యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్థాయిని పెంచిన చిత్రం 'ఛత్రపతి'. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్.. ఒకటిన్నర దశాబ్దం క్రితం తెలుగునాట సంచలనం సృష్టించింది. కట్ చేస్తే.. ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్ బాట పట్టనుందని సమాచారం. విశేషమేమిటంటే.. ఈ రీమేక్ లో తెలుగు స్టార్ హీరోగా నటించనుండడం. ఆ హీరో మరెవరో కాదు.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్! కెరీర్ లో 'రాక్షసుడు' మినహా మరో హిట్ లేనప్పటికీ.. శ్రీనివాస్ నటించిన చిత్రాలన్నీ దాదాపుగా హిందీలో అనువాదమయ్యాయి. యూట్యూబ్ వేదికగా సంచలనం సృష్టించాయి. అలాడే డబ్బింగ్ అండ్ శాటిలైట్స్ పరంగానూ లాభాల బాట పట్టాయి.
ఈ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకునే ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ.. శ్రీనివాస్ తో 'ఛత్రపతి' రీమేక్ ప్లాన్ చేసిందట. త్వరలోనే దర్శకుడు, ఇతర వివరాలు అధికారికంగా వెల్లడయ్యే అవకాశముందని సమాచారం. మరి.. అనువాదాలతో హిందీ బాబులను అలరించిన బెల్లంకొండ శ్రీనివాస్.. నేరుగా చేస్తున్న ఈ రీమేక్ తో ఏ స్థాయిలో ఆకట్టుకుంటారో చూడాలి.
కాగా, బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రం 'అల్లుడు అదుర్స్' చిత్రీకరణ తుది దశలో ఉంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.