న కథానాయిక అవికా గోర్. గతంతో పోలిస్తే... బాగా బరువు తగ్గి ఇటీవల వార్తల్లో నిలిచారు. మరోసారి ఆమె వార్తల్లోకి వచ్చారు. ఈసారి ప్రేమలో పడ్డానని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలోకి నెట్టారు.
హిందీ బుల్లితెర వీక్షకుల్లో, తెలుగు ప్రేక్షకుల్లో అవికా గోర్‌కి మంచి గుర్తింపు ఉన్నది. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యేవాళ్ళకి మిళింద్ చంద్వాని తెలిసే ఉంటాడు. ఎందుకంటే... ఈ హీరోయిన్ పోస్టుల్లో అప్పుడప్పుడూ అతడు కనిపిస్తుంటాడు. గతంలో "అతడెవరు?" అని అవికాను అడిగితే స్నేహితుడని సమాధానం ఇచ్చేవారు. అయితే... బుధవారం సాయంత్రం చేసిన పోస్టులో తామిద్దరం ప్రేమలో ఉన్నట్టు అవికా గోర్ వెల్లడించారు. తన ప్రార్థనలకు ఫలితం లభించిందనీ, తన జీవిత భాగస్వామి దొరికాడని ఆమె పేర్కొన్నారు. ‘‘అతడు నావాడు... నేను అతని దానిని’’ అని అవికా గోర్ తెలిపారు.
‘‘మనల్ని అర్థం చేసుకొనే, మనపై విశ్వాసం ఉంచే, మనల్ని జాగ్రత్తగా చూసుకొనే, మనం జీవితంలో ఎదగడానికి తోడ్పాటునందించే జీవిత భాగస్వామి మనందరికీ కావాలి. కానీ, అటువంటి వారు దొరకడం అసాధ్యమని మనమంతా అనుకుంటాం. అటువంటి వ్యక్తి నాకు దొరకడంతో కలలా ఉంది. కానీ, నిజమే’’ అని అవికా గోర్ అన్నారు.