సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్ నేపథ్యంలో కేసులు ప్రతిరోజూ కొత్త మలుపులు తీసుకుంటున్నాయి. ఇన్నాళ్ళూ బయట వ్యక్తులు, అభిమానులు సినిమా ప్రముఖులపై కేసులు పెట్టారు. అయితే, సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిపై సుశాంత్ తండ్రి కేసు పెట్టడంతో దేశవ్యాప్తంగా ప్రజల దృష్టి ఈ కేసు మీదకు వచ్చింది.
రియా చక్రవర్తి ముంబైలో ఉంటున్నారు. సుశాంత్ తండ్రి బీహార్లోని పాట్నాలో ఉంటున్నారు. ఆయన అక్కడే కేసు వేశారు. దాంతో రియాను ఆరెస్ట్ చేయడానికి బీహార్ పోలీసులు ముంబై చేరుకున్నారు. అయితే, రియా తన ఫ్లాట్లో లేదు. ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. అదృశ్యమైనట్టు తెలుస్తోంది. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
మరోవైపు న్యాయవాది ద్వారా రియా చక్రవర్తి సుప్రీమ్ కోర్టు తలుపు తట్టారు. పాట్నాలో సుశాంత్ తండ్రి పెట్టిన కేసును ముంబైకి ట్రాన్సఫర్ చేయమని కోరినట్టు సమాచారం అందుతోంది. కేసు పాట్నాలో ఉంటే రియా అక్కడికి వెళ్ళి రావాల్సి ఉంటుంది. పైగా, సూసైడ్ ముంబైలో జరిగింది కనుక విచారణ కూడా ముంబైలో చేయమని కోరుతున్నట్టు ఉన్నారు.